బోడిగుండుకూ బొటనవేలికీ ముడిపెడతారా?

ABN , First Publish Date - 2021-01-12T08:21:50+05:30 IST

దివీస్‌ లేబొరేటరీస్‌ బాధితుల కన్నీళ్లు తుడవమని అడుగుతుంటే.. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మాట్లాడాలని పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంటున్నారంటే ఆయన విజ్ఞతపై సందేహాలు కలుగుతున్నాయని జనసేన అధ్యక్షు డు పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

బోడిగుండుకూ బొటనవేలికీ ముడిపెడతారా?

  • దివీస్‌ బాధితుల కన్నీళ్లు తుడవమంటే కథలు చెబుతారా?
  • బాబు అనుమతులిస్తే మీరు ఆపలేరా?
  • రాజధాని అమరావతిని ఆపారు
  • రివర్స్‌లో పోలవరం ప్రాజెక్టు
  • మంత్రి గౌతమ్‌రెడ్డిపై పవన్‌ ఫైర్


అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): దివీస్‌ లేబొరేటరీస్‌ బాధితుల కన్నీళ్లు తుడవమని అడుగుతుంటే.. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మాట్లాడాలని పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంటున్నారంటే ఆయన విజ్ఞతపై సందేహాలు కలుగుతున్నాయని జనసేన అధ్యక్షు డు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మంత్రి మాటలు బోడిగుండుకూ, బొటనవేలికీ ముడిపెట్టినట్లుగా ఉందని సోమవా రం ఓ ప్రకటనలో ఎద్దేవాచేశారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకల గ్రామంలో ఏర్పాటవుతు న్న దివీస్‌ కర్మాగారం కారణంగా అక్కడి 15 గ్రామాలకు చెందిన వేల మంది ప్రజలు చేస్తున్న ఆక్రందనలు మీ చెవులకు సోకడం లేదా అని ప్రశ్నించారు. ‘చంద్రబాబు అనుమతులు ఇస్తే మీరు ఆపరా..? ఆపలేరా..? ఆయన ప్రారంభించిన అన్నింటినీ రద్దు చేశారు కదా! రాజధాని అమరావతిని ఆపారు. పోలవరం ప్రాజెక్టును రివర్స్‌లో తీసుకెళ్తున్నారు. అదే విధంగా దివీస్‌ కర్మాగారంపై అక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చుగా! కనీసం అరెస్టు చేసిన 36 మందిని సైతం విడిచిపెట్టలేరా? వారు సూట్‌కేస్‌ కంపెనీలు పెట్టి మోసాలు చేశా రా? ప్రాజెక్టులకు అనుమతులిచ్చి నీకింత.. నాకింత అని లంచాలు తీసుకున్నారా? లేదా ప్రత్యర్థులను పథకం ప్రకారం హతమార్చారా? కేవలం ఫ్యాక్టరీ వద్దన్నందుకు అమాయకులను అరెస్టు చేసి జైళ్లలో పెడతారా? వారి కుటుంబాల శోకం మీ ప్రభుత్వాని కి తప్పక తగులుతుంది’ అని విరుచుకుపడ్డారు.


 ఆ 36 మందిని విడిచిపెట్టాలని మంత్రి సమీక్షల సందర్భంగా చెప్పినట్లు వార్తల్లో చదివామని.. ఆ అమాయకులు మాత్రం ఇంకా జైల్లోనే ఉన్నారని.. అంటే మంత్రి మాటను ఎవరూ పట్టించుకోవడం లేదనే అర్థం చేసుకోవాలా అని ప్రశ్నించారు. ‘75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఏడాదిన్నర కిందే మీ ప్రభుత్వం ప్రకటించిందని మీ రు పేర్కొన్నారు. అదే నిజమైతే అలా ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో చెప్పగలరా? మీ ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఏషియన్‌ పల్స్‌ అండ్‌ పేపర్‌ కంపెనీ వెనక్కి వెళ్లిపోవడాన్ని కాదనగలరా? ఎలక్ర్టిక్‌ బస్సుల తయారీ యూ నిట్‌ను ఏర్పాటు చేసిన అశోక్‌ లేల్యాండ్‌ ఉత్పత్తి ప్రారంభించకపోవడానికి కారణమేంటి? కియా ప్రతినిధులను మీ నేతలు ఎన్నిరకాలుగా ఇబ్బందులు పెట్టారో తెలిసిందేగా! ఎన్నికలకు ముందు ఆ ప్రాంతానికి వెళ్లిన మీ నా యకుడు జగన్‌రెడ్డి.. తాను అధికారంలోకి వస్తే దివీ్‌సను బంగాళాఖాతంలో కలిపేస్తానని స్థానికులను రెచ్చగొట్టినందువల్లే కదా.. ఇప్పుడు ఆ అమాయకులు పరిశ్రమకు వ్యతిరేకంగా రోడ్లపైకి వస్తోంది. నేను పదో తరగతి నెల్లూరులో చదివిన విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసినందుకు సంతోషం. యూకేలో ఎమ్మెస్‌ చదివిన మీరు ఆ 36 మం దిని విడుదల చేయించి అది కూడా ప్రపంచానికి తెలియజేయండి.. సంతోషిస్తాం’ అని గౌతమ్‌రెడ్డినుద్దేశించి పవన్‌ వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-01-12T08:21:50+05:30 IST