Abn logo
Nov 30 2020 @ 05:07AM

సిరీస్‌ పాయె..

రెండో వన్డేలోనూ భారత్‌ ఓటమి 

స్మిత్‌ సెంచరీ జూకోహ్లీ, రాహుల్‌ పోరాటం వృథా


గెలిచి తీరాల్సిన రెండో వన్డేలోనూ భారత్‌ నుంచి అదే ఆటతీరు.. అటు ఎస్‌సీజీలో ఆస్ట్రేలియా మరోసారి తడాఖా చూపించింది. ఈసారి తమ టాప్‌-5 ఆటగాళ్లంతా ముప్పేటదాడికి దిగడంతో భారత బౌలర్లు విలవిల్లాడారు. స్మిత్‌ భారత్‌పై వరుసగా మూడో మ్యాచ్‌లోనూ శతకంతో విరుచుకుపడగా, భారత్‌ బ్యాటింగ్‌ ఎప్పటిలాగే చతికిలపడింది. దీంతో మరో మ్యాచ్‌ ఉండగానే సిరీస్‌ కోల్పోయింది.


సిడ్నీ: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ ఫలితమేమిటో తేలిపోయింది. బౌలింగ్‌.. ఫీల్డింగ్‌లో ఎప్పటిలాగే నిరాశపర్చిన భారత్‌ ఇన్నింగ్స్‌లో అటు బ్యాటింగ్‌ కూడా ఏమంత గొప్పగా సాగలేదు. దీంతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా 51 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా ఆసీస్‌ 2-0తో సిరీ్‌సను ఖాయం చేసుకుంది. చివరిదైన మూడో వన్డే బుధవారం కాన్‌బెరాలో జరగనుంది. ఇక ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌ (64 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 104) మరోసారి కళాత్మక ఇన్నింగ్స్‌తో సెంచరీ బాదాడు. వార్నర్‌ (77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 83), లబుషేన్‌ (61 బంతుల్లో 5 ఫోర్లతో 70), మ్యాక్స్‌వెల్‌ (29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 నాటౌట్‌), ఫించ్‌ (69 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 60) రాణించారు. దీంతో ఆసీస్‌ 50 ఓవర్లలో 4 వికెట్లకు 389 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 338 పరుగులు చేసింది. కోహ్లీ (87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 89), రాహుల్‌ (66 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 76) ఫర్వాలేదనిపించారు. కమిన్స్‌కు 3, హాజెల్‌వుడ్‌.. జంపాకు రెండేసి వికెట్లు దక్కాయి. స్మిత్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.


ఆ ఇద్దరి పోరాటం: ఆరంభంలో వేగంగా ఆడినప్పటికీ ఓపెనర్లు ధవన్‌ (30), మయాంక్‌ (28) మొదటి పవర్‌ప్లేలోనే వెనుదిరిగారు. 60/2 స్కోరు ఉన్న దశలో కోహ్లీ, శ్రేయాస్‌ (38) ఇన్నింగ్స్‌ చక్కదిద్ది మూడో వికెట్‌కు 93 పరుగులందించారు. కోహ్లీ ఈ మైదానంలో తొలిసారి అర్ధసెంచరీ పూర్తి చేశాడు. కాసేపటికే అయ్యర్‌ ఇచ్చిన క్యాచ్‌ను స్మిత్‌ ఎడమవైపునకు డైవ్‌చేస్తూ కళ్లుచెదిరే రీతిలో పట్టేశాడు. ఇక రాహుల్‌తో కలిసి కోహ్లీ  నాలుగో వికెట్‌కు 72 పరుగులందించాడు. రన్‌రేట్‌ పెరుగుతుండడంతో దూకుడు ప్రదర్శించిన కోహ్లీని మిడ్‌ వికెట్‌లో హెన్రిక్‌ డైవింగ్‌ క్యాచ్‌తో వెనక్కి పంపాడు. అయితే కీలక సమయంలో రాహుల్‌ను జంపా అవుట్‌ చేయగా.. 47వ ఓవర్‌లో జడేజా (24), పాండ్యా (28) వికెట్లను కమిన్స్‌ తీయడంతో భారత్‌ కోలుకోలేకపోయింది.


టాప్‌-5 అదుర్స్‌: టాస్‌ గెలవగానే మరోసారి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఈసారి ఏకంగా తొలి ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ కనీసం అర్ధసెంచరీలతో అదరగొట్టారు. చివర్లో మ్యాక్స్‌వెల్‌ మరోసారి బ్యాట్‌ ఝుళిపించడంతో ఆసీస్‌ భారీ లక్ష్యాన్ని భారత్‌ ముందుంచింది. ఓపెనర్లు వార్నర్‌, ఫించ్‌ తొలి వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఆ తర్వాత స్మిత్‌ కసిగా బ్యాటింగ్‌ కొనసాగించాడు. తొలి వన్డేలో 66 బంతుల్లో శతకం సాధించిన తను ఈసారి 62 బంతుల్లోనే ఈ మార్కును చేరుకున్నాడు. సెంచరీ తర్వాత స్మిత్‌ను హార్దిక్‌ పాండ్యా అవుట్‌ చేశాడు. అనంతరం 42వ ఓవర్లో బ్యాటింగ్‌కు దిగిన మాక్స్‌వెల్‌.. లబుషేన్‌తో కలిసి మోత మోగించాడు.


హార్దిక్‌.. ఏడాది తర్వాత

ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఏడాది తర్వాత తొలిసారి బౌలింగ్‌కు దిగాడు. నాలుగు ఓవర్లు వేసిన పాండ్యా కీలక స్మిత్‌ వికెట్‌ తీయడం విశేషం. శరీరంపై ఒత్తిడి పడకుండా తన బౌలింగ్‌ శైలిని మార్చుకున్నాడు.


వార్నర్‌కు గాయం

ఓపెనర్‌ వార్నర్‌ గజ్జల్లో నొప్పి కారణంగా మూడో వన్డేకు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ధవన్‌ ఆడిన షాట్‌ను ఆపే క్రమంలో అతడు గాయపడ్డాడు. ఈ క్రమంలో చివరి మ్యాచ్‌లో డేవిడ్‌ ఆడేది అనుమానమేనని కెప్టెన్‌ ఫించ్‌ తెలిపాడు. 


విరాట్‌@ 22వేలు

ఆసీ్‌సతో జరిగిన ఈ రెండో వన్డే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి 250వ మ్యాచ్‌. భారత్‌ నుంచి ఈ ఫీట్‌ సాధించిన తొమ్మిదో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అలాగే అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం 22వేల పరుగులు పూర్తి చేశాడు. అంతేకాకుండా వన్డేల్లో 500 ఫోర్లు బాదిన తొలి భారత కెప్టెన్‌గా ధోనీ (499)ని దాటేశాడు. ఓవరాల్‌గా పాంటింగ్‌ 794 ఫోర్లతో ముందున్నాడు.


1 - ఆసీస్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోరు (727) నమోదు కావడం ఇదే తొలిసారి.

3 - వన్డేల్లో మొదటి ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ (ఆసీస్‌) 50+ రన్స్‌ సాధించడం ఇది మూడోసారి మాత్రమే. గతంలో పాక్‌ (2008లో) జింబాబ్వేపై, ఆసీస్‌ (2013లో) భారత్‌పై ఈ ఫీట్‌ సాధించాయి.


స్కోరుబోర్డు

ఆసీస్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (రనౌట్‌) 83; ఫించ్‌ (సి) కోహ్లీ (బి) షమి 60; స్మిత్‌ (సి) షమి (బి) పాండ్యా 104; లబుషేన్‌ (సి) మయాంక్‌ (బి) బుమ్రా 70; మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 63; హెన్రిక్స్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 50 ఓవర్లలో 389/4. వికెట్ల పతనం: 1-142, 2-156, 3-292, 4-372. బౌలింగ్‌: షమి 9-0-73-1; బుమ్రా 10-1-79-1; సైనీ 7-0-70-0; చాహల్‌ 9-0-71-0; జడేజా 10-0-60-0; మయాంక్‌ 1-0-10-0; హార్దిక్‌ 4-0-24-1.

భారత్‌ ఇన్నింగ్స్‌: మయాంక్‌ (సి) క్యారీ (బి) కమిన్స్‌ 28; ధవన్‌ (సి) స్టార్క్‌ (బి) హాజెల్‌వుడ్‌ 30; కోహ్లీ (సి) హెన్రిక్స్‌ (బి) హాజెల్‌వుడ్‌ 89; శ్రేయాస్‌ (సి) స్మిత్‌ (బి) హెన్రిక్స్‌ 38; రాహుల్‌ (సి) హాజెల్‌వుడ్‌ (బి) జంపా 76; హార్దిక్‌ (సి) స్మిత్‌ (బి) కమిన్స్‌ 28; జడేజా (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) కమిన్స్‌ 24; సైనీ (నాటౌట్‌) 10; షమి (సి అండ్‌ బి) మ్యాక్స్‌వెల్‌ 1; బుమ్రా (ఎల్బీ) జంపా 0; చాహల్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 50 ఓవర్లలో 338/9. వికెట్ల పతనం: 1-58, 2-60, 3-153, 4-225, 5-288, 6-321, 7-321, 8-326, 9-328. బౌలింగ్‌: స్టార్క్‌ 9-0-82-0; హాజెల్‌వుడ్‌ 9-0-59-2; కమిన్స్‌ 10-0-67-3; జంపా 10-0-62-2; హెన్రిక్స్‌ 7-0-34-1; మ్యాక్స్‌వెల్‌ 5-0-34-1.

Advertisement
Advertisement
Advertisement