భారత్‌లో కరోనా పరిస్థితి, సాయంపై.. ప్రవాసులతో రాయబారి భేటీ

ABN , First Publish Date - 2021-05-08T17:56:06+05:30 IST

కువైట్‌లోని భారత రాయబారి సిబి జార్జ్ శుక్రవారం అక్కడి భారతీయ ప్రవాసులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రవాసులతో చర్చించారు.

భారత్‌లో కరోనా పరిస్థితి, సాయంపై.. ప్రవాసులతో రాయబారి భేటీ

కువైట్ సిటీ: కువైట్‌లోని భారత రాయబారి సిబి జార్జ్ శుక్రవారం అక్కడి భారతీయ ప్రవాసులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రవాసులతో చర్చించారు. అలాగే ఇప్పటి వరకు కువైట్ నుంచి భారత్‌కు అందిన సాయం గురించి వారికి తెలియజేశారు. రాయబారి మాట్లాడుతూ.. 'మన మాతృదేశానికి కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా దెబ్బకోడుతోంది.' అని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో మహమ్మారి ఉధృతి కారణంగా ఇరు దేశాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. అన్ని విమాన సర్వీసులు రద్దు అయ్యాయని, వందే భారత్ మిషన్ విమానాలు సైతం ఆగిపోయాయని తెలిపారు. ప్రస్తుతం భారత్ కఠిన సవాళ్లు ఎదుర్కొంటుందని రాయబారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత్‌కు వివిధ దేశాల నుంచి అందుతున్న అత్యవసర వైద్య సాయం గురించి ప్రవాసులకు వివరించారు. 


కువైట్ సహా 40కి పైగా దేశాలు ఈ సంక్షోభ సమయంలో భారత్‌కు సహకరిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. దీనిలో భాగంగా ఏప్రిల్ 27వ తేదీ నుంచి భారత్.. యూకే, ఐర్లాండ్, రొమానియా, రష్యా, యూఏఈ, అమెరికా, తైవాన్, కువైట్, ఫ్రాన్స్, థాయిలాండ్, జర్మనీ, ఉజ్బెకిస్తాన్, బెల్జీయం, ఇటలీ వంటి పలు దేశాల నుంచి వైద్య సామాగ్రి, ఇతర సాయం పొందుతున్నట్లు రాయబారి పేర్కొన్నారు. ఇక కువైట్.. భారత్‌కు సాయం అందించేందుకు ముందుకు వచ్చిన దేశాల్లో మొదటి కంట్రీ అని తెలిపారు. ప్రస్తుతం కువైట్ నుంచి భారత్‌కు సాయం కొనసాగుతోందన్నారు. మే 4న ఢిల్లీ చేరుకున్న కువైట్ ఎయిర్ ఫోర్స్ విమానం కేఏఎఫ్ 3201.. 40 టన్నుల వైద్య సామాగ్రిని చేరవేసినట్లు చెప్పారు. వీటిలో 11 వెంటిలేటర్లు, 282 ఆక్సిజన్ సిలిండర్లు, 60 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఇతర వైద్య పరికరాలు ఉన్నాయన్నారు. 


అలాగే మే 4న కువైట్ నుంచి కోల్‌కతా వెళ్లిన విమానంలో ప్రభుత్వం తరఫున 40 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇక కువైట్‌లోని భారత కమ్యూనిటీ విరాళంగా ఇచ్చిన 200 ఆక్సిజన్ సిలిండర్లు, 4 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో కువైట్ మర్చెంట్ ఓడ మే 5న బయల్దేరిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే 1000 ఆక్సిజన్ సిలిండర్లు, 75 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌తో మే 6న మరో విమానం భారత్ వెళ్లిందన్నారు. ఇలా ఇప్పటి వరకు భారత్‌కు అందిన సహాయాన్ని ప్రవాసులకు రాయబారి వివరించారు. భారత్‌లో కరోనా సంక్షోభం తొలిగిపోయే వరకు ప్రపంచ దేశాలు తమకు తోచిన సాయం చేయాలని ఈ సందర్భంగా సిబి జార్జ్ పిలుపునిచ్చారు. అలాగే వివిధ దేశాల్లోని భారతీయులు కూడా మాతృదేశానికి సాయం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.   

Updated Date - 2021-05-08T17:56:06+05:30 IST