Abn logo
Feb 14 2020 @ 05:30AM

దేశ రక్షణకు పాటుపడడమే నిజమైన నివాళి

దేశంలోని ప్రజలందరమూ సురక్షితంగా, సంతోషంగా ఉంటున్నామంటే దానికి కారణం సరిహద్దుల్లో దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులే. అలాంటి సైనికులపై ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు (2019 ఫిబ్రవరి 14) ఉగ్రవాద దాడి జరిగింది. నాటి జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలోని పుల్వామా జిల్లా లేథిపుర(అవంతిపుర) సమీపంలో ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనశ్రేణిపై నరహంతక ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ కిరాతక దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించారు. దేశమంతా ఉలిక్కిపడింది. భారతీయులందరూ కళవళ పడ్డారు, దుఖించారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోయినట్టే బాధపడ్డారు. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాలి అని దేశం మొత్తం ఒక్కటై నినదించింది. ఈ దాడికి ప్రతీకారంగా భారత్‌ ఫిబ్రవరి 26న బాలాకోట్‌లోని జైష్‌–ఎ–మహమ్మద్‌ ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు చేసి, వాటన్నిటినీ నాశనం చేసింది. 

   దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 72 సంవత్సరాలు అయినా మనం ఇతర దేశాలతో పోల్చుకుంటే రక్షణ రంగంలో చాలా వెనకబడి ఉన్నాం. రష్యా, అమెరికా, ఇజ్రాయిల్ లాంటి దేశాలు ఆయుధాలు తయారుచేసి వేరే దేశాలకు ఎగుమతులు చేస్తున్నాయి. భారతదేశం ఇంకా దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ప్రతిసారి కేంద్ర బడ్జెట్లో సింహ భాగం రక్షణ రంగానికి కేటాయిస్తున్నారు. కానీ, అవి సరిగా వినియోగం కావడం లేదు. దానితో రక్షణపరంగా అత్యాధునిక ఆయుధాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం లేదు. గతంలో రక్షణ రంగంలో కూడా అవినీతి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. గత ప్రభుత్వాల నిర్వాకాలే వీటికి కారణాలని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల రఫెల్ యుద్ధ విమానాలను దిగుమతి చేసుకోవడం, ఆర్మీ జవాన్లకు రక్షణ కవచాలను అందించడం, బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్లు అందించడం, అమరవీరుల స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయడం, సరిహద్దులో దారులను పటిష్ఠం చేయడం లాంటి చర్యలు ఎన్నో చేపట్టింది. రక్షణ రంగంపైనా, సైనికుల భద్రతపైనా ప్రత్యేక దృష్టి పెట్టి కృషి చేస్తోంది. అయినప్పటికీ ఇంకా రక్షణ రంగాన్ని ఆధునీకరించ వలసిన అవసరం ఉంది. ఆర్మీ జవాన్లను కాపాడటానికి భవిష్యత్తులో నిఘా వ్యవస్థను పటిష్టం చేయడం, అధునాతన ఆయుధాలను అందించడం వంటివి చేయాల్సి ఉంది. నేడు యువత ఆర్మీ అంటేనే దూరం పోయే పరిస్థితికి వచ్చింది. ఈ వైఖరి మారాలి. ‘దేశం ఏమి ఇచ్చింది అని కాకుండా దేశానికి మనం ఏమి ఇవ్వాలనే’ ఆలోచనతో దేశ సేవకై అంకితం కావాల్సిన సమయం వచ్చింది. అమరవీరులను ఆదర్శంగా తీసుకుని దేశ రక్షణకు, సేవకు అంకితం అవ్వడమే మనం పుల్వామా అమరులకు అర్పించే ఘన నివాళి అవుతుంది. నేడే దానికి ప్రతిజ్ఞ చేద్దాం, త్రికరణ శుద్ధిగా దేశ రక్షణకు శ్రీకారం చుడదాం... జై జవాన్..

చింత ఎల్లస్వామి 

Advertisement
Advertisement
Advertisement