తెలంగాణ భాషోద్ధరణ ఇలాగేనా?

ABN , First Publish Date - 2021-09-09T06:08:27+05:30 IST

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాతనైనా మన తెలంగాణ భాషా అస్తిత్వాలకు, సాహిత్యానికి, కళలకు పెద్దపీట వేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు...

తెలంగాణ భాషోద్ధరణ ఇలాగేనా?

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాతనైనా మన తెలంగాణ భాషా అస్తిత్వాలకు, సాహిత్యానికి, కళలకు పెద్దపీట వేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ నేడు సొంత రాష్ట్రంలోనే తెలుగు భాష, సాహిత్యాల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. తెలుగు భాషను కచ్చితంగా ఒకటవ తరగతి నుండి ఇంటర్ వరకు అమలు చేస్తామని, తెలుగు భాషలో చదువుకునే వాళ్లకు ప్రత్యేకమైన సదుపాయాలను కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఒకటవ నుంచి పదవ తరగతి వరకు తెలుగును ద్వితీయ భాషగా అమలు చేయని స్కూళ్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పుడేమో ఇంటర్, డిగ్రీ కోర్సులలో తెలుగు భాషకు పోటీగా సంస్కృత భాషను ప్రవేశపెట్టడానికి జీవో జారీ చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలుగు పండిత్ కళాశాలలను మూసివేశారు. మళ్ళీ 2018లో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు కూడా నిర్వహించినా కౌన్సెలింగ్ జరపలేదు. వరంగల్‌లో రవీంద్రభారతిని తలదన్నేలా కాళోజీ కళాపీఠాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి శంకుస్థాపన చేసినా, నేటికీ అతీగతీ లేదు. రాష్ట్రంలో తెలుగు భాష కోసం ప్రత్యేకమైన శాఖను, సంస్థలను ఏర్పాటు చేసి భాషాభివృద్ధికి కృషి చేయడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమయింది. మున్ముందయినా తెలంగాణ భాషా సాహిత్యాలను దేదీప్యమానం చేయడానికి ప్రభుత్వం నడుం బిగించాలి.

వై. శివకుమార్

Updated Date - 2021-09-09T06:08:27+05:30 IST