Miss Universe 2021గా భారత సుందరి.. 21 ఏళ్ల తర్వాత భారత్‌కు కిరీటం

ABN , First Publish Date - 2021-12-13T14:51:29+05:30 IST

మిస్‌ యూనివర్స్‌ 2021 పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన 21 ఏళ్ల పంజాబ్ సుందరి హర్నాజ్‌ కౌర్ సంధు విజేతగా నిలిచారు. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్‌కు విశ్వ సుందరి కిరీటం దక్కినట్లైంది. ఈ ఏడాది ‘లివా మిస్‌ దివా యూనివర్స్‌’ కిరీటాన్నీ సొంతం చేసుకోవడంతో హర్నాజ్‌కు ‘మిస్‌ యూనివర్స్‌-2021’లో భారత్ తరఫున పోటీ చేసే...

Miss Universe 2021గా భారత సుందరి.. 21 ఏళ్ల తర్వాత భారత్‌కు కిరీటం

ఇంటర్నెట్‌డెస్క్: మిస్‌ యూనివర్స్‌ 2021 పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన 21 ఏళ్ల పంజాబ్ సుందరి హర్నాజ్‌ కౌర్ సంధు విజేతగా నిలిచారు. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్‌కు విశ్వ సుందరి కిరీటం దక్కినట్లైంది. ఈ ఏడాది ‘లివా మిస్‌ దివా యూనివర్స్‌’ కిరీటాన్నీ సొంతం చేసుకోవడంతో హర్నాజ్‌కు ‘మిస్‌ యూనివర్స్‌-2021’లో భారత్ తరఫున పోటీ చేసే అవకాశం దక్కింది. అంతకుముందు హర్నాజ్ 2019లో 'మిస్ ఇండియా పంజాబ్‌'గా నిలిచారు. అనంతరం ఆమె ‘లివా మిస్‌ దివా యూనివర్స్‌’లో పాల్గొని కిరీటం దక్కించుకున్నారు. దాంతో తాజాగా ఇజ్రాయిల్‌లో జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న హర్నాజ్ కౌర్ విజేతగా నిలిచి విశ్వ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. గతంలో భారత్ నుంచి మిస్ యూనివర్స్‌ కిరీటాన్ని సుస్మితాసేన్‌ (1994), లారాదత్తాలు (2000) మాత్రమే సాధించారు. 21 ఏళ్ల తర్వాత ఇప్పుడు హర్నాజ్ సంధు దక్కించుకోవడం విశేషం. 


ఇక 17 ఏళ్లకే ఫ్యాషన్‌ రంగంలో అడుగుపెట్టి జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లిన ఈ చండీగఢ్ భామకు బాల్యం నుంచే మోడలింగ్‌పై అమితమైన ఆసక్తి. అటు వెండితెరపై కూడా మెరవాలనుకునేది. అందుకే విద్యార్థి దశలోనే సినిమాల్లో నటించడంపై దృష్టిసారించింది. మొదట మోడలింగ్‌లో బాగా రాణించిన హర్నాజ్ ఆ తర్వాత చాలా తక్కువ వ్యవధిలోనే పంజాబీ చిత్రాల్లో నటించే అవకాశాలను చేజిక్కించుకుంది. ఇప్పటికే ఆమె నటించిన రెండు పంజాబీ చిత్రాలు 2022లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక మోడల్‌గానూ ఎన్నో వేదికలపై మెరిసిన హర్నాజ్ ఇప్పుడు ఇలా విశ్వ వేదికపై ఏకంగా మిస్ యూనివర్స్‌గా టైటిల్ సాధించడం విశేషం. ఈసారి తప్పకుండా కిరీటం సాధించి సుస్మితాసేన్‌, లారాదత్తాల సరసన చేరతానని ఈ పంజాబీ చిన్నది ముందే చెప్పింది. అన్నట్లే విజయం సాధించి దేశం గర్వపడేలా చేసింది. ప్రస్తుతం పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేస్తోంది హర్నాజ్. విశ్వ సుందరిగా నిలిచిన ఆమెకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.            



Updated Date - 2021-12-13T14:51:29+05:30 IST