ప్రవాసులకు కువైత్‌లోని భారత ఎంబసీ కీలక సూచన!

ABN , First Publish Date - 2021-08-06T14:04:17+05:30 IST

కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసులను తిరిగి తమ దేశానికి వచ్చేందుకు కొన్ని గల్ఫ్ దేశాలు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వీటిలో కువైత్ కూడా ఉంది.

ప్రవాసులకు కువైత్‌లోని భారత ఎంబసీ కీలక సూచన!

కువైత్ సిటీ: కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసులను తిరిగి తమ దేశానికి వచ్చేందుకు కొన్ని గల్ఫ్ దేశాలు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వీటిలో కువైత్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా కువైత్‌లోని భారత ఎంబసీ ప్రవాసులకు కీలక సూచనలు చేసింది. ప్రధానంగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ సమర్పించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సందర్భంగా ఎంబసీ ప్రస్తావించింది. కువైత్ ఆరోగ్యశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో వ్యాక్సిన్‌కు సంబంధించిన సర్టిఫికేట్‌ను అప్‌లోడ్ చేసిన తర్వాత ప్రవాసులకు సంబంధిత అధికారుల నుంచి కచ్చితమైన సందేశం వస్తోందని పేర్కొంది. ఈ సందేశం వచ్చిన తర్వాతే ప్రయాణానికి ప్రణాళిక వేసుకోవాలని సూచించింది. 


ముఖ్యంగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ క్యాన్సిల్ అయిన వారికి, అది ఎందుకు క్యాన్సిల్ అయిందనే విషయాన్ని సంబంధిత అధికారులు ఈ-మెయిల్‌ ద్వారా సందేశం పంపించడం జరుగుతుందని తెలిపింది. ఆ సందేశంలో పేర్కొన్న తప్పులను సరిచేసుకుని మళ్లీ ధృవపత్రాన్ని అప్‌డేట్ చేసుకోవాలని కోరింది. టీకా సర్టిఫికేట్‌కు కువైత్ సంబంధిత అధికారుల నుంచి ఆమోదం లభించిన తర్వాతే ప్రవాసులు స్వదేశం నుంచి బయల్దేరాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో సమస్యలు తప్పవని హెచ్చరించింది. ఇక ఎదైనా అత్యావసర పరిస్థితి ఉన్న ప్రవాసులు రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలంటే పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని ఎంబసీ తెలియజేసింది. దీనికోసం దరఖాస్తుదారుడి పాస్‌పోర్టు, సివిల్ ఐడీ, ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్ పత్రాలు(అందుబాటులో ఉంటే), కువైత్ ఆరోగ్యశాఖలో వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్లు సూచించే ఆధారం(మొబైల్ స్క్రీన్‌షాట్ ఫొటో కూడా పంపించవచ్చు), వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ పంపించాల్సి ఉంటుందని ఎంబసీ స్పష్టం చేసింది. 

Updated Date - 2021-08-06T14:04:17+05:30 IST