ఐపీఓ మార్కెట్‌లో మళ్లీ జోష్‌

ABN , First Publish Date - 2020-11-30T07:07:34+05:30 IST

ప్రైమరీ మార్కెట్‌ (ఐపీఓ) మళ్ళీ కళకళలాడుతోంది. గత 11 నెలల్లో 12 కంపెనీలు ఐపీఓల ద్వారా ఇప్పటి వర కు రూ.25,000 కోట్లు సమీకరించాయి. రూ.810 కోట్లు సమీకరించేందుకు వచ్చే వారం బర్జెర్‌ కింగ్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. గత ఏడాది 16 కంపెనీలు ఐపీఓల ద్వారా సమీకరించిన రూ.12,362 కోట్లతో పోలిస్తే...

ఐపీఓ మార్కెట్‌లో మళ్లీ జోష్‌

  • 11 నెలల్లో రూ.25,000 కోట్లు 
  • త్వరలో మార్కెట్‌కు మరిన్ని ఐపీఓలు


న్యూఢిల్లీ: ప్రైమరీ మార్కెట్‌ (ఐపీఓ) మళ్ళీ కళకళలాడుతోంది. గత 11 నెలల్లో 12 కంపెనీలు ఐపీఓల ద్వారా ఇప్పటి వర కు రూ.25,000 కోట్లు సమీకరించాయి. రూ.810 కోట్లు సమీకరించేందుకు వచ్చే వారం బర్జెర్‌ కింగ్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. గత  ఏడాది 16 కంపెనీలు ఐపీఓల ద్వారా సమీకరించిన రూ.12,362 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది కంపెనీలు ఇప్పటి వరకు దాదాపు రెట్టింపు నిధులు సమీకరించాయి. 2018తో పోలిస్తే మాత్రం 2020లో ఐపీఓల ద్వారా కంపెనీలు సమీకరించిన నిధులు తక్కువే. ఆ సంవత్సరం 24 కంపెనీలు ప్రైమరీ మార్కెట్‌ ద్వారా రూ.30,959 కోట్లు సమీకరించాయి.


పెరిగిన ఆసక్తి: కోవిడ్‌ దెబ్బతో ఈ ఏడాది మార్చిలో సెకండరీ మార్కెట్‌ కుప్పకూలింది. అయితే మే నుంచి మార్కెట్‌ మళ్లీ గాడిలో పడింది. తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 23.9 శాతానికి పడిపోయినా, దేశ, విదేశీ మదుపరులు పెద్ద ఎత్తున పెట్టుబడులకు దిగారు. దీంతో దలాల్‌ స్ట్రీట్‌లో రికార్డుల హోరు కొనసాగుతోంది. వడ్డీ రేట్లు పడిపోవడం, పెట్టుబడుల లభ్యత ఇందుకు దోహదం చేశా యి. ఈ ప్రభావం ఐపీఓ మార్కెట్‌ మీదా కనిపించింది. మంచి వ్యాపార మోడల్‌, ఆకర్షణీయమైన ధరలతో వచ్చిన ఐపీఓలకు మదుపరులు బ్రహ్మరథం పట్టారు. ఈ బూమ్‌ను ఆసరాగా చేసుకుని కొన్ని లిస్టెడ్‌ కంపెనీలు రైట్స్‌, క్యూఐపీలు, ఎఫ్‌పీఓల ద్వారా నిధులు సమీకరించాయి. 


ప్రీమియం :  పిండి కొద్దీ రొట్టె అన్నట్టు మంచి ఫండమెంటల్స్‌ ఉన్న కంపెనీలు తమ ఐపీఓలకు మంచి ప్రీమియంనే వసూలు చేశాయి. అయినా ఇన్వెస్టర్లు ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. భారీ ప్రీమియంతో వచ్చినా రూట్‌ మొబైల్స్‌, హ్యాపీయస్ట్‌ మైండ్స్‌ టెక్నాలజీస్‌, రోజరీ బయోటెక్‌, గ్లాండ్‌ ఫార్మా ఐపీఓలు మదుపరులకు లిస్టింగ్‌ రోజే 40 నుంచి 200 శాతం లాభాలు పంచాయి.  

‘రీట్స్‌’ బోణి : నిన్న మొన్నటి వరకు మన దేశంలో ఐపీఓ మార్కెట్‌ అంటే కంపెనీలు జారీ చేసే ఈక్విటీ షేర్లే. అయితే ఈ సంవత్సరం మన ఐపీఓ మార్కెట్‌లో కొత్తగా రియల్‌ ఎస్టేట్‌ ఇన్వె్‌స్టమెంట్స్‌ ట్రస్ట్స్‌ (రీట్స్‌) కూడా రంగ ప్రవేశం చేశాయి. మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ ఇందుకు శ్రీకారం చుట్టింది. ఈ కంపెనీ జారీ చేసిన రీట్స్‌ ఇష్యూలో ఇన్వెస్టర్లు దాదాపు రూ.4,500 కోట్లు పెట్టుబడి పెట్టారు. 

త్వరలో మరిన్ని ఐపీఓలు: త్వరలో కల్యాణ్‌ జువెలర్స్‌, రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ వంటి కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకి రాబోతునాయి. ఎల్‌ఐసీ మెగా ఐపీఓ వచ్చే ఏడాది పూర్తి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికి తోడు ప్రస్తుత బూమ్‌లోనే కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎఫ్‌పీఓలకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద 2021లో ఐపీఓ మార్కెట్‌ మరింత జోరందుకుంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. 




ఎఫ్‌పీఐ పెట్టుబడుల రికార్డు

భారత్‌లో ఎఫ్‌పీఐల పెట్టుబడుల హోరు కొనసాగుతోంది. ఈ నెల 3-27 మధ్యకాలంలో రూ.62,951 కోట్ల విలువైన షేర్లు, రుణ పత్రాలు కొనుగోలు చేశాయి. ఇందులో రూ.60,358 కోట్లు షేర్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేశాయి. ఎఫ్‌పీఐలు గతంలో ఎన్నడూ ఒక నెల్లో ఇంత భారీగా పెట్టుబడులు  పెట్టలేదు. ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకోవడం, త్వరలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ వస్తుందన్న అంచనాలు, డాలర్‌ ఇండెక్స్‌ పతనం, పుష్కలంగా నిధుల లభ్యత, కొన్ని మంచి కంపెనీల షేర్లు ఆకర్షణీయమైన దరల్లో లభించడం ఇందుకు కారణంగా మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. 


Updated Date - 2020-11-30T07:07:34+05:30 IST