బ్రిటన్ వెళ్లాలనుకునే వారికి తీపి కబురు

ABN , First Publish Date - 2021-08-13T01:40:46+05:30 IST

కరోనా ఆంక్షల నేపథ్యంలో భారత్-బ్రిటన్ మధ్య విమాన సర్వీసులు పరిమిత సంఖ్యలో నడుస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో భారత్ నుంచి యూకే వెళ్లేవారి సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది.

బ్రిటన్ వెళ్లాలనుకునే వారికి తీపి కబురు

సోమవారం నుంచి విమాన సర్వీసులు డబుల్

న్యూఢిల్లీ: కరోనా ఆంక్షల నేపథ్యంలో భారత్-బ్రిటన్ మధ్య విమాన సర్వీసులు పరిమిత సంఖ్యలో నడుస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో భారత్ నుంచి యూకే వెళ్లేవారి సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుండడంతో విద్యార్థులు బ్రిటన్‌కు క్యూకడుతున్నారు. ఇక డిమాండ్‌కు తగ్గ సర్వీసులు లేకపోవడంతో విమాన టికెట్ల ధరలు ఆకాశాన్నంటాయి. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా విమాన టికెట్ల ధరలు భారీగా పెరగడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజాగా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధరలను నేలకు దించాలనే ఉద్దేశంతో విమాన సర్వీసులను పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే సోమవారం(ఆగస్టు 16) నుంచి ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులను రెట్టింపు చేస్తున్నట్లు పేర్కొంది.


ప్రస్తుతం భారత్ నుంచి బ్రిటన్‌కు వీక్లీ నడుస్తున్న మొత్తం 30 విమాన సర్వీసులను సోమవారం నుంచి 60కి పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం నడుస్తున్న 30 విమాన సర్వీసుల్లో ఎయిర్ ఇండియా 26, విస్తార 4 సర్వీసులు నడిపిస్తున్నాయి. ఆగస్టులో ఢిల్లీ-లండన్ వన్‌వే ఎకనామీ క్లాస్ టికెట్ ధర ఏకంగా 1.5 లక్షకు చేరింది. పైగా యూకేకు చేరుకున్న తర్వాత 10 రోజుల పాటు అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ప్రయాణికులు సొంత ఖర్చులతో నిర్భంద క్వారంటైన్‌లో ఉండడం తప్పనిసరి. ఇది అదనపు వ్యయం. అప్పటికే విమాన టికెట్ల కోసం భారీగా ఖర్చు చేసిన భారత ప్రయాణికులు, అక్కడికి చేరిన క్వారంటైన్ కోసం మరికొంత వెచ్చించాల్సి రావడంతో తడిసి మోపెడవుతుంది. వీటన్నింటిని దృష్టిలోపెట్టుకుని భారత ప్రభుత్వం ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు పెంచాలని నిర్ణయించింది.           

Updated Date - 2021-08-13T01:40:46+05:30 IST