Abn logo
Jan 5 2021 @ 02:14AM

జూలో జంతువులమా?

  • షెడ్యూల్‌ ప్రకారమే బ్రిస్బేన్‌ టెస్టు
  • ఆంక్షలపై భారత క్రికెటర్ల అసహనం

మెల్‌బోర్న్‌: కొవిడ్‌-19 నిబంధనలకు సంబంధించి వరుసగా జరుగుతున్న పరిణామాలపై భారత జట్టులో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఓవైపు స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతిస్తూనే.. తమపై మాత్రం కఠిన ఆంక్షలేమిటని ప్రశ్నిస్తున్నారు. తమను జూలో జంతువుల్లా చూడడం సబబు కాదని అంటున్నారు. మూడో టెస్టు జరిగే సిడ్నీలోనూ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తుండడంతో ఇక్కడి ప్రొటోకాల్‌ ప్రకారం మ్యాచ్‌ ముగిశాక ఆటగాళ్లంతా నేరుగా హోటల్‌కు వెళ్లి గదుల్లోనే ఉండాల్సి ఉంటుంది. ‘ప్రేక్షకులు మాత్రం స్వేచ్ఛగా స్టేడియాల్లోకి వచ్చి మ్యాచ్‌ను తిలకించేందుకు అనుమతిస్తున్నారు. కానీ మమ్మల్ని మాత్రం మైదానంలో క్రికెట్‌ ఆడాక నేరుగా హోటల్‌కు వెళ్లి క్వారంటైన్‌లో ఉండాలంటున్నారు. కరోనా టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చాక కూడా ఇలా హోటళ్లో బందీలవడం ఏమిటి? మేమంతా జూలో జంతువుల్లా ఉండాలనుకోవడం లేదు. సగటు ఆస్ట్రేలియన్‌కు ఎలాంటి నిబంధనలు ఉన్నాయో, మాకు కూడా అలాగే ఉండాలి. ఐపీఎల్‌ మాదిరి ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లను ఆడించి మమ్మల్ని క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తే ఓ అర్థముండేది’ అని జట్టు సభ్యుడు ఒకరు అభిప్రాయపడ్డాడు. మరోవైపు బ్రిస్బేన్‌లో ఆంక్షల గురించి సీఏ మెడికల్‌ టీమ్‌ గత వారమే టీమిండియాకు సమాచారం అందించిందట. కానీ దీనిపై ఆటగాళ్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనట్టు తెలిసింది.


బ్రిస్బేన్‌ టెస్టుపై ఆ వార్తలు నిజం కావు: సీఏ

బ్రిస్బేన్‌లో కఠిన ఆంక్షల కారణంగా చివరి టెస్టు ఆడేందుకు బీసీసీఐ నిరాకరిస్తోందన్న కథనాలను క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) తోసిపుచ్చింది. క్వీన్స్‌లాండ్‌లో కరోనా నిబంధనల గురించి బీసీసీఐకి పూర్తి అవగాహన ఉందని సీఏ సీఈవో నిక్‌ హాక్లే స్పష్టం చేశాడు. అలాగే వాటిని పాటించేందుకు పూర్తి మద్దతు ప్రకటించిందని కూడా చెప్పాడు. ‘ప్రతి రోజూ బీసీసీఐతో మాట్లాడుతున్నాం. వారి నుంచి ఎలాంటి వ్యతిరేకత రాలేదు. చాలా మద్దతుగా ఉన్నారు. వేదిక మార్పు గురించి కూడా మాతో చర్చించలేదు. షెడ్యూల్‌ ప్రకారమే ఇరు జట్లు నాలుగో టెస్టు ఆడాలనుకుంటున్నాయి’ అని హాక్లే తెలిపాడు.


రోహిత్‌ సహా అందరికీ నెగెటివ్‌

బయో బబుల్‌ను అతిక్రమించి మెల్‌బోర్న్‌లోని ఓ రెస్టారెంట్‌కు ఐదుగురు క్రికెటర్లు వెళ్లడం చర్చనీయాంశం కాగా.. ఆదివారం అందరికీ కరోనా టెస్టులు జరిపించారు. అయితే ఇందులో ఎవరూ పాజిటివ్‌గా తేలలేదని బీసీసీఐ ప్రకటించింది. సోమవారం ఆర్‌టీ-పీసీఆర్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. దీంట్లో ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బంది ఫలితాలు నెగెటివ్‌గా రావడంతో జట్టు ఊపిరిపీల్చుకుంది. ఆ తర్వాత మూడో టెస్టు కోసం ఆటగాళ్లంతా సిడ్నీ బయలుదేరారు.25 శాతం మందికే అనుమతి

సిడ్నీలో ప్రస్తుతం కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో స్టేడియంలోకి వచ్చే ప్రేక్షకుల సంఖ్య కూడా భారీగా తగ్గనుంది. గతంలో 50శాతం మందిని అనుమతించాలని నిర్ణయించినా.. తాజా పరిస్థితుల్లో దానిని 25 శాతానికి తగ్గించారు. ఎస్‌సీజీ 38 వేల సామర్థ్యంతో ఉండగా.. కొత్త నిబంధనతో రోజుకు 9,500 మందికి మాత్రమే ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించే అవకాశం ఉంది. ఇప్పటికే టిక్కెట్లను కొనుగోలు చేసిన వారికి నగదు వాపస్‌ చేస్తున్నట్టు తెలిపింది. తిరిగి విక్రయాలు చేపడతామని క్రికెట్‌ ఆస్ట్రేలియా పేర్కొంది. 

Advertisement
Advertisement
Advertisement