Abn logo
Jun 5 2021 @ 00:46AM

స్ఫూర్తి ఒక్కటే, జీవితాలు వేరు

మహాత్మా గాంధీతో ప్రభావితులయిన ముగ్గురు అసాధారణ భారతీయులు గత నెలలో మనకు శాశ్వతంగా దూరమయ్యారు. ఒకరు తన అష్టపదులలోనూ, మరొకరు తన తొంభైలలోను చనిపోగా మూడో వ్యక్తి ఈ ధరిత్రిపై వంద సంవత్సరాలకు పైగా నడయాడారు. ఆ మువ్వురి మరణాలకు విచారగ్రస్తులమైన మనం వారి జీవితాలను స్ఫూర్తిదాయక సత్యగ్రహణకు ఆలంబనగా గౌరవించాలి.


ఈ మువ్వురు గాంధేయులలో మొదటి ఉదాత్తుడు ఉత్తరాఖండ్ వాసి సుందర్ లాల్ బహుగుణ. 1973లో ఎగువ అలకానంద లోయలో చిప్కో ఉద్యమం ప్రారంభమయ్యే నాటికే బహుగుణకు దశాబ్దాల సంఘసేవా చరిత్ర ఉంది. చిప్కో ఉద్యమ తొలి నిరసనలకు చండీప్రసాద్ భట్ నేతృత్వం వహించారు. ఈయనను చిప్కో ఉద్యమ వ్యవస్థాపకుడుగా బహుగుణ గౌరవించేవారు. చమోలీ జిల్లాలో స్త్రీపురుషుల చైతన్యశీల కార్యాచరణకు ఉత్తేజితుడైన బహుగుణ చిప్కో భావనను భాగీరథి (గంగ ఉపనది) పరీవాహక ప్రాంతానికి తీసుకువచ్చారు. చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఆయన ఉద్యమాలను నిర్వహించారు.


1981లో కలకత్తాలో బహుగుణను నేను మొదటిసారి కలుసుకున్నాను. చిప్కో ఉద్యమంపై నా డాక్టోరల్ పరిశోధన ప్రారంభమైన రోజులవి. ఆ ఉద్యమంపై ప్రసంగాలు వెలువరించేందుకు ఆయన కలకత్తాకు వచ్చారు. శ్రోతలను మంత్రముగ్ధులను చేసే వక్త ఆయన. రెండు సంవత్సరాల అనంతరం బడ్యార్ లోయలో నా క్షేత్ర పరిశోధనా కృషిలో భాగంగా బహుగుణతో కలిసి పనిచేసిన రైతు మహిళలను ఇంటర్వ్యూ చేశాను. నా పరిశోధనా క్రమంలో చండీ ప్రసాద్ భట్, సుందర్ లాల్ బహుగుణ ఇరువురి పట్లా నాలో గౌరవాదరాలు పాదుకున్నాయి. ఢిల్లీలోని జర్నలిస్టులు, విద్యావేత్తలు ఆ ఇరువురిలో ఒకరిని మాత్రమే చిప్కో ఉద్యమ ‘నిజమైన’ నాయకుడుగా పరిగణించేవారు. వాస్తవానికి భట్, బహుగుణ ఇరువురూ ఆ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. దరిమిలా చిప్కో ఉద్యమ సందేశాన్ని హిమాలయ ప్రాంతాలన్నిటికీ బహుగుణ తీసుకువెళ్ళారు. ఉత్తరాఖండ్‌లో అట్టడుగుస్థాయిలో పునర్నిర్మాణ కార్యకలాపాలకు భట్ పరిమితమయ్యారు. మహిళలు, విద్యార్థులను సమీకరించి అడవుల అభివృద్ధికి కృషి చేశారు. సేవ, ఉద్యమ క్రియాశీల జీవిత పథాలలోకి ప్రవేశించేలా అసంఖ్యాక యువ భారతీయులను వారిరువురూ విశేషంగా ప్రభావితం చేశారు.


మేధ, కార్యదక్షత, ధైర్యసాహసాలు, జనాకర్షణలో బహుగుణకు దీటైన మరో ఉదాత్తుడు కర్ణాటక కర్మయోగి హారోహళ్లి శ్రీనివాసయ్య దొరెస్వామి. ఈ గాంధేయవాది బహుగుణ కంటే పదేళ్ళు పెద్ద. చిప్కో మహర్షి మరణించిన ఐదు రోజుల తరువాత విగతుడైన ఈ కర్మవీరుడికి మరింత సుదీర్ఘమైన సేవా చరిత్ర ఉంది. 1936లో నంది హిల్స్‌కు వచ్చిన మహాత్మా గాంధీని విద్యార్థిగా ఉన్న దొరెస్వామి తొలుత కలుసుకున్నారు. గాంధీతో విశేషంగా ప్రభావితుడైన దొరెస్వామి మైసూర్ సంస్థానంలో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. పర్యవసానంగా సుదీర్ఘకాలం జైలువాసం చేశారు. స్వతంత్ర భారత తొలి దశాబ్దాలలో సర్వోదయ ఉద్యమంలో ఆయన పనిచేశారు. భూదాన కార్యక్రమ సాఫల్యానికి కృషి చేశారు. 1975లో అత్యవసర పరిస్థితిని విధించిన తరువాత సర్వోదయ కార్యకలాపాలకు స్వస్తి చెప్పి అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడారు. వలసపాలకుల వలే స్వతంత్ర భారత ప్రభువులు కూడా ఆయన్ని జైలుకు పంపారు. విడుదలయిన అనంతరం తన సొంత రాష్ట్రంలో మరింత మానవీయ సామాజిక వ్యవస్థ నిర్మాణ కృషికి దొరెస్వామి అంకితమయ్యారు.


1980 దశకం తుదినాళ్ళలో నేను మొదటిసారి దొరెస్వామిని కలుసుకున్నాను. పశ్చిమ కనుమలలో పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా ఆయన నిర్వహించిన నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నాను. అప్పటికే ఆయన ఏడు పదుల వయస్సులో ఉన్నారు. అయినా నిరసనలకు నాయకత్వం వహించేందుకుగానీ, నిరాహార దీక్ష నిర్వహించేందుకు ఆయన సదా ముందుండేవారు. తన సంభాషణా చాతుర్యంతో యువజనులను అమితంగా ఆకట్టుకునేవారు. నేను ఆయన్ని చివరిసారి గత ఏడాది మార్చిలో కలుసుకున్నాను. దొరెస్వామి నిజంగా కర్ణాటక అంతరాత్మ. భూకబ్జాదారులు, మైనింగ్ కంపెనీల అక్రమాలు, అవినీతిపరులైన రాజకీయవేత్తలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఏ మాత్రం వెనుకాడేవారు కాదు. 


స్వతంత్ర భారతదేశంలో గాంధేయ ఉద్యమాలు విశేష ఫలితాలను సాధించాయి. అయితే హిందూత్వ శక్తుల నుంచి మన సమున్నత గణతంత్ర రాజ్యానికి ఎదురవుతున్న ముప్పు విషయమై గాంధేయ ఉద్యమాలు సరిగ్గా దృష్టి పెట్టనేలేదు. దొరెస్వామి ఇందుకొక మినహాయింపు. 102 ఏళ్ళ వయస్సులో అనైతిక పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆయన ఉద్యమించారు. అదే ఆయన చివరి పోరాటం. ‘పౌరసత్వ సవరణ చట్టం మన గణతంత్ర రాజ్య సంస్థాపక ఆదర్శాలు, లక్ష్యాలకు పూర్తిగా విరుద్ధమైనదని’ 2020 మార్చిలో తన నిరాహార దీక్ష సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ‘ఈ దేశంలోని ముస్లింలు భారతీయులుగా ఉండదలుచుకున్నారు. ఇప్పుడు వారిని తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని ఆదేశించడం అమానుషం’ అని ఆయన విమర్శించారు. ప్రభుత్వం, రాజ్యం, జాతి మధ్య తేడాలను మనం చూడవలసిన అవసరమున్నదని దొరెస్వామి అన్నారు.


సుందర్ లాల్ బహుగుణ, హెచ్‌ఎస్ దొరెస్వామి ఇరువురూ క్రియాశీలురు. తమ భావాలు, అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసేవారు. ఛలోక్తులతో మాట్లాడేవారు. చూపరులను ఇట్టే ఆకట్టుకునేవారు. వ్యక్తిత్వంలోనూ, స్వభావంలోనూ ఆ ఇరువురికి భిన్నమైన వ్యక్తి కెఎమ్ నటరాజన్. తమిళనాడుకు చెందిన ఈ గాంధేయవాది బహుగుణ అనంతరం, దొరెస్వామికి ముందు కీర్తి శేషుడు అయ్యారు. మృదుస్వభావి, వినయశీలి అయిన నటరాజన్ గాంధేయవాద స్ఫూర్తికి మూర్తీభవించిన రూపం. ఆయనను క్రియాశీలి అనే కంటే నిర్మాణాత్మక కార్యకర్త అనడమే సబబుగా ఉంటుంది. విద్యార్థి దశలోనే గాంధీ వల్ల ప్రభావితుడైన నటరాజన్ 1956–57లో వినోబా భావే తమిళనాడులో నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్నారు, భూదాన ఉద్యమ సాఫల్యానికి కృషి చేశారు. ఆ తరువాత గ్రామీణ ప్రాంతాల పునరుజ్జీవానికి అంకితమయ్యారు. కులపరమైన అసమానతల నిర్మూలనకు కృషి చేశారు. ఇంకా ఖాదీ పరిశ్రమలు, సేంద్రియ వ్యవసాయం అభివృద్ధికి, ఆలయ భూములను భూవసతి లేని వ్యవసాయ కూలీలకు పంపిణీ చేయించేందుకు ఆయన కృషి చేశారు. ఈ కృషిలో ఆయనకు సహచరులు శంకరలింగం, కృష్ణమ్మాళ్‌, ఖాదీ వస్త్రధారి అయిన అమెరికన్ రాల్ఫ్ రిచర్డ్ కెయిథాన్‌.


1996లో గాంధేయ ఆర్థికవేత్త జేసీ కుమారప్ప గురించి నేను రాసిన ఒక వ్యాసానికి ప్రతిస్పందనగా మధురై నుంచి నాకు ఒక లేఖ వచ్చింది. ఆ లేఖా రచయిత కుమారప్పకు సన్నిహితుడైన నటరాజనే. చాలా సంవత్సరాల అనంతరం అమెరికన్ గాంధేయవాది రాల్ఫ్ రిచర్డ్ గురించి పరిశోధన చేస్తున్నప్పుడు నటరాజన్ ఆయనకు మిత్రుడేనన్న విషయం తెలిసింది. నేను మధురై వెళ్ళి నా పరిశోధన విషయమై ఆయన సలహాలను కోరాను. గాంధీ మ్యూజియం కాంప్లెక్స్ లోని సర్వోదయ కార్యాలయంలో తేనీరు సేవిస్తూ ఎన్నో విషయాల గురించి ఆయన మాట్లాడారు. రాల్ఫ్ రిచర్డ్ గురించి తెలియని అనేకానేక సంగతులు ఆ సందర్భంగా నాకు తెలిశాయి. ఆ తరువాత దిండిగల్ లోని గాంధీగ్రామ్ గ్రామీణ విశ్వవిద్యాలయంలోని పలువురు ఆచార్యుల వద్దకు నన్ను పరిచయ లేఖలతో పంపారు. ఆయన చాలా ఉదారుడు కూడా. తమిళనాడులోని పలువురికి రాల్ఫ్ రిచర్డ్ రాసిన అనేక లేఖలను ఆయన నాకు తరచు పంపిస్తుండేవారు. ఆ అమెరికన్ గాంధేయవాది గురించి నేను రాసిన పరిశోధనా పత్రాలను నటరాజన్ విపులంగా చదివారు.


ఈ ఉదాత్త జీవితాలపై పర్యాలోచనలో, అవి మనకు బోధించే విలువైన సత్యాలు ఏమిటో నాకు అవగతమయ్యాయి. సృష్టిలో సకల జీవుల వలే మానవులూ ప్రాకృతిక ప్రపంచంలో అంతర్భాగమే. ప్రకృతిలో భాగస్వాములుగా మినహా వారికి ఎలాంటి ప్రత్యేకత గానీ, ఉన్నతిగానీ లేదు. మన మనుగడను కాపాడుకోవాలంటే సమస్త జీవకోటిని గౌరవించాలని ఉత్తరాఖండ్ మహర్షి బహుగుణ బోధించారు. కులం, వర్గం, జెండర్, మతం ప్రాతిపదికన వివక్షలను పాటించడం భారత రాజ్యాంగ ఆదర్శాలకే కాకుండా సభ్యతకు, మానవతకు విరుద్ధమని కర్ణాటక కర్మవీరుడు దొరెస్వామి ఉపదేశించారు. అటువంటి వివక్షలను వ్యతిరేకించడం, అహింసాత్మకంగా ప్రవర్తించడం, స్వేచ్ఛా స్వాతంత్యాలు, న్యాయం తమ ఆదర్శాలని చెప్పుకునేవారి విధ్యుక్త ధర్మమని ఆయన అనేవారు. నిజమైన స్వావలంబన అనేది సొంత కుటుంబం లేదా సొంత సమాజంలో పనిచేస్తున్న వ్యక్తితో ప్రారంభమవుతుందని, కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాల కుదింపునకు అంతర్జాతీయ ఒప్పందాలు ఎంత ముఖ్యమో, గ్రామీణ భారత సుస్థిరాభివృద్ధికి స్థానిక కార్యాచరణ అంతే ముఖ్యమని తమిళనాడు గాంధేయ దార్శనికుడు నటరాజన్ చాటారు.


ఈ మూడు ఉదాత్త జీవితాలూ బహుదా ప్రశంసనీయమైవి. అయితే వాటిలో ప్రతి ఒక్కటీ విభిన్నమైనది, విలక్షణమైనది. బహుగుణ, దొరెస్వామి, నటరాజన్‌ తమ సొంత జిల్లా, సొంత రాష్ట్రంతో ప్రగాఢ అనుబంధాన్ని కలిగి ఉంటూనే విశాల భారత్ వ్యవహారాలలోనూ, ప్రపంచ పరిణామాలలోనూ అమిత శ్రద్ధాసక్తులు చూపారు. విశ్వస్థాయిలో ఆలోచించి స్థానిక స్థాయిలో పనిచేయడం వారి జీవనసూత్రం. కొండ నుంచి కడలి దాకా ఒక నది ప్రవహించినట్లుగానే మహాత్ముని నుంచి అజరామర గాంధేయ స్ఫూర్తి ఆ మువ్వురి ఉదాత్త జీవితాల ద్వారా పల్లె, ప్రకృతి పరిరక్షణకు, ప్రజాస్వామ్యానికి వెలుగుబాటలు పరిచింది.

రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...