ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. టెస్టు సిరీస్ కైవసం

ABN , First Publish Date - 2021-03-06T21:35:57+05:30 IST

ఇంగ్లండ్‌తో ఇక్కడి నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన చివరి టెస్టులో కోహ్లీ సేన ఘన విజయం సాధించింది.

ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. టెస్టు సిరీస్ కైవసం

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో ఇక్కడి నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన చివరి టెస్టులో కోహ్లీ సేన ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌ను ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఫలితంగా ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తన తొలి ఇన్సింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌట్ కాగా, బదులుగా భారత్ 365 పరుగులు చేసింది.


అనంతరం రెండో ఇన్సింగ్స్ ప్రారంభించిన ఇంగ్లిష్ జట్టు 135 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. టీమిండియా బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ మాయాజాలం ముందు పర్యాటక జట్టు బ్యాట్స్‌మెన్ నిలవలేకపోయారు. ఇద్దరూ పోటీలు పడి వికెట్లు తీస్తూ బ్యాట్స్‌మెన్‌ను కుదురుకోనివ్వకుండా చేశారు.


అశ్విన్, అక్షర్ ఇద్దరూ చెరో ఐదు వికెట్లు తీసుకుని ఇంగ్లండ్ పరాజయాన్ని శాసించారు. ఆ జట్టులో డేనియల్ లారెన్స్ చేసిన 50 పరుగులే అత్యధికం. కెప్టెన్ జో రూట్ 30 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. 


ఇంగ్లండ్ కకావికలమైన పిచ్‌పై భారత ఆటగాళ్లు రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్‌లు అద్భుత ఆటతీరుతో అభిమానుల మనసులు దోచుకున్నారు. పంత్ సెంచరీతో అదరగొట్టగా, సుందర్ 96 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ 49, అక్షర్ పటేల్ 43 పరుగులు చేశాడు. ఈ విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టు తన స్థానాన్ని ఖాయం చేసుకుంది.


భారత్-ఇంగ్లండ్ మధ్య మొత్తం నాలుగు టెస్టులు జరగ్గా, చెన్నైలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 227 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. ఆ తర్వాత అదే స్టేడియంలో జరిగిన రెండో ె టెస్టులో భారత్ 317 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అహ్మదాబాద్‌లో జరిగిన పింక్ బాల్ టెస్టులో కోహ్లీ సేన 10 వికెట్ల తేడాతో విజయం సాధించగా, చివరిదైన నాలుగో టెస్టులో ఏకంగా ఇన్సింగ్స్ 25 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.

Updated Date - 2021-03-06T21:35:57+05:30 IST