ఐఎస్‌ఎల్‌కు వేళాయె!

ABN , First Publish Date - 2020-11-20T10:09:51+05:30 IST

అతిపెద్ద దేశీయ ఫుట్‌బాల్‌ సంబరం... ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఏడో అంచె పోటీలకు తెర లేవనుంది.

ఐఎస్‌ఎల్‌కు వేళాయె!

నేటి నుంచే సీజన్‌-7 

 తొలి మ్యాచ్‌లో ఏటీకేతో కేరళ ఢీ


బాంబోలిమ్‌ (గోవా): అతిపెద్ద దేశీయ ఫుట్‌బాల్‌ సంబరం... ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఏడో అంచె పోటీలకు తెర లేవనుంది. కొవిడ్‌-19 కారణంగా విధించిన లాక్‌డౌన్‌ తర్వాత భారత్‌లో జరుగుతున్న తొలి లీగ్‌ ఐఎ్‌సఎల్‌నే కావడం విశేషం. శుక్రవారం గోవాలోని బాంబోలిమ్‌ జీఎంసీ మైదానంలో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఏటీకే మోహన్‌ బగాన్‌ జట్టుతో కేరళ బ్లాస్టర్స్‌ తలపడనుంది. ఇప్పటివరకు మూడుసార్లు టైటిల్‌ దక్కించుకున్న ఏటీకే మరోసారి ట్రోఫీపై కన్నేయగా, రెండుసార్లు రన్నర్‌పగా సరిపెట్టుకున్న కేరళ ఈసారి ఎలాగైనా చాంపియన్‌ కావాలని ఉవ్విళ్లూరుతోంది. దీంతో ఇరు జట్లు బోణీ కొట్టాలని పట్టుదలగా ఉండడంతో మ్యాచ్‌ రసవత్తరంగా సాగే అవకాశముంది.


ఈనెల 23న ఒడిశాతో జరిగే మ్యాచ్‌తో హైదరాబాద్‌ జట్టు ఈ సీజన్‌లో తన ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో జరిగే ఈ లీగ్‌లో మొత్తం 11 జట్లు 55 మ్యాచ్‌లు ఆడనున్నాయి. జనవరి 11తో లీగ్‌ మ్యాచ్‌లు ముగిస్తాయి. కరోనా దృష్ట్యా ఈసారి అన్ని మ్యాచ్‌లను గోవాలోనే నిర్వహిస్తున్నారు. నాకౌట్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను డిసెంబరులో విడుదల చేయనున్నారు. ఇక, లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్లందరూ విజయవంతంగా క్వారంటైన్‌ ముగించుకోవడం.. అందరికీ కొవిడ్‌ వైద్య పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో ఐఎ్‌సఎల్‌ బాలరిష్టాలను అధిగమించి అసలు పోరుకు సిద్ధమైంది.


ఈ టోర్నీని ఆదర్శంగా తీసుకొని..

ఐఎ్‌సఎల్‌ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఏటీకే మోహన్‌బగాన్‌ జట్టు సహ యజమాని, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ చెప్పాడు. ‘ఐఎ్‌సఎల్‌ ప్రేరణతో ఇతర క్రీడలు కూడా ప్రారంభమవుతాయి. కరోనా వైరస్‌ వల్ల ఏది చేయాలన్నా పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది. ఐఎ్‌సఎల్‌ విజయవంతమైతే అలాంటి భయాలన్నీ కొంతవరకూ దూరమవుతాయి’ అని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

Updated Date - 2020-11-20T10:09:51+05:30 IST