Abn logo
Jul 19 2021 @ 03:48AM

బోణీ అదిరె..

  • ధవన్‌, ఇషాన్‌ అర్ధసెంచరీలు
  • మెరిసిన పృథ్వీ షా
  • తొలి వన్డేలో లంకపై భారత్‌ విజయం

కొలంబో: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ ఆరంభ మ్యాచ్‌లోనే భారత కుర్రాళ్లు అదరగొట్టారు. కెప్టెన్‌ ధవన్‌ (95 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 86 నాటౌట్‌) టాప్‌స్కోరర్‌గా కనిపించినా.. బర్త్‌డే బాయ్‌ ఇషాన్‌ కిషన్‌ (42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 59), ఓపెనర్‌ పృథ్వీ షా (24 బంతుల్లో 9 ఫోర్లతో 43) మెరుపు ఇన్నింగ్స్‌ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. సూర్యకుమార్‌ (20 బంతుల్లో 5 షోర్లతో 31 నాటౌట్‌) కూడా తనదైన శైలిలో ఆడాడు. దీంతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్‌ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. అంతకుముందు లంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 262 రన్స్‌ సాధించింది. కరుణరత్నె (43 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌. దీపక్‌ చాహర్‌, చాహల్‌, కుల్దీ్‌పకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్‌ 36.4 ఓవర్లలో 3 వికెట్లకు 263 పరుగులు చేసింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా పృథ్వీ షా నిలిచాడు. సంజూ శాంసన్‌ గాయంతో మ్యాచ్‌కు దూరమవగా, అతని స్థానంలో కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌ అరంగేట్రం చేశాడు. సూర్యకుమార్‌కు కూడా ఇదే తొలి వన్డే.ఇషాన్‌, షా దూకుడు: ఛేదనలో భారత్‌ ఇన్నింగ్స్‌ దూకుడుగా ఆరంభమైంది. టీ20 మ్యాచ్‌ తరహాలో యువ క్రికెటర్లు పృథ్వీ షా (43), ఇషాన్‌ కిషన్‌ లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. మరోవైపు కెప్టెన్‌ ధవన్‌ నిలకడైన ఆటతో ఆకట్టుకున్నాడు. ముందుగా ఓపెనర్‌ షా జోరుతో ఓవర్‌కు పది రన్‌రేట్‌తో పరుగులు వచ్చాయి. అతడి బ్యాటింగ్‌ ధాటితో తొలి వికెట్‌కు 33 బంతుల్లోనే  58 రన్స్‌ వచ్చాయి. ఆ తర్వాత వన్‌డౌన్‌లో ఇషాన్‌ తన తొలి రెండు బంతులను 6,4గా మలిచి అదుర్స్‌ అనిపించుకున్నాడు. ఆ తర్వాత క్రీజును వదిలి ఆడుతూ బౌండరీలు సాధించాడు. అలాగే 15వ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లతో 32 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. కానీ అతడి జోరుకు 18వ ఓవర్‌లో సందకన్‌ బ్రేక్‌ వేశాడు. తర్వాత భారత్‌ ఆటలో వేగం తగ్గినా సాధించాల్సిన రన్‌రేట్‌ స్వల్పంగా ఉండడంతో ఇబ్బంది లేకపోయింది. ఓవైపునిలకడగా ఆడిన కెప్టెన్‌ ధవన్‌ 61 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. మనీశ్‌ పాండే (26)తో కలిసి నాలుగో వికెట్‌కు 72 రన్స్‌ భాగస్వామ్యం అందించాడు. అనంతరం సూర్యకుమార్‌తో కలిసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.


చివర్లో వేగం: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఒక్క బ్యాట్స్‌మన్‌ అర్ధసెంచరీ చేయకపోయినా ఈ పిచ్‌పై సవాల్‌ విసిరే స్కోర్‌ను సాధించింది. అటు ఆరంభ, చివరి ఓవర్లలో భారత బౌలర్లు తడబడ్డారు. ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో (33), భనుక (27) తొలి వికెట్‌కు 49 పరుగులు అందించారు. చాహల్‌ తన తొలి బంతికే ఫెర్నాండోను అవుట్‌ చేశాడు. ఆ తర్వాత మరో లెగ్గీ కుల్దీప్‌ మాయ చేస్తూ 17వ ఓవర్‌లో భనుక, రాజపక్స (24) వికెట్లను తీసి లంకను దెబ్బ కొట్టాడు. అలాగే మధ్య ఓవర్లలో క్రునాల్‌ కట్టుదిట్టమైన బంతులతో ఇబ్బందిపెట్టాడు. దీంతో పది ఓవర్ల పాటు కనీసం ఫోర్‌ కూడా రాలేదు. కెప్టెన్‌ షనక (39), చరిత్‌ (38) కలిసి ఐదో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. చివర్లో కరుణరత్నె భారీ షాట్లతో చెలరేగి స్కోరును పెంచాడు. భువీ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 19 పరుగులు సాధించాడు. 


1  శ్రీలంకపై తక్కువ ఇన్నింగ్స్‌ (17)లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌ ధవన్‌. అలాగే ఈ ఫార్మాట్‌లో 6వేల పరుగులు  పూర్తి చేసిన పదో భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

2 బర్త్‌ డే రోజు వన్డే అరంగేట్రం చేసిన రెండో భారత క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌. గతంలో గురుశరణ్‌ సింగ్‌ (1990) ఈ ఫీట్‌ సాధించాడు. అలాగే వన్డే అరంగేట్రంలో వేగవంతమైన (33 బంతుల్లో) ఫిఫ్టీ చేసిన ఇషాన్‌ రెండో క్రికెటర్‌ అయ్యాడు. అంతేకాకుండా భారత్‌ తరఫున టీ20, వన్డే అరంగేట్రంలోనూ హాఫ్‌ సెంచరీతో రాబిన్‌ ఊతప్ప సరసన నిలిచాడు.


స్కోరుబోర్డు

శ్రీలంక: ఫెర్నాండో (సి) మనీశ్‌ (బి) చాహల్‌ 33; భనుక (సి) షా (బి) కుల్దీప్‌ 27; రాజపక్స (సి) ధవన్‌ (బి) కుల్దీప్‌ 24; ధనంజయ (సి) భువనేశ్వర్‌ (బి) క్రునాల్‌ 14; చరిత్‌ (సి) ఇషాన్‌ (బి) చాహర్‌ 38; షనక (సి) హార్దిక్‌ (బి) చాహల్‌ 39; హసరంగ (సి) ధవన్‌ (బి) చాహర్‌ 8; కరుణరత్నె (నాటౌట్‌) 43; ఉడాన (సి) చాహర్‌ (బి) హార్దిక్‌ 8; చమీర (రనౌట్‌) 13; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 50 ఓవర్లలో 262/9. వికెట్ల పతనం: 1-49, 2-85, 3-89, 4-117, 5-166, 6-186, 7-205, 8-222, 9-262. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 9-0-63-0; దీపక్‌ చాహర్‌ 7-1-37-2; హార్దిక్‌ 5-0-34-1; చాహల్‌ 10-0-52-2; కుల్దీప్‌ 9-1-48-2; క్రునాల్‌ 10-1-26-1.

భారత్‌: పృథ్వీ షా (సి) ఫెర్నాండో (బి) ధనంజయ 43; ధవన్‌ (నాటౌట్‌) 86; ఇషాన్‌ (సి) భనుక (బి) సందకన్‌ 59; మనీశ్‌ (సి) షనక (బి) ధనంజయ 26; సూర్యకుమార్‌ (నాటౌట్‌) 31; ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 36.4 ఓవర్లలో 263/3. వికెట్ల పతనం: 1-58, 2-143, 3-215. బౌలింగ్‌: చమీర 7-0-42-0; ఉడాన 2-0-27-0; ధనంజయ 5-0-49-2; సండకన్‌ 8.4-0-53-1; చరిత్‌ 3-0-26-0; హసరంగ 9-1-45-0; కరుణరత్నె 2-0-16-0.