దుబాయిలోని ఇండియన్ రెస్టారెంట్.. రోటీలతో ‘కరోనా’ మెసేజ్

ABN , First Publish Date - 2020-04-06T18:09:30+05:30 IST

కరోనా బారిన పడకుండా ఉండమని చాలా మంది అనేక రకాలుగా చెబుతూ వస్తున్నారు.

దుబాయిలోని ఇండియన్ రెస్టారెంట్.. రోటీలతో ‘కరోనా’ మెసేజ్

దుబాయి: కరోనా బారిన పడకుండా ఉండమని చాలా మంది అనేక రకాలుగా చెబుతూ వస్తున్నారు. సినిమా వాళ్లు పాటల రూపంలో చెబితే.. ఆర్టిస్ట్‌లు ఆర్ట్ రూపంలో చెబుతున్నారు. తాజాగా దుబాయిలోని ఓ ఇండియన్ రెస్టారెంట్ తమ రెస్టారెంట్‌లోని రోటీల ద్వారా కరోనా మెసేజ్ అందిస్తోంది. హోమ్ డెలివరీ చేసే రోటీలపై ‘చేతులు కడుక్కున్నారా’ అనే అచ్చు వేసి ప్రజలకు మెసేజ్ పంపిస్తున్నారు. దుబాయిలోని జెమేరా లేక్స్ టవర్స్, ఔద్ మేథాలలో సాగర్ రత్నా అనే ఇండియన్ రెస్టారెంట్ ఉంది. పీయుష్ మాలూ, పూజా మాలూ, ఆశిష్ మారు అనే ముగ్గురు భారతీయులు ఈ రెస్టారెంట్‌ను నడుపుతున్నారు.


ఒక స్టీల్ ప్లేట్ ద్వారా రోటీలపై ‘చేతులు కడుక్కున్నారా.. సాగర్ రత్నా’ అనే అచ్చు వేస్తున్నట్టు పూజా తెలిపారు. ఈ స్టీల్ ప్లేట్, ముద్ర కూడా దుబాయి మున్సిపాలిటీ స్టాండర్డ్స్ కింద ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ముద్ర వేసిన తరువాత రోటీని ఓవెన్‌లో పెట్టడం వల్ల ముద్ర అలాగే ఉండిపోతుందన్నారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకే తాము ఈ ప్రయత్నం చేస్తున్నట్టు పీయూష్ చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల తమ కస్టమర్లకు రోటీలను తినే ముందు కచ్చితంగా చేతులు కడుక్కోవాలనే విషయం గుర్తొస్తుందని ఆయన తెలిపారు. భారత వంటకాలను చేతులతోనే తింటారు కాబట్టి.. చేతులను శుభ్రపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  

Updated Date - 2020-04-06T18:09:30+05:30 IST