పాక్ క్రికెటర్లకు వీసాలు ఇచ్చేందుకు భారత్ ఓకే!

ABN , First Publish Date - 2021-04-17T23:06:05+05:30 IST

అక్టోబర్‌లో జరిగే ఐసీసీ వరల్డ్ టీ20 కోసం భారత్‌కు వచ్చేందుకు పాకిస్తాన్ జట్టుకు లైన్ క్లియర్ అయ్యింది....

పాక్ క్రికెటర్లకు వీసాలు ఇచ్చేందుకు భారత్ ఓకే!

న్యూఢిల్లీ: అక్టోబర్‌లో జరిగే ఐసీసీ వరల్డ్ టీ20 కోసం భారత్‌కు వచ్చేందుకు పాకిస్తాన్ జట్టుకు లైన్ క్లియర్ అయ్యింది. దాయాది దేశం నుంచి ఆటగాళ్లు ఇక్కడికి ప్రయాణించేందుకు వీలుగా ప్రభుత్వం వీసాలు మంజూరు చేయనుంది. పాకిస్తాన్ ఆటగాళ్లకు వీసాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా ఇప్పటికే అపెక్స్ కౌన్సిల్‌కు వెల్లడించినట్టు సమాచారం. ‘‘పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు వీసా సమస్య తీరిపోయింది. అయితే మ్యాచ్‌లు చూడడానికి అభిమానులు సరిహద్దులు దాటి వచ్చేందుకు అనుమతించడంపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై కూడా త్వరలోనే నిర్ణయం వెలువడుతుంది. దీన్ని త్వరలోనే పరిష్కారం అవుతుందని మేము ఐసీసీకి హామీ ఇచ్చాం... ’’ అని అపెక్స్ కౌన్సిల్ సభ్యుడొకరు మీడియాకు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో గడచిన కొన్నేళ్ల నుంచి ఇప్పటి వరకు భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగలేదు. వరల్డ్ టీ20 కోసం బీసీసీఐ ఇప్పటికే తొమ్మిది వేదికలను సిద్ధం చేసింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ తదితర మైదానాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. 

Updated Date - 2021-04-17T23:06:05+05:30 IST