ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ ధర రూ. 710 వేల కోట్లు!

ABN , First Publish Date - 2021-10-25T07:18:18+05:30 IST

పీఎల్‌లో కొత్తగా ఏర్పాటు చేయనున్న రెండు ఫ్రాంచైజీల నుంచి కాసుల వర్షం కురిసే అవకాశం ఉందని బీసీసీఐ అంచనా వేస్తోంది....

ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ ధర రూ. 710 వేల కోట్లు!

బీసీసీఐ అంచనా

దుబాయ్‌: ఐపీఎల్‌లో కొత్తగా ఏర్పాటు చేయనున్న రెండు ఫ్రాంచైజీల నుంచి కాసుల వర్షం కురిసే అవకాశం ఉందని బీసీసీఐ అంచనా వేస్తోంది. బిడ్డింగ్‌లో ఒక్కో ప్రాంచైజీ ధర రూ. 7 వేల కోట్ల నుంచి 10 వేల కోట్ల వరకు పలికే చాన్సుందని బోర్డు వర్గాలు లెక్కలేస్తున్నాయి. కొత్త జట్లకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ సోమవారం ఆరంభం కానుంది. అయితే, అదే రోజు విజయవంతమైన బిడ్‌లను ప్రకటిస్తారా? లేదా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. రూ. 10 లక్షల విలువైన టెండర్‌ పత్రాలను 22 కంపెనీలు కొనుగోలు చేశాయి. బిడ్‌ వేయడానికి కనీస ధర రూ. 2 వేల కోట్లుగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో టీమ్‌లను దక్కించుకొనేందుకు ఐదు లేదా ఆరుగురు నిఖార్సయిన బిడ్డర్లు మాత్రమే బరిలో నిలిచే అవకాశం ఉంది. మూడు కంపెనీలు లేదా ముగ్గురు వ్యక్తుల కన్సార్షియంలు కూడా టెండర్లు వేసేందుకు బోర్డు అనుమతించింది.


దాంతో భారత బిజినెస్‌ టైకూన్‌ గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌.. అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీ కోసం బిడ్‌వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్‌ గోయెంకాకు చెందిన ఆర్‌పీఎ్‌సజీ గ్రూప్‌ కూడా ఐపీఎల్‌ టీమ్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే, టెండర్‌ ప్రక్రియలో ఆ గ్రూప్‌ ఎలా పాల్గొంటుందనే దానిపై సమాచారం లేదు. చెన్నై, రాజస్థాన్‌లపై సస్పెన్షన్‌ విధించినప్పుడు.. రెండేళ్లకుగాను ఏర్పాటు చేసిన రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌ (ఆర్‌పీఎస్‌) ఫ్రాంచైజీని గోయెంకా గ్రూప్‌ దక్కించుకొన్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఫుట్‌బాల్‌ క్లబ్‌ మాంచెస్టర్‌ యునైటెడ్‌కు చెందిన లాన్సర్‌ గ్రూప్‌ కూడా కొత్త టీమ్‌ కోసం టెండర్‌ను కొనుగోలు చేసింది. కోటక్‌ మహీంద్ర, అరబిందో ఫార్మా, టోరెంట్‌ గ్రూప్‌లు కూడా ఐపీఎల్‌ జట్లపై ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. కొత్త ఫ్రాంచైజీలకు మొతేరా స్టేడియం ఉన్న అహ్మదాబాద్‌, ఎకానా స్టేడియం ఉన్న లఖ్‌నవూ సిటీలను హాట్‌ ఫేవరెట్లుగా భావిస్తున్నారు. ఇండోర్‌, గువాహటి, కటక్‌, ధర్మశాల, పుణె నగరాలు కూడా రేసులో ఉన్నాయి. కాగా టీమిండియా మాజీ ఓపెనర్‌ ఒకరు ఐపీఎల్‌ ఫ్రాంచైజీలో పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. 

Updated Date - 2021-10-25T07:18:18+05:30 IST