చాహర్‌ అద్భుతః

ABN , First Publish Date - 2021-07-21T08:40:45+05:30 IST

276 పరుగుల భారీ ఛేదన.. తొలి ఐదు ఓవర్లలోనే రెండు వికెట్లు ఫట్‌.. మధ్యలో సూర్యకుమార్‌ అర్ధసెంచరీ సాధించినా 193 పరుగులకే ఏడుగురు పెవిలియన్‌కు చేరిన వేళ ఓటమి ఖాయమే అనిపించింది.

చాహర్‌ అద్భుతః

రెండో వన్డేలో భారత్‌ విజయం 

దీపక్‌, సూర్యకుమార్‌ అర్ధసెంచరీలు



276 పరుగుల భారీ ఛేదన.. తొలి ఐదు ఓవర్లలోనే రెండు వికెట్లు ఫట్‌.. మధ్యలో సూర్యకుమార్‌ అర్ధసెంచరీ సాధించినా 193 పరుగులకే ఏడుగురు పెవిలియన్‌కు చేరిన వేళ ఓటమి ఖాయమే అనిపించింది. కానీ ఎవరి అంచనాలో లేని దీపక్‌ చాహర్‌ అనూహ్యంగా బ్యాట్‌ ఝుళిపించాడు. 82 బంతులనెదుర్కొని అజేయ అర్ధసెంచరీతో జట్టుకు సిరీస్‌నే అందించాడు.


కొలంబో: రాహుల్‌ ద్రవిడ్‌ పర్యవేక్షణలో యువ భారత్‌ అంచనాలకు మించి రాణిస్తోంది. మంగళవారం జరిగిన రెండో వన్డేలో తీవ్ర ఒత్తిడిని తట్టుకుంటూ ఎనిమిదో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌ దీపక్‌ చాహర్‌ (82 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 69 నాటౌట్‌) క్రీజులో నిలిచిన తీరు అబ్బురపరిచింది. అతడి ఆటతీరుతో శ్రీలంకపై భారత జట్టు 3 వికెట్ల తేడాతో నెగ్గి మరో మ్యాచ్‌ ఉండగానే 2-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. ఫెర్నాండో (50), అసలంక (65), కరుణరత్నె (44 నాటౌట్‌) రాణించారు. చాహల్‌, భువనేశ్వర్‌లకు మూడేసివికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో భారత్‌ 49.1 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసి నెగ్గింది. సూర్యకుమార్‌ (53) అర్ధసెంచరీ సాధించగా, ఎనిమిదో వికెట్‌కు చాహర్‌-భువనేశ్వర్‌ (19 నాటౌట్‌) మధ్య 84 పరుగులు రావడం విశేషం. హసరంగకు మూడు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా దీపక్‌ చాహర్‌ నిలిచాడు.


సూర్య, చాహర్‌ అదుర్స్‌

భారీ ఛేదనలో భారత జట్టు ఆరంభంలోనే తడబడింది. తొలి ఐదు ఓవర్లలోనే ఓపెనర్‌ పృథ్వీ షా (13), ఇషాన్‌ కిషన్‌ (1)ల వికెట్లను కోల్పోయింది. కాసేపటికే క్రీజులో కుదురుకున్న కెప్టెన్‌ ధవన్‌ (29)ను హసరంగ ఎల్బీగా అవుట్‌ చేయడంతో 65/3 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో మనీశ్‌ (37), సూర్యకుమార్‌ జోడీ జట్టును ఆదుకుంది. వీరు నాలుగో వికెట్‌కు 32 బంతుల్లోనే 50 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీకి 18వ ఓవర్‌లో బ్రేక్‌ పడింది. పాండే రనౌట్‌ కాగా ఆ వెంటనే హార్దిక్‌ (0) డకౌటయ్యాడు. అయితే సూర్య మాత్రం దూకుడు తగ్గించలేదు. 42 బంతుల్లోనే కెరీర్‌లో తొలి హాఫ్‌ సెంచరీని సాధించాడు. కానీ మరో ఐదు బంతులకే సండకన్‌ అతడి వికెట్‌ తీశాడు. ఆరో వికెట్‌కు క్రునాల్‌తో కలిసి 44 పరుగులు జోడించాడు.


సూర్య నిష్క్రమణ తర్వాత క్రునాల్‌ పాండ్యా (35) పట్టుదలగా ఆడాడు. కానీ 36వ ఓవర్‌లో హసరంగ అతడిని బౌల్డ్‌ చేసి లంకకు ఊరటనిచ్చాడు. అప్పటికి 83 పరుగులు కావాల్సి ఉండగా చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ దశలో దీపక్‌ చాహర్‌ నిలకడగా ఆడుతూ ఏకంగా హాఫ్‌ సెంచరీ సాధించాడు. స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ తరహాలో కచ్చితమైన షాట్లతో లంక బౌలర్లను ఆడుకున్నాడు. అతడికి భువీ సహకరించాడు. దీంతో జట్టు విజయంపై ఆశలు పెరిగాయి. ఆఖరి ఓవర్‌లో మూడు పరుగులు కావాల్సి ఉండగా దీపక్‌ తొలి బంతినే ఫోర్‌గా మలిచి గెలిపించాడు.


స్కోరుబోర్డు

శ్రీలంక: ఫెర్నాండో (సి) క్రునాల్‌ (బి) భువనేశ్వర్‌ 50; భనుక (సి) మనీశ్‌ (బి) చాహల్‌ 36; రాజపక్స (సి) ఇషాన్‌ (బి) చాహల్‌ 0; ధనంజయ (సి) ధవన్‌ (బి) చాహర్‌ 32; అసలంక (సి సబ్‌) దేవ్‌దత్‌ (బి) భువనేశ్వర్‌ 65; షనక (బి) చాహల్‌ 16; హసరంగ (బి) చాహర్‌ 8; కరుణరత్నె (నాటౌట్‌) 44; చమీర (సి సబ్‌) దేవ్‌దత్‌ (బి) భువనేశ్వర్‌ 2; సండకన్‌ (రనౌట్‌) 0; రజిత (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 21; మొత్తం: 50 ఓవర్లలో 275/9. వికెట్ల పతనం: 1-77, 2- 77, 3-124, 4-134, 5-172, 6-194, 7-244, 8-264, 9-266. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 10-0-54-3; దీపక్‌ చాహర్‌ 8-0-53-2; హార్దిక్‌ 4-0-20-0; చాహల్‌ 10-1-50-3; కుల్దీప్‌ 10-0-55-0; క్రునాల్‌ 8-0-37-0.


భారత్‌: పృథ్వీ షా (బి) హసరంగ 13; ధవన్‌ (ఎల్బీ) హసరంగ 29; ఇషాన్‌ (బి) రజిత 1; మనీశ్‌ పాండే (రనౌట్‌) 37; సూర్యకుమార్‌ (ఎల్బీ) సండకన్‌ 53; హార్దిక్‌ (సి) ధనంజయ (బి) షనక 0; క్రునాల్‌ (బి) హసరంగ 35; చాహర్‌ (నాటౌట్‌) 69; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు: 21; మొత్తం: 49.1 ఓవర్లలో 277/7. వికెట్ల పతనం: 1-28, 2-39, 3-65, 4-115, 5-116, 6-160, 7-193. బౌలింగ్‌: రజిత 7.1-0-53-1; చమీర 10-0-65-0; హసరంగ 10-0-37-3; సండకన్‌ 10-0-71-1; కరుణరత్నె 6-1-26-0; షనక 3-0-10-1; ధనంజయ 3-0-10-0.

Updated Date - 2021-07-21T08:40:45+05:30 IST