కళంకిత రాజకీయాలకు కళ్ళెం సాధ్యమా?

ABN , First Publish Date - 2021-09-09T06:11:42+05:30 IST

పార్లమెంటు సభ్యులు, రాష్ట్రాల శాసన సభ్యులపై నమోదైన కేసుల్లో దర్యాప్తు నత్తనడక నడుస్తుండటం పట్ల ఆగస్టు 25న సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది...

కళంకిత రాజకీయాలకు కళ్ళెం సాధ్యమా?

పార్లమెంటు సభ్యులు, రాష్ట్రాల శాసన సభ్యులపై నమోదైన కేసుల్లో దర్యాప్తు నత్తనడక నడుస్తుండటం పట్ల ఆగస్టు 25న సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. చాలా కేసుల్లో కనీసం ఛార్జిషీట్లు కూడా దాఖలు చేయకపోవటానికి సీబీఐ, ఈడీలు కారణాలు చెప్పలేకపోవటం పట్ల ఆగ్రహించింది. కేసుల విచారణ త్వరితం చేయాలని ఆదేశించింది. న్యాయమూర్తుల కొరత కారణంగా ఇది అంత సులభం కాకపోవచ్చని కూడా అభిప్రాయపడింది. అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ అనే న్యాయవాది 2016లో దాఖలు చేసిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ ధర్మాసనంలో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్.వి. రమణతో పాటు జస్టిస్‌ సూర్యకాంత్‌ జస్టిస్‌ అనిరుధ్‌ బోసులు సభ్యులుగా వున్నారు. కొన్ని రాష్ట్రాలలో రాజకీయ నాయకులపై కేసులు 25సంవత్సరాల నుంచి పెండింగులో ఉన్న విషయం కూడా కోర్టు దృష్టికి వచ్చింది. 


పార్లమెంటు, అసెంబ్లీల సభ్యులపైన, మాజీ సభ్యులపైన సుమారు 5వేల కేసులు వివిధ దశల్లో పెండింగులో ఉన్నాయి. వీటిలో ఎక్కువగా చిన్నాచితకా కేసులు, ఆందోళనల సందర్భంగా పెట్టబడినవీ ఉన్నాయి. 51మంది పార్లమెంటు సభ్యులపైన, 71 మంది శాసన సభ్యులపైన మనీ లాండరింగ్‌ కేసులు పెండింగులో ఉన్నాయి. జీవిత ఖైదు విధించదగిన కేసులు 58 ఉన్నాయి. ఇడుక్కి కాంగ్రెస్‌ సభ్యుడు దీన్‌ కురియకోస్‌పై 204 కేసులు, ఆదిలాబాద్‌ బీజేపీ సభ్యుడు సోయం బావురావుపై 52 కేసులు, బారక్‌పూర్‌ బీజేపీ సభ్యులు అర్జున్‌ సింగ్‌పై 24 కేసులు, ఘోసి నుంచి బీఎస్పీ తరపున ఎన్నికైన అతుల్‌కుమార్‌ సింగ్‌పై13 కేసులు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 38 కేసులతో ప్రథమ స్థానంలో ఉన్నారు. అదే పార్టీకి చెందిన జగ్గయ్యపేట శాసనసభ్యుడు ఉదయభాను 18 కేసులతో రెండవ స్థానంలో ఉన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ శాసన సభ్యుల్లో 74 మందిపై (అంటే సగంమందిపై) క్రిమినల్‌ కేసులు ఉండగా, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎనిమిది మందిపై కేసులు ఉన్నాయి. తెలంగాణ విషయానికొస్తే టీఆర్‌ఎస్ సభ్యుల్లో 51 మందిపైన, కాంగ్రెస్‌ సభ్యుల్లో 9 మందిపైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఎమ్‌ఐ‌ఎమ్ సభ్యులందరి పైనా కేసులుండటం విశేషం. ఇక్కడ కూడా కేసీఆర్ 64 కేసులతో ప్రథమ స్థానంలో ఉన్నారు. కాకుంటే ఏపీ ముఖ్యమంత్రిపై తీవ్రమైన ఆర్థిక నేరాలుండగా, కేసీ‌ఆర్‌పైన ఉన్న కేసులు ప్రధానంగా ఉద్యమ నేపథ్యంలో పెట్టినవి. 


హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ప్రధాన కక్షిదారులు ప్రభుత్వాలే. ఆంధ్రప్రదేశ్‌ లాంటి చోట్ల 94 వేల కేసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెండింగులో ఉన్నాయని, అందులో 8 వేల కోర్టు ధిక్కార కేసులు ఉన్నాయని, సగటున రోజుకు 450 కేసులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలవుతున్నాయని గత వారం (ఆగస్టు 3వ వారం)లో పీటీఐ వార్తా సంస్థ ఒక సంచలన పరిశోధన ద్వారా వెల్లడించింది. ఈ స్థాయిలో కాకపోయినా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన కేసులు వివిధ హైకోర్టుల్లోనూ, సుప్రీం కోర్టులోనూ గణనీయంగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో న్యాయమూర్తుల్ని నియమించే ప్రక్రియలో ప్రభుత్వాలే ప్రధాన పాత్రను కలిగి ఉండటమంత హాస్యాస్పదం మరొకటి లేదు. గతంలో గుజరాత్‌ మారణకాండ సందర్భంగా అమిత్‌షాని జైలుకు పంపిన అకిల్ ఖురేషిని కొలిజియం సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా సిఫారసు చేసినా కేంద్రం ఒప్పుకోలేదు. ఈ కేసులోనే అమిత్‌షాకు వ్యతిరేకంగా వాదించిన గోపాల సుబ్రహ్మణ్యంని కూడా ప్రభుత్వం న్యాయమూర్తి కానివ్వకుండా అడ్డుకుంది. ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పులిచ్చి పదవీ విరమణ తర్వాత ఒకరు రాజ్యసభ సభ్యులైతే, మరొకరు మానవ హక్కుల కోర్టుకు అధిపతి అయ్యారు. ఒక న్యాయమూర్తి ఏకంగా గవర్నర్‌ అయ్యారు. న్యాయవ్యవస్థలో నైతికతను ప్రశ్నార్థకం చేస్తున్న ఘటనల్లో ఇవి కొన్ని మాత్రమే. అసలు రాజ్యాంగంలో ‘కొలీజియం’ ప్రస్తావన ఎక్కడా లేదు. ప్రభుత్వ పెత్తనాన్ని తగ్గించాలని సుప్రీం కోర్టు తనకు తానుగా సృష్టించుకొన్న పద్ధతి ఇది. అయినా ఆచరణలో సిఫారసులకే పరిమితమైన వ్యవస్థగా మిగిలిపోయింది.


కళంకిత నేతలపై క్రిమినల్‌ కేసులు ధర్మాసనం ఆశించినట్లు త్వరగా తెమలాలంటే న్యాయమూర్తుల ఖాళీల్ని సత్వరం పూరించాలి. చాలా కాలానికి సుప్రీం కోర్టు పూర్తి స్థాయిలో న్యాయమూర్తుల్ని సంతరించుకుంది. వివిధ హైకోర్టుల్లో ఉన్న 454 ఖాళీలు, దిగువ కోర్టుల్లో ఉన్న వేలాది న్యాయమూర్తుల ఖాళీలు పూరించకుండా కాల నియమం విధించినా ఆచరణ సాధ్యం కాదు. కనుక న్యాయమూర్తుల సంఖ్యను పెంచుకోవటంతో పాటు వారి పని విధానాన్ని కూడా సర్వోన్నత న్యాయస్థానమే పర్యవేక్షించి, కళంకితులు చట్టసభల్లో ప్రవేశించకుండా శాశ్వతంగా నిరోధించాలి. జస్టిస్‌ ఎన్వీ రమణ తనకున్న సంవత్సరం కాలంలో ఈ దిశగా చర్యలు తీసుకుంటే 2022 నవంబరు నుంచి రెండేళ్ళపాటు ప్రధాన న్యాయమూర్తిగా ఉండే జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ ఆ ఒరవడిని కొనసాగించే వీలు కలుగుతుంది.

చెరుకూరి సత్యనారాయణ

ఉమ్మడి ఏపీ బార్‌ కౌన్సిల్‌ మాజీ సభ్యులు

Updated Date - 2021-09-09T06:11:42+05:30 IST