ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్.. మూడో స్థానానికి పడిపోయిన టీమిండియా

ABN , First Publish Date - 2022-01-20T21:46:05+05:30 IST

ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌లో దుమ్మురేపి 4-0తో ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన ఆస్ట్రేలియా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో..

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్.. మూడో స్థానానికి పడిపోయిన టీమిండియా

దుబాయ్: ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌లో దుమ్మురేపి 4-0తో ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన ఆస్ట్రేలియా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకింది. అదే సమయంలో ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న భారత జట్టు మూడో స్థానానికి పడిపోయింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా టెస్టు జట్టు ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది.


ఇందులో భారత్, ఆస్ట్రేలియా జట్ల ర్యాంకులు తారుమారయ్యాయి. యాషెస్ సిరీస్‌ గెలుపుతో రెండు స్థానాలు ఎగబాకి ఆసీస్ అగ్రస్థానానికి చేరుకోగా, దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ను 1-2తో చేజార్చుకున్న టీమిండియా రెండు స్థానాలు దిగజారి మూడో స్థానానికి పడిపోయింది. 


అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఖాతాలో 119 రేటింగ్ పాయింట్లు ఉండగా, 117 పాయింట్లతో న్యూజిలాండ్ ఆ తర్వాతి స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఉన్న భారత జట్టు ఖాతాలో 101 పాయింట్లు ఉన్నాయి. భారత్‌పై టెస్టు సిరీస్ నెగ్గిన సౌతాఫ్రికా ఒక స్థానం ఎగబాకి 99 పాయంట్లతో 99 పాయింట్లతో ఐదో స్థానానికి చేరుకోగా, 101 పాయింట్లతో ఇంగ్లండ్ నాలుగో స్థానంలో ఉంది.


ఇక పాకిస్థాన్ (93) ఒక స్థానం దిగజారి ఆరోస్థానానికి పడిపోగా, శ్రీలంక (83), వెస్టిండీస్ (75), బంగ్లాదేశ్ (53), జింబాబ్వే (31) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచి టాప్-10లో చోటు దక్కించుకున్నాయి.

Updated Date - 2022-01-20T21:46:05+05:30 IST