అసాధ్యమనుకున్న స్థానాల్లో గెలిచారు.. కానీ ఇంతలోనే..

ABN , First Publish Date - 2020-09-29T17:52:55+05:30 IST

వారిద్దరూ అధికార పార్టీకి చెందినవారు. వారిలో ఒకరు ఎంపీ కాగా.. మరొకరు ఎమ్మెల్యే. కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన వారిద్దరు.. సార్వత్రిక ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి గెలిచారు.

అసాధ్యమనుకున్న స్థానాల్లో గెలిచారు.. కానీ ఇంతలోనే..

వారిద్దరూ అధికార పార్టీకి చెందినవారు. వారిలో ఒకరు ఎంపీ కాగా.. మరొకరు ఎమ్మెల్యే. కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన వారిద్దరు.. సార్వత్రిక ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి గెలిచారు. అసాధ్యమనుకున్న స్థానాల్లో కలిసికట్టుగా ప్రచారం చేసి అధికార పీఠమెక్కారు. అయితే అందలం ఎక్కాక ఆ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. సామాజిక వర్గ విభేదాలతో బలప్రదర్శనకు పాల్పడటం.. ఆ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ ఎంపీ, ఎమ్మెల్యే ఎవరు? వారి మధ్య వివాదానికి అసలు కారణమేంటి? ఇది ఏ జిల్లాలోని రాజకీయం? వాచ్ దిస్ ఇంట్రస్టింగ్ స్టోరీ.


అనంతపురం జిల్లాలో బీసీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కళ్యాణదుర్గం. ఈ నియోజకవర్గం నుంచి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున ఉషశ్రీ చరణ్ పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే అనంతపురం పార్లమెంటు సభ్యుడిగా తలారి రంగయ్య ఎన్నికయ్యారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరూ.. కొత్తగా రాజకీయ అరంగేట్రం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డారు. అసాధ్యమనుకున్న స్థానాల్లో కలిసికట్టుగా ప్రచారం చేసి విజయం సాధించారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే చేతిలోకి అధికారమొచ్చిన తర్వాతే అసలు కథ మొదలైంది. కల్యాణదుర్గం నియోజకవర్గంలో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఇది రోజురోజుకి అధికమవుతోందని పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.


"నా నియోజకవర్గంలో నేను చెప్పిందే వేదం.. నాకు తెలియకుండా ఏదీ జరగకూడదు" అని ఉషశ్రీ చరణ్ చేస్తున్న హడావుడే ఈ వ్యవహారానికి కారణమని అధికార పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరుకు అసలు కారణం నియోజకవర్గంలోని అభివృద్ది పనులేనట. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు కాకుండా.. ఇతర ప్రాంతాల వారికి పనులు కట్టబెట్టడమేనని వారి అనుయాయులే చెవులు కొరుక్కుంటున్నారు.


కల్యాణదుర్గం నియోజకవర్గంలో వంద కోట్ల రూపాయలు విలువజేసే పనులను.. కడప, అనంతపురం చెందినవారికి కేటాయించారట. ఇదే ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ మధ్య వివాదానికి అసలు కారణమని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే ఉషశ్రీ అనుచరులే ఈ వ్యవహారాన్ని ఎంపీ తలారి రంగయ్య దృష్టికి తీసుకెళ్లారట. ఎన్నికల్లో పార్టీ కోసం అహర్నిశలు పని చేసినవారికి కాకుండా.. కమీషన్ల కోసం ఇతర ప్రాంతాల వారికి కాంట్రాక్టు పనులు అప్పగిస్తున్నారంటూ ఆయనతో వారు ఆవేదన చెందారట. దీంతో ఎంపీ తలారి రంగయ్యే నేరుగా రంగంలోకి దిగి పనులు చక్కబెట్టాలని చూస్తున్నారట. ఇందులో భాగంగానే ఎంపీ ల్యాడ్స్ కింద వచ్చిన కోటీ 75 లక్షల రూపాయల నిధులను నియోజకవర్గానికి కేటాయించారట. కొంతమంది నాయకులకు ఆ పనులను ఇవ్వాలంటూ ఎంపీ సిఫారసు చేసినప్పటికీ.. వాటిని ఎమ్మెల్యే పక్కన పెట్టేశారట. ఎంపీ సూచించిన వారికి తాను పనులు కేటాయించడమేమిటని ఆమె చిర్రుబుర్రులాడారట. దీంతో ఆ నిధులను ఏ అభివృద్ధి పనులకు ఉపయోగించక పోవడంతో.. అవి కాస్త ల్యాప్స్ అయిపోయాయని ఎంపీ వర్గీయులు ఎమ్మెల్యేపై మండిపడుతున్నారు.


ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే ఎంపీ, ఎమ్మెల్యే మధ్య తలెత్తిన మరో వివాదం.. ఇద్దరి మధ్య అంతరాన్ని ఇంకా పెంచిందట. నియోజకవర్గంలో అన్ని చోట్లా అభివృద్ధి పనులు సజావుగా జరుగుతుండగా.. ఒక్క గోళ్ల గ్రామంలో మాత్రం ఇబ్బందులు తలెత్తాయని సమాచారం. ఇక్కడ సచివాలయ నిర్మాణం, రైతు భరోసా కేంద్రంసహా ఇతర పనులను చేయకూడదంటూ గ్రామస్థులు అడ్డుకున్నారు.  అయితే ఈ గ్రామంలో ఎంపీ తలారి రంగయ్య సామాజికవర్గానికి చెందినవారే అధికంగా ఉన్నారు. దీంతో ఆయన అనుచరులే ఈ పనులను అడ్డుకున్నారంటూ సొంత పార్టీలో జోరుగా ప్రచారం సాగింది. ఈ పరిణామం ఇద్దరు నేతల మధ్య వివాదాన్ని మరింత ముదిరేలా చేసిందట.


ఇక నామినేటెడ్ పోస్టుల వ్యవహారం కూడా ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వివాదానికి ఆజ్యం పోసిందని టాక్. కల్యాణదుర్గం నియోజకవర్గంలో బీసీ సామాజికవర్గంలో బలమైన నాయకుడిగా ఉన్న తిప్పేస్వామికి.. వాల్మీకి ఫెడరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని ఎంపీ తలారి రంగయ్య ప్రతిపాదన చేశారట. ఈ ప్రతిపాదనకు జిల్లాలోని ముఖ్య నేతలందరూ సుముఖుత వ్యక్తం చేశారనీ, కానీ ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ మాత్రం దాన్ని సున్నితంగా తిరస్కరించారనీ భోగట్టా. నియోజకవర్గంలోని వాల్మీకి సామాజికవర్గంలో తిప్పేస్వామికి గట్టి పట్టు ఉండటం, ఎంపీ వర్గానికి చెందిన నేత కావడంతోనే ఎమ్మెల్యే ఉషశ్రీ.. ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. రాష్ట్రస్థాయి ఛైర్మన్ పదవి తిప్పేస్వామికి వస్తే.. నియోజకవర్గంలో తనకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతారన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యే ఉషశ్రీ అందుకు అడ్డుపడుతున్నారని ఎంపీ వర్గంవారు విమర్శిస్తున్నారు.


కల్యాణదుర్గం మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పదవిని కూడా ఎమ్మెల్యే ఉషశ్రీ తనకు అనుకూలంగా ఉన్న వారికే కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారట. తాను చెప్పిన విధంగా నడుచుకునే ఒక మహిళను మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా చేయాలని ఆమె పట్టుబట్టారని పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. మొత్తంమీద ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ తన స్థానాన్ని నియోజకవర్గంలో సుస్థిరపరుచుకోవాలనే ఉద్దేశంతోనే ముందుకు సాగుతున్నారట. ఎంపీ సూచించిన పనులేవీ తనకు తెలియకుండా చేయవద్దంటూ అధికారులకు ఎమ్మెల్యే హుకుం కూడా జారీ చేశారట. ఈ పరిస్థితి ఎంపీ తలారి రంగయ్యను ఉక్కిరిబిక్కిరి చేస్తోందట. మరి ఆయన.. కల్యాణదుర్గం నియోజకవర్గంలోని తన అనుచరవర్గాన్ని చేజారకుండా ఉండేందుకు మున్ముందు ఎలా వ్యవహరిస్తారో చూడాలి.

Updated Date - 2020-09-29T17:52:55+05:30 IST