విడవని ముసురు

ABN , First Publish Date - 2020-08-15T10:06:25+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కొనసాగుతున్నాయి. ఇరు జిల్లాలో శుక్రవారం విడవకుండా

విడవని ముసురు

ఇరు జిల్లాల్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షం 

స్తంభించిన జన జీవనం  

ఏజెన్సీ ప్రాంతాల్లో పొంగి ప్రవహిస్తున్న వాగులు

భద్రాచలం వద్ద 36 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం 

తాలిపేరు 23 గేట్లు ఎత్తి 1.28లక్షల క్యూసెక్కుల నీరు విడుదల 

ఖమ్మం వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న మున్నేరు


ఖమ్మం/కొత్తగూడెం/భద్రాచలం, ఆగస్టు 14: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కొనసాగుతున్నాయి. ఇరు జిల్లాలో శుక్రవారం విడవకుండా ముసురు పట్టింది. దాంతో జనజీవనం స్తంభించింది. జిల్లాలో సగటున 33.10 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. ముసురు కారణంగా జనం ఇళ్లకే పరిమితమయ్యారు. భద్రాద్రి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆళ్లపల్లి, గుండాల మండలాల్లోని  వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో ఆ రెండు మండలాల్లోని సుమారు 50గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.


గుండాల మండలంలో మూడు పూరిళ్లు కూలిపోయాయి. ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదు. సింగరేణి ఓసీల్లో సుమారు 1.60లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగినట్లు సమాచారం. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు శుక్రవారం మధ్యాహ్నం ప్రాజెక్టు 25గేట్లలో 23గేట్లు ఎత్తి 1,28,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురుస్తుండడంతో రేపు కూడా డ్యాంలోకి భారీగా నీరు చేరే అవకాశం ఉందని ప్రాజెక్టు డీఈ తిరుపపతి తెలిపారు.


పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పెరగింది. భద్రాచలం శుక్రవారం రాత్రి 10గంటలకు నీటిమట్టం 37.8అడుగులకు చేరింది. శనివారం ఉదయానికి మొదటి ప్రమాద హెచ్చరిక అయిన 43అడుగులకు ప్రవాహం పెరగవచ్చని అధికారులు తెలిపారు. గోదావరి వరద పెరుగుతుండడంతో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం ఐటీడీఏ పీవో పోత్రు గౌతమ్‌ ఆదేశించారు. 


ఖమ్మం జిల్లాలో మూడురోజులుగా ముసురు 

ఖమ్మం జిల్లాలో మూడురోజులుగా ముసురు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 19.5మి.మీ. సగటు వర్షపాతం నమోదుకాగా కారేపల్లిలో అత్యధికంగా 28.2మి.మీ వర్షం కురిసింది. జిల్లాలో వైరా, లంకాసాగర్‌, సింగభూపాలెం, ప్రాజెక్టులు నిండి అలుగులు పారుతున్నాయి. ఖమ్మం సమీపంలో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది.  

Updated Date - 2020-08-15T10:06:25+05:30 IST