బుల్స్‌ జోరు..రికార్డుల హోరు

ABN , First Publish Date - 2021-08-04T08:17:29+05:30 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం సరికొత్త రికార్డులతో హోరెత్తాయి. బుల్స్‌ జోరుతో సూచీలు ఆరంభం నుంచే దూకుడును కనబరిచాయి.

బుల్స్‌ జోరు..రికార్డుల హోరు

  • నిఫ్టీ @ 16,130 ట సెన్సెక్స్‌ 53,823 స్థాయికి 
  • సరికొత్త గరిష్ఠాలకు సూచీలు
  • రూ.240 లక్షల కోట్లకు మార్కెట్‌ క్యాప్‌ 


ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం సరికొత్త రికార్డులతో హోరెత్తాయి. బుల్స్‌ జోరుతో సూచీలు ఆరంభం నుంచే దూకుడును కనబరిచాయి. దీంతో ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ తొలిసారి కీలకమైన 16,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. మరోవైపు బీఎ్‌సఈ సెన్సెక్స్‌ కూడా అదే జోష్‌ను కనబరిచింది. ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటపడుతోందన్న ఆశలతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు దిగటంతో నిఫ్టీ 245.60 పాయింట్ల లాభంతో ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయి 16,130.75 పాయింట్ల వద్ద ముగిసింది. ఒక దశలో నిఫ్టీ 16,146.90 పాయింట్లతో మరో ఆల్‌టైమ్‌ హై స్థాయిని కూడా తాకటం విశేషం. కొనుగోళ్ల దన్నుతో సెన్సెక్స్‌ 872 పాయింట్లు లాభపడి 53,823.36 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ ఒక దశలో 937 పాయింట్ల లాభంతో మరో ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయి 53,888 పాయింట్లను తాకింది. కీలక సూచీలు రికార్డు స్థాయిల్లో ముగియటం ఇదే మొదటిసారి. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 27 కంపెనీల షేర్లు మంగళవారం లాభాలను నమోదు చేశాయి. ఈ ఏడాది మే తర్వాత సూచీలు ఇంత భారీగా పెరగటం కూడా ఇదే తొలిసారి.  


6 నెలల సమయం

నిఫ్టీ 15,000 పాయింట్ల నుంచి 16,000 పాయింట్లను చేరేందుకు ఆరు నెలల సమయం పట్టిం ది. కాగా 10 వేల పా యింట్ల నుంచి 16 వేల పాయింటకు చేరేందుకు నిఫ్టీకి నాలుగేళ్ల సమయం తీసుకుంది. 2021లో నిఫ్టీ ఇప్పటి వరకు 14 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది.

 

ఒక్క రోజే రూ.2.4 లక్షల కోట్లు అప్‌ 

మార్కెట్‌ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజే రూ.2.4 లక్షల కోట్లు పెరిగింది. దీంతో బీఎ్‌సఈ మార్కెట్‌ క్యాప్‌ రూ.2,40,04,664.28 కోట్ల రికార్డు స్థాయికి చేరింది. గత ఏడాది (2020-21) నమోదైన భారత జీడీపీతో పోలిస్తే ఇది దాదాపు 10-15 శాతం ఎక్కువ. 


ఇన్ఫోసిస్‌

మంగళవారం నాటి ర్యాలీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు బాగా కలిసొచ్చింది. బీఎ్‌సఈలో ఈ కంపెనీ షేరు 1.56 శాతం (రూ.25.40) లాభంతో రూ.1,656.75 వద్ద ముగిసింది. కొనుగోళ్ల మద్దతుతో ఇంట్రాడేలో షేరు రూ.1,658.70 రికార్డు స్థాయిని తాకింది.  దీంతో ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.7.05 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్‌ క్యాప్‌పరంగా చూస్తే ప్రస్తుతం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ తర్వాత ఇన్ఫోసిస్‌ అతి పెద్ద కంపెనీ.

Updated Date - 2021-08-04T08:17:29+05:30 IST