ప్రపంచ చాంప్‌ ఇంగ్లండ్‌కు ఐర్లాండ్‌ షాక్‌

ABN , First Publish Date - 2020-08-06T09:28:37+05:30 IST

ప్రపంచ చాంపియన్‌ ఇంగ్లండ్‌కు పసికూన ఐర్లాండ్‌ షాకిచ్చింది. మూడు వన్డేల సిరీ్‌సలో భాగంగా మంగళవారం అర్ధరాత్రి ఉత్కంఠభరితంగా...

ప్రపంచ చాంప్‌ ఇంగ్లండ్‌కు ఐర్లాండ్‌ షాక్‌

శతక్కొట్టిన స్టిర్లింగ్‌, బాల్‌బిర్నే 

ఆఖరి వన్డేలో మోర్గాన్‌ సేన చిత్తు 


సౌతాంప్టన్‌: ప్రపంచ చాంపియన్‌ ఇంగ్లండ్‌కు పసికూన ఐర్లాండ్‌ షాకిచ్చింది. మూడు వన్డేల సిరీ్‌సలో భాగంగా మంగళవారం అర్ధరాత్రి ఉత్కంఠభరితంగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును ఏడు వికెట్ల తేడాతో చిత్తుచేసింది. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 329 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో.. ఓపెనర్‌ పాల్‌ స్టిర్లింగ్‌ (128 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 142), కెప్టెన్‌ ఆండ్రూ బాల్‌బిర్నే (112 బంతుల్లో 12 ఫోర్లతో 113) శతకాలతో అదరగొట్టడంతో ఐర్లాండ్‌ 49.5 ఓవర్లలో 329/3 పరుగులు చేసి విజయం సాధించింది. టెక్టర్‌ (29 నాటౌట్‌), కెవిన్‌ ఓబ్రియన్‌ (21 నాటౌట్‌) ఆఖర్లో రాణించి జట్టును విజయ తీరాలకు చేర్చారు. అంతకుముందు.. కెప్టెన్‌ మోర్గాన్‌ (84 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 106) మెరుపు శతకానికి తోడు టామ్‌ బాంటమ్‌ (58), విల్లే (51) హాఫ్‌ సెంచరీలతో రాణించడంతో ఇంగ్లండ్‌ 49.5 ఓవర్లలో 328 పరుగులు చేసి ఆలౌటైంది. పేసర్‌ క్రెయిగ్‌ యంగ్‌ (3/53) మూడు.. జాషువా లిటిల్‌, కాంఫర్‌ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. స్టిర్లింగ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించగా.. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ డేవిడ్‌ విల్లేకు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ దక్కింది. మూడు వన్డేల సిరీ్‌సను ఐర్లాండ్‌ 0-2తో ఈపాటికే చేజార్చుకున్నా.. చివరి వన్డేలో మాత్రం అనూహ్య ప్రదర్శనతో వాహ్‌ అనిపించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ నెగ్గిన సంగతి తెలిసిందే. వన్డేల్లో భారీ లక్ష్యాన్ని ఛేదించడం ఐర్లాండ్‌కిదే తొలిసారి. 

Updated Date - 2020-08-06T09:28:37+05:30 IST