కంప్యూటర్ల తయారీకి ఊతం

ABN , First Publish Date - 2021-02-25T06:24:58+05:30 IST

దేశంలో పర్సనల్‌ కంప్యూటర్లు, సర్వర్లు, టాబ్లెట్‌ పీసీ, లాప్‌టా్‌పల తయారీకి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక

కంప్యూటర్ల తయారీకి ఊతం

 పీఎల్‌ఐ పథకం కింద రూ.7,350 కోట్ల ప్రోత్సాహకాలు 

 పీసీ, లాప్‌టాప్‌, టాబ్లెట్‌, సర్వర్ల తయారీకి వర్తింపు

 4 ఏళ్లలో రూ.3.26 లక్షల కోట్ల ఉత్పత్తుల తయారీ

 1.80 లక్షల ఉద్యోగాల కల్పనకు దోహదం  


న్యూఢిల్లీ: దేశంలో పర్సనల్‌ కంప్యూటర్లు, సర్వర్లు, టాబ్లెట్‌ పీసీ, లాప్‌టా్‌పల తయారీకి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం కింద ఐటీ హార్డ్‌వేర్‌ ఉత్పత్తుల పరిశ్రమకు రూ.7,350 కోట్ల ప్రోత్సాహకాలందించేందుకు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది.


కేబినెట్‌ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కొత్త పథకం కింద వచ్చే నాలుగేళ్లలో ఐటీ హార్డ్‌వేర్‌ ఇండస్ట్రీ రూ.3.26 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను తయారు చేయడంతో పాటు రూ.2.45 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేయగలదని ప్రభుత్వం అంచనా. అంతేకాదు, కొత్తగా 1.80 లక్షల ఉద్యోగాల కల్పనకు ఈ పథకం దోహదపడనుందని కేంద్రం భావిస్తోంది. 




ఐటీ హార్డ్‌వేర్‌ ఉత్పత్తుల తయారీలో భారత్‌ను ప్రపంచ హబ్‌గా చేయాలన్నదే ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద నాలుగేళ్ల పాటు ఐటీ హార్డ్‌వేర్‌ కంపెనీలు దేశీయంగా తయారు చేసిన ఉత్పత్తుల నికర అమ్మకాల పెరుగుదల (2019-20 సంవత్సరం ఆధారంగా)ను బట్టి కేంద్రం 4-1 శాతం మేర ప్రోత్సాహకాలు అందించనుంది. ప్రధానంగా 5 అంతర్జాతీయ కంపెనీలు, 10 దేశీయ తయారీదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయి. దేశంలో టెలికాం పరికరాల తయారీని ప్రోత్సహించేందుకు గత వారం కేంద్రం రూ.12,195 కోట్ల పీఎల్‌ఐ పథకాన్ని ప్రకటించింది. మొబైల్‌ ఫోన్ల తయారీ రంగానికి గత ఏడాదిలోనే ఈ ప్రోత్సాహకాలు కల్పించింది. 


Updated Date - 2021-02-25T06:24:58+05:30 IST