తారాస్థాయికి బీజేపీ-టీఆర్‌ఎస్ మధ్య పొలిటికల్ వార్.. ఢీ అంటే ఢీ!

ABN , First Publish Date - 2021-01-15T16:26:45+05:30 IST

బీజేపీ-టీఆర్‌ఎస్ మధ్య పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరుకుంటోందా !

తారాస్థాయికి బీజేపీ-టీఆర్‌ఎస్ మధ్య పొలిటికల్ వార్.. ఢీ అంటే ఢీ!

మంచిర్యాల జిల్లాలో బీజేపీ-టీఆర్‌ఎస్ మధ్య పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరుకుంటోందా ! తాజాగా బీజేపీ నేతలపై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చేసిన ఘాటైన వ్యాఖ్యలు మరింత మంట పుట్టిస్తున్నాయా? జిల్లాలో బలపడేందుకు కమలనాథులు ఎలాంటి ఎత్తులు వేస్తున్నారు? కమలం పార్టీని ఎదుర్కోవడానికి గులాబీ పార్టీ ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది? వాచ్ దిస్ స్టోరి..!


ఢీ అంటే ఢీ.. 

మంచిర్యాల జిల్లాలో టిఆర్ఎస్ -బీజేపీ  మధ్య పొలిటికల్ వార్ అంతకంతకు ముదురుతోంది. ఇరు పార్టీల నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఢీ అంటే ఢీ అంటున్నారు. వారి ఆరోపణలు- ప్రత్యారోపణలతో రాజకీయం హీటెక్కుతోంది.  ఆ రాజకీయ ఆరోపణలు...ఇప్పుడు వ్యక్తిగత విమర్శలకు దారితీస్తున్నాయి. మరీ ముఖ్యంగా మంచిర్యాల-చెన్నూరు నియోజకవర్గాల్లో పరిస్థితి అదుపు తప్పుతోంది. తిట్టిన తిట్టు తిట్టకుండా ఒకరినొకరు తిట్టుకుంటున్నారు.


ఘాటు వ్యాఖ్యలు..

ఇటీవల మంచిర్యాల మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, విప్ సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, ఎంపీ వెంకటేష్ ఎమ్మెల్యేలు దివాకర్ రావు,చిన్నయ్యతదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్.. బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ లక్ష్యంగా పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశారు.  తమ అధినేత కేసీఆర్‌ను విమర్శిస్తున్న వారి నాలుక కోస్తాం...తోలు తీస్తామంటూ  హెచ్చరికలు జారీ చేశారు. సమయం వచ్చినప్పుడు బదులు తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ సతీష్ కుమార్ సైతం బీజేపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.


దూకుడు పెంచిన కమలనాథులు..

ఇక కమలనాథులు ఫుల్‌ యాక్టీవ్ కావడానికి మరో కారణం కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం కేంద్ర నిఘా విభాగం అధికారులు ఒక సర్వే చేశారట.  జిల్లాలో ప్రజాబలం ఉన్న నాయకులకు సంబంధించిన డేటా సేకరించారట. గతంలో బీజేపీ,సంఘ్ పరివార్ అనుబంధ సంస్థల్లో పనిచేసి ప్రస్తుతం ఇతర పార్టీల్లో కొనసాగుతున్న నేతలతో మాట్లాడి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొందరు పార్టీ మారడానికి గల కారణాలు, ప్రస్తుతం వారి పరిస్థితిపై ఆరా తీసినట్లు సమాచారం. తటస్థుల్లో బీజేపీ భావజాలంతో ఉన్న వారి నుంచి సమాచారం సేకరించినట్లు భోగట్ట. ఇలా రాబోయే రోజుల్లో బీజేపీ గెలుపు కోసం పనిచేసేలా పకడ్బందీ ప్రణాళిక సిద్ధమవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే జిల్లా బీజేపీ నేతలు దూకుడు పెంచుతున్నారు.


బీజేపీ నేతలకు టచ్‌లో..!

ముందెన్నడూ ఈ స్థాయిలో బీజేపీ-టిఆర్‌ఎస్ మధ్య విమర్శల దాడి జరగలేదని స్థానికంగా చెవులు కొరుక్కుంటున్నారట. దుబ్బాక విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పుంజుకోవడంతో  కమలం పార్టీ నేతలు దూకుడు పెంచడానికి కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై వరుసగా ఆందోళనలు చేపడుతున్నారు. ఎమ్మెల్యేల పనితీరును ఎత్తి చూపుతున్నారు. గతంలో ఇచ్చిన హామీలపై నిలదీస్తున్నారు. బీజేపీ ముఖ్యనేతల క్షేత్ర స్థాయి పర్యటనలు పెరిగాయి.  టిఆర్ఎస్ అసంతృప్త నేతలు చాలా మంది బీజేపీ నాయకులతో టచ్‌లోకి వస్తున్నారట. ఇదికాస్త గులాబీ పార్టీ పెద్దలకు మింగుడు పడటం లేదన్న చర్చ సాగుతోంది.


పుండు మీద కారం పోసినట్లుగా..

అయితే బాల్క సుమన్ చేసిన విమర్శలపై కమలనాథులు కూడా అంతే తీవ్రంగా స్పందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి చెన్నూరు నియోజకవర్గం దాకా ఉన్న ఆ పార్టీ నేతలంతా బాల్క సుమన్‌పై  విమర్శలు ఎక్కుపెట్టారు. మందమర్రికి చెందిన ఓ బీజేపీ నేత చేసిన కామెంట్లు మరింత వైరల్ అవుతున్నాయి. బాల్క సుమన్ వ్యక్తిగత వ్యవహారాలపై ఆయన తీవ్ర పదజాలంతో సంచలన ఆరోపణలు చేశారు. ఇది కాస్త టిఆర్ఎస్ క్యాడర్‌కు పుండు మీద కారం పోసినట్లయింది. దాంతో గులాబీ కార్యకర్తలు తిట్ల పురాణం అందుకున్నారు. సోషల్‌ మీడియాలో తిట్ల దండకాన్ని వైరల్‌ చేస్తున్నారు. 


ఏ పార్టీ పాగా వేస్తుందో!?

అయితే ఇటీవల మారుతున్న సమీకరణలతో గులాబీ నాయకులు అలర్ట్ అవుతున్నారు. నిత్యం ఏదో ఒక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో  టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జనాల్లో ఉంటున్నారు. మరీ ముఖ్యంగా చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వైఖరిలో కొంత కాలంగా కొత్త మార్పు కనిపిస్తుందన్న చర్చ జరుగుతోంది. గతంలో పార్టీ నేతల ఇళ్లల్లో శుభ కార్యక్రమాలకు  ఆయన పెద్దగా హాజరయ్యేవారు కాదట. కానీ ఇటీవల రోజూ పదుల సంఖ్యలో ఫంక్న్లు,పరామర్శలకు హాజరవుతున్నారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అదే సమయంలో బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ నేతలు విమర్శిస్తే ఊరుకోవద్దనీ, ఘాటుగానే ఎదురు దాడి చేయాలని క్యాడర్‌ను ఆదేశించడంతో.. వారు కూడా కమలం పార్టీ నేతలపై నిప్పులు చెరుగుతున్నారు. మొత్తంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య వార్‌ ముదురుతోంది. మరి మంచిర్యాల జిల్లాలో ఏ పార్టీ పాగా వేస్తుందో చూడాలి.

Updated Date - 2021-01-15T16:26:45+05:30 IST