డ్రానా..? సమర్పణా..?

ABN , First Publish Date - 2021-01-11T07:43:33+05:30 IST

డ్రానా..? సమర్పణా..?

డ్రానా..? సమర్పణా..?

  • భారత్‌ ఎదుట 407 పరుగుల భారీ లక్ష్యం.. 
  • ఉన్నది మూడు సెషన్లు.. చేతిలో ఎనిమిది వికెట్లు.. 
  • ఇంకా చేయాల్సినవి 309 పరుగులు


గాయంతో సిరీ్‌సకు దూరమైన జడేజా బ్యాటింగ్‌కు దిగే చాన్స్‌ లేదు కాబట్టి టెక్నికల్‌గా ఉన్నవి ఏడు వికెట్లే.. ఈ నేపథ్యంలో భారత్‌  ఈ మ్యాచ్‌ను కాపాడుకోవడం అత్యంత క్లిష్టంగా మారింది. మూడో రోజు తరహాలోనే క్రీజులో ఇప్పుడు రహానె, పుజార ఉన్నారు. వీరి నుంచి అసలు సిసలైన ‘టెస్టు ప్రదర్శన’ వస్తే డ్రాపై ఆశలు  పెట్టుకోవచ్చు. ముఖ్యంగా పుజార మరోసారి తన సహజశైలిలో ఆడాల్సి ఉంది. ఏదిఏమైనా ఒత్తిడిని జయిస్తూ చెలరేగుతారా.. లేక ఆసీస్‌ పేస్‌ త్రయం ధాటికి  బ్యాట్లెత్తేస్తారా? అనేది ఆఖరి రోజు తేలనుంది..


సిడ్నీ: ఓవరాల్‌గా నాలుగో ఇన్నింగ్స్‌లో 400+ స్కోరును ఛేదించిన రికార్డు ఇప్పటి వరకు నాలుగు సార్లు మాత్రమే నమోదైంది. ఇలాంటి అసాధారణ లక్ష్య ఛేదన కోసం భారత జట్టు బరిలోకి దిగింది. ఈ సిరీ్‌సలో తొలిసారిగా మ్యాచ్‌ ఐదో రోజుకు వెళ్లగా.. మూడో టెస్టు గెలవాలంటే రహానె సేన 407 పరుగులు సాధించాలి. అయితే అర్ధసెంచరీతో ఊపు మీదున్న రోహిత్‌ శర్మ (52) ఆఖర్లో అవుటవడం, జడేజా దూర మవడం, పంత్‌ గాయంతో ఏమేరకు ఆడతాడనేది భారత్‌ను ఆందోళనపరుస్తోంది. ప్రస్తుతానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 34 ఓవర్లలో 2 వికెట్లకు 98 పరుగులు చేసింది. క్రీజులో పుజార (9 బ్యాటింగ్‌), రహానె (4 బ్యాటింగ్‌) ఉన్నారు. గెలించేందుకు మరో 309 పరుగులు చేయాలి. తొలి సెషన్‌లో రహానె, పుజార జోడీ ఆట తీరుతో జట్టు ఫలితం తేలిపోనుంది. అంతకుముందు గ్రీన్‌ (84), లబుషేన్‌ (73), స్మిత్‌ (81) అర్ధసెంచరీలతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 6 వికెట్లకు 312 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. దీంతో ఆ జట్టుకు 406 పరుగుల ఆధిక్యం లభించింది.

ఆదిలోనే క్యాచ్‌ మిస్‌:  ఓవర్‌నైట్‌ స్కోరు 103/2తో నాలుగో రోజు ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించింది. లబుషేన్‌, స్మిత్‌తో పాటు గ్రీన్‌ ఎదురుదాడికి దిగడంతో రెండు సెషన్లు పూర్తిగా ఆధిపత్యం చూపింది. అయితే ఉదయం సెషన్‌లో రెండో బంతికే భారత్‌ సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. బుమ్రా ఓవర్‌లో లబుషేన్‌ ఇచ్చిన క్యాచ్‌ను స్క్వేర్‌ లెగ్‌లో విహారి వదిలేయడం దెబ్బతీసింది. ఆ తర్వాత లబుషేన్‌ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. మూడో వికెట్‌కు స్మిత్‌తో కలిసి 103 పరుగులు భాగస్వామ్యం అందించాడు. అయితే 47వ ఓవర్‌లో లబుషేన్‌ను సైనీ అవుట్‌ చేశాడు. కీపర్‌ సాహా డైవింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. ఆ తర్వాత సైనీ ఓవర్‌లోనే వేడ్‌ (4) కూడా సాహాకే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అటు 134 బంతుల్లో స్మిత్‌ హాఫ్‌ సెంచరీతో ఫామ్‌ను చాటుకున్నాడు.


గ్రీన్‌ దూకుడు: తొలి సెషన్‌లో 2.26 రన్‌రేట్‌తో రన్స్‌ రాబట్టిన ఆసీస్‌ లంచ్‌ బ్రేక్‌ తర్వాత చెలరేగి 130 పరుగులు సాధించింది. తొలి ఓవర్‌లోనే స్మిత్‌ 6,4తో గేరు మార్చాడు. ఆ తర్వాత రెండు ఫోర్లు సాధించి సెంచరీ వైపు కదిలాడు. కానీ 68వ ఓవర్‌లో స్మిత్‌ను అశ్విన్‌ ఎల్బీ చేశాడు. దీనిపై స్మిత్‌ రివ్యూకు వెళ్లినా ఫలితం దక్కలేదు. ఈ దశలో కెప్టెన్‌ పెయిన్‌, గ్రీన్‌ వన్డే తరహాలో చెలరేగారు. దీనికితోడు 75వ ఓవర్‌లో పెయిన్‌ క్యాచ్‌ను రోహిత్‌ వదిలేయగా, అదే ఓవర్‌లో అతను రెండు ఫోర్లు బాదాడు. ఇక గ్రీన్‌ ఒక్కసారిగా బ్యాట్‌ ఝుళిపిస్తూ 86వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, మరుసటి ఓవర్‌లో 4,6తో శతకం వైపు పయనించాడు. కానీ 87వ ఓవర్‌లోనే బుమ్రా అతడిని అవుట్‌ చేయడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేస్తున్నట్టు ప్రకటించి టీ బ్రేక్‌కు వెళ్లింది. ఆరో వికెట్‌కు ఈ జోడీ 116 బంతుల్లో 104 రన్స్‌ అందించడం విశేషం.


శుభారంభం: భారీ ఛేదనలో భారత్‌కు ఓపెనర్లు రోహిత్‌, గిల్‌ (31) శుభారంభం అందించారు. ఆత్మవిశ్వాసంతో కనిపించిన వీళ్లిద్దరు చెత్త బంతులను ఫోర్లుగా మలుస్తూ ఒత్తిడి లేకుండా ముందుకు సాగారు. 20వ ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన రోహిత్‌.. మరుసటి ఓవర్‌లోనే పుల్‌షాట్‌తో భారీ సిక్సర్‌ సాధించాడు. అయితే 23వ ఓవర్‌లో గిల్‌ను పేసర్‌ హాజెల్‌వుడ్‌ అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అటు పుజార ఎదుర్కొన్న మూడో బంతికే అంపైర్‌ ఎల్బీగా ప్రకటించినా తను రివ్యూకు వెళ్లి గట్టెక్కాడు. కానీ అర్ధసెంచరీతో జోరుమీదున్న రోహిత్‌ మ్యాచ్‌ కొద్ది నిమిషాల్లో ముగుస్తుందనగా అనవసర షాట్‌కు వెళ్లి అవుటయ్యాడు. కమిన్స్‌ బౌన్సర్‌ను భారీషాట్‌కు ప్రయత్నించి బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌లెగ్‌లో స్టార్క్‌కు దొరికిపోయాడు. ఆ తర్వాత రహానె, పుజార రోజును ముగించారు. 


స్కోరుబోర్డు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 338; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 244;

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: వార్నర్‌ (ఎల్బీ) అశ్విన్‌ 13; పకోస్కీ (సి సబ్‌) సాహా (బి) సిరాజ్‌ 10; లబుషేన్‌ (సి సబ్‌) సాహా (బి) సైనీ 73; స్మిత్‌ (ఎల్బీ) అశ్విన్‌ 81; వేడ్‌ (సి సబ్‌) సాహా (బి) సైనీ 4; గ్రీన్‌ (సి సబ్‌) సాహా (బి) బుమ్రా 84; పెయిన్‌ (నాటౌట్‌) 39; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 87 ఓవర్లలో 312/6 డిక్లేర్‌. వికెట్లపతనం: 1-16, 2-35, 3-138, 4-148, 5-208, 6-312. బౌలింగ్‌: బుమ్రా 21-4-68-1; సిరాజ్‌ 25-5-90-1; సైనీ 16-2-54-2; అశ్విన్‌ 25-1-95-2. 


భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) స్టార్క్‌ (బి) కమిన్స్‌ 52; గిల్‌ (సి) పెయిన్‌ (బి) హాజెల్‌వుడ్‌ 31; పుజార (బ్యాటింగ్‌) 9; రహానె (బ్యాటింగ్‌) 4; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 34 ఓవర్లలో 98/2. వికెట్ల పతనం: 1-71, 2-92. బౌలింగ్‌: స్టార్క్‌ 6-0-27-0; హాజెల్‌వుడ్‌ 8-3-11-1; కమిన్స్‌ 9-1-25-1; లియాన్‌ 9-3-22-0; గ్రీన్‌ 2-0-12-0.

Updated Date - 2021-01-11T07:43:33+05:30 IST