వ్యాక్సిన్‌తో మగాళ్లలో సంతాన సామర్థ్యం తగ్గుతుందా? తాజా రిసెర్చ్‌లో ఏం తేలిందంటే..

ABN , First Publish Date - 2021-06-19T01:51:21+05:30 IST

టీకా తీసుకుంటే పురుషుల్లో సంతాన సామర్థ్యం తగ్గిపోతుందనే వార్తలు గుప్పుమనడంతో.. అమెరికన్లు వ్యాక్సిన్ తీసుకోవడానికి జంకుతున్నారు. ఈ క్రమంలో అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కాస్త నెమ్మదించింది. దీంతో శాస్త్రవేత్తలు మళ్లీ తమ మెదళ్లకు పని చెప్పారు. పురషుల సంతాన సామర్థ్యంపై టీకా నిజంగా ప్రతికూల ప్రభావం చూపిస్తుందా? అనే కోణంలో పరిశోధనలు జరిపారు. ఈ నేపథ్యంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వ్యాక్సిన్‌తో మగాళ్లలో సంతాన సామర్థ్యం తగ్గుతుందా? తాజా రిసెర్చ్‌లో ఏం తేలిందంటే..

వాషింగ్టన్: ప్రశాంతంగా ఉన్న ప్రపంచంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టించింది. మహమ్మారి విలయతాండవం చేయడంతో లక్షల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఉద్యోగాలు, ఉపాధి లేక కోట్లాది మంది రోడ్డున పడ్డారు. కరోనా దెబ్బకు శక్తివంతమైన దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలాయి. మహమ్మారి వ్యాప్తికి కళ్లెంపడి తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే ఏకైక మార్గం వ్యాక్సినే అని ప్రపంచ దేశాలు గట్టిగా నమ్మాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా టీకాను కనుకొనేందుకు విస్తృత ప్రయోగాలు జరిగాయి. యుద్ధ ప్రతిపాదికన శాస్త్రవేత్తలు కొవిడ్ వ్యాక్సిన్ రూపొందించారు. తీరా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలకు మళ్లీ ఓ తలనొప్పి మొదలైంది. ప్రజలు కొవిడ్ టీకాను విశ్వసించకపోవడమే దానికి కారణం. ముఖ్యంగా అమెరికాలో పురుషులు టీకా తీసుకోవడానికి బెంబేలెత్తిపోతున్నారు. 



టీకా తీసుకుంటే పురుషుల్లో సంతాన సామర్థ్యం తగ్గిపోతుందనే ప్రచారంతో.. అమెరికన్లు వ్యాక్సిన్ తీసుకోవడానికి జంకుతున్నారు. ఈ క్రమంలో అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కాస్త నెమ్మదించింది. దీంతో శాస్త్రవేత్తలు మళ్లీ తమ మెదళ్లకు పని చెప్పారు. పురషుల సంతాన సామర్థ్యంపై టీకా నిజంగా ప్రతికూల ప్రభావం చూపిస్తుందా? అనే కోణంలో పరిశోధనలు జరిపారు. ఈ నేపథ్యంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పరిశోధన ఫలితాలు అమెరికన్ మెడికల్ అసోసియేషన్‌కు చెందిన జామా అనే జర్నల్‌లో తాజాగా ప్రచురితమైంది. అందులో.. టీకా వేసుకోవడం వల్ల పురుషుల్లో సంతాన సామర్థ్యం తగ్గుతుందనే వార్తలను పరిశోధకులు కొట్టిపారేశారు. సంతాన సామర్థ్యంపై టీకాలు ప్రతికూల ప్రభావం చూపవని వెల్లడించారు. ధైర్యంగా టీకాలు వేసుకోవాలని ప్రజలకు సూచించారు. 



మియామీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కొవిడ్ బారినపడని 18-50 ఏళ్ల మధ్య వయసు ఉన్న 45 మందిపై పురుషులపై అధ్యాయనం చేశారు. 45 మందిని రెండు గ్రూపులుగా విభజించి.. ఎంఆర్ఎన్ఏ విధానంలో తయారైన టీకాలను ఇవ్వడానికి రెండు నుంచి ఏడు రోజుల ముందు వారి నుంచి వీర్యాన్ని సేకరించారు. అనంతరం ఒక గ్రూప్ సభ్యులకు ఫైజర్ వ్యాక్సిన్‌ను.. మరో గ్రూపు సభ్యులకు మోడెర్నా టీకాలను ఇచ్చారు. రెండు గ్రూపుల సభ్యులూ.. టీకా రెండో డోసు తీసుకున్న అనంతరం దాదాపు 70 రోజుల తర్వాత మళ్లీ వారి నుంచి వీర్యాన్ని సేకరించారు. ఇలా సేకరించిన వీర్యాన్ని.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు జరిపారు. టీకాలు తీసుకోవడం వల్ల ఎవరిలోనూ వీర్యకణాల సంఖ్య కానీ, లైగింక సామర్థ్యం కానీ తగ్గలేదని స్పష్టం చేశారు. పైగా కొందరిలో సీమెన్ వ్యాల్యూమ్‌తోపాటు స్పెర్మ్ మొబిలిటీ గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. 


అధ్యయనం ప్రారంభంలో స్పెర్మ్ కాన్‌సెంట్రేషన్ 26 మిలియన్/ఎంఎల్, టోట‌ల్ మొబైల్ స్పెర్మ్ కౌంట్ 36 మిలియన్లు ఉన్నట్టు తెలిపారు. రెండో డోసు తీసుకున్న తర్వాత స్పెర్మ్ కాన్‌సెంట్రేషన్ 30 మిలియన్/ఎంఎల్‌కు పెరిగిందన్నారు. అంతేకాకుండా టోటల్ మొబైల్ స్పెర్మ్ కౌంట్ 44 మిలియన్లకు పెరిగినట్టు గుర్తించామన్నారు. ఎంఆర్ఎన్ఏ విధానంలో తయారైన టీకాల్లో వైరస్ బతికుండదని.. అంతేకాకుండా అది వీర్యకణాల సంఖ్య, లైగింక సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. 


Updated Date - 2021-06-19T01:51:21+05:30 IST