భారత్‌ ఎప్పుడూ శ్రీలంక కాజాలదు

ABN , First Publish Date - 2022-07-16T09:40:40+05:30 IST

భారత్‌ ఎప్పుడూ శ్రీలంక కాజాలదు

భారత్‌ ఎప్పుడూ శ్రీలంక కాజాలదు

పొరుగు, పశ్చిమ దేశాల విషప్రచారం 

తిప్పికొట్టాల్సిన బాధ్యత భారతీయులందరిదీ 

దామరాజు పుండరీకాక్షుడు పుస్తకావిష్కరణ సభలో వెంకయ్య

విజయవాడ, జూలై 15(ఆంధ్రజ్యోతి): భారతదేశం మరో శ్రీలంకలా ఎప్పుడూ మారబోదని, దేశాన్ని దుర్భేద్యంగా తీర్చిదిద్దటం కోసం వ్యవస్థల్లో మార్పు తీసుకురావటానికి కేంద్రం అనేక పటిష్ఠమైన సంస్కరణలను తీసుకువస్తోందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. జాతీయ కవి చక్రవర్తిగా పేరుపొందినదామరాజు పుండరీకాక్షుడు జీవితం, సాహిత్యం గురించి పరిశోధించి రూపొందించిన పుస్తకాన్ని శుక్రవారం ఆయన కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత ట్రస్ట్‌ ఆడిటోరియంలో ఆవిష్కరించారు. పుస్తక రచయిత ఎల్లాప్రగడ మల్లికార్జునరావును వెంకయ్య అభినందించా రు. స్వాతంత్య్ర సమరయోధులను చిత్ర హింసలకు గురి చేస్తున్న రోజుల్లో గాంధీజీని నాయకుడిగా చిత్రీకరిస్తూ దామరాజు పుండరీకాక్షుడు రాసిన నాటకం తెలుగు నాట ప్రసిద్ధి చెందిందని ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇటీవల మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించడం ద్వారా అల్లూరి కీర్తి దేశ వ్యాప్తంగా తెలిసిందన్నారు. అనంతరం వెంకయ్య దేశంలోని పరిస్థితులపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న  భారత దేశం మీద ఈర్ష్య, అసూయలతో మన పొరుగు దేశాలతో పాటు, కొన్ని పశ్చిమ దేశాలు కూడా విష ప్రచారానికి దిగుతున్నాయన్నారు. దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు కుట్ర లు జరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటి వాటిని తిప్పి కొట్టేందుకు దేశ ప్రజలంతా సంఘటితం కావాల్సి ఉందని వెంకయ్య పిలుపునిచ్చారు.  

Updated Date - 2022-07-16T09:40:40+05:30 IST