తెలంగాణ ఎల్‌పీజీ మార్కెట్లో ఐఓసీ వాటా 41 శాతం

ABN , First Publish Date - 2021-01-10T07:10:29+05:30 IST

తెలంగాణ లిక్విఫైడ్‌ పెట్రోలియం గ్యాస్‌ (ఎల్‌పీజీ) మార్కెట్లో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ)కి 41 శాతం వాటా ఉంది.

తెలంగాణ ఎల్‌పీజీ మార్కెట్లో ఐఓసీ వాటా 41 శాతం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తెలంగాణ లిక్విఫైడ్‌ పెట్రోలియం గ్యాస్‌ (ఎల్‌పీజీ) మార్కెట్లో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ)కి 41 శాతం వాటా ఉంది. 320 మంది పంపిణీదారుల ద్వారా రాష్ట్రంలో 57 లక్షల మంది ఖాతాదారులకు ఐఓసీ ఎల్‌పీజీని సరఫరా చేస్తోందని చర్లపల్లి ఇండేన్‌ ఎల్‌పీజీ బాట్లింగ్‌ ప్లాంట్‌ అధిపతి జయ్‌ ప్రకాశ్‌ పాండే తెలిపారు. ప్లాంట్‌లో మొత్తం ఎల్‌పీజీ స్టోరేజీ సామర్థ్యం 2,300 మెట్రిక్‌ టన్నులు ఉంది. 1,80,000 మెట్రిక్‌ టన్నుల బాట్లింగ్‌ సామర్థ్యంతో పని చేస్తోంది.


సగటున రోజుకు 55,000 సిలిండర్లను నింపుతున్నట్లు వివరించారు. డెన్మార్క్‌కు చెందిన కోసన్‌ క్రిస్‌ప్లాంట్‌ కంపెనీ టెక్నాలజీని వినియోగించి గుండ్రంగా తిరిగే (కరోసెల్‌) వ్యవస్థ ద్వారా సిలిండర్లను ప్లాంట్‌లో నింపుతున్నట్లు చెప్పారు. ఈ వ్యవస్థలో 72 పాయింట్ల ద్వారా సిలిండర్లలో ఎల్‌పీజీ బాట్లింగ్‌ జరుగుతుంది. 72 పాయింట్లు ఉన్న కరోసెల్‌ వ్యవస్థ ఐఓసీలో ఒక్క చర్లపల్లి బాట్లింగ్‌ ప్లాంట్‌లోనే ఉంది. భవిష్యత్తులో రోజుకు 62,000 సిలిండర్లను నింపే విధంగా టెక్నాలజీని అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు తెలిపారు.


విశాఖపట్నం ద్వారా పైప్‌లైన్‌లో ఎల్‌పీజీ ఇక్కడకు చేరుతుంది. అలానే చెన్నై నుంచి బల్క్‌ ట్యాంకర్ల ద్వారా కూడా సరఫరా చేస్తారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మిన హా మిగిలిన అన్ని తెలంగాణ ప్రాంతాలకు ఈ ప్లాంట్‌ నుంచి ఎల్‌పీజీ సరఫరా అవుతోంది. తెలుగు రాష్ట్రాలకు ఆటో ఎల్‌పీజీని  సరఫరా చేస్తోంది.


Updated Date - 2021-01-10T07:10:29+05:30 IST