అన్న క్యాంటీన్లు రద్దు అన్యాయం

ABN , First Publish Date - 2021-03-09T06:53:17+05:30 IST

పట్టణాల్లో, నగరాల్లో అభాగ్యులకు అయిదు రూపాయలకే ఆహారం అందించి వారి ఆకలి తీర్చే ప్రయత్నం చేసింది గత తెలుగుదేశం ప్రభుత్వం. అన్నార్తుల ఆకలి...

అన్న క్యాంటీన్లు రద్దు అన్యాయం

పట్టణాల్లో, నగరాల్లో అభాగ్యులకు అయిదు రూపాయలకే ఆహారం అందించి వారి ఆకలి తీర్చే ప్రయత్నం చేసింది గత తెలుగుదేశం ప్రభుత్వం. అన్నార్తుల ఆకలి తీర్చడం కోసం ప్రారంభించిన అన్న క్యాంటీన్లు పేదల జీవితాల్లో వెలుగులు నింపాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 368 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించి, మొదట 203 క్యాంటీన్లు ప్రారంభించి రోజుకు 3 లక్షల మంది అన్నార్తులకు అయిదు రూపాయలకే ఆకలి తీర్చే పవిత్రమైన కార్యక్రమం చేపట్టింది గత ప్రభుత్వం. అవి అన్నార్తులకు అండగా నిలుస్తున్నాయని గత ప్రభుత్వాన్ని అందరూ అభినందించారు. రోజుకు మూడు లక్షల మంది మూడు పూటలు కేవలం పదిహేను రూపాయలకే ఆకలి తీర్చుకొనేవారు. పేదలకు అన్నం ఏదో అరకొరగా వడ్డించడం కాకుండా, గౌరవప్రదంగా వారు తిన్నంత మేరకు, ఆరోగ్యకరంగా, రుచి, శుభ్రతతో అందించడం జరిగింది. మార్కెట్ కి పంటలు తెచ్చిన రైతులు, అడ్డామీద కూలీలు, పనులకు వెళ్ళిన కూలీలు, ఆస్పత్రులకు వచ్చిన పేదలు, పట్టణాల్లో కోచింగ్ సెంటర్లకి వచ్చిన విద్యార్ధులు, ఆటో డ్రైవర్లు, రిక్షా లాగేవారు... ఇలా ఎంతో మంది అన్న క్యాంటీన్లలో కడుపునింపుకొనేవారు. హోటళ్ళలో అరవై డెబ్భై రూపాయలు ఖర్చుచేయలేనివారిని అన్న క్యాంటీన్లు ఆదరించాయి. ఎంతో సౌకర్యవంతంగా నిర్మించిన ఈ క్యాంటీన్లలో ఒకేసారి 50 నుండి, 60 మంది భోజనం చెయ్యవచ్చు. లైటింగు, ఫ్యాన్లు, తాగు నీటి సదుపాయం కల్పించి రుచి,శుభ్రతలకు ప్రాధాన్యం ఇచ్చారు. 

అయిదు రూపాయలకే కడుపునిండా భోజనం అందించే ఈ అద్భుత కార్యక్రమాన్ని అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రద్దుచేసింది. గత ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసిందన్న అక్కసుతో, చంద్రబాబుకి పేరు వస్తుందన్న ద్వేషంతో ఈ క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపు కొట్టింది జగన్‌ ప్రభుత్వం. కరోనా కాలంలో ఉపాధి కోల్పోయి ఆకలి కేకలు మిన్నంటుతున్న స్థితిలో అన్న క్యాంటీన్లు ఉండివుంటే అవి అన్నార్తుల ఆకలి తీర్చేవి. పేదల ఆకలి తీర్చడం కన్నా పుణ్య కార్యక్రమం ఏముంటుంది? కావాలంటే ప్రస్తుత ప్రభుత్వం వాటి పేరు మార్చి తమకు నచ్చిన పేర్లతో నడుపుకోవచ్చు. అంతే తప్ప మధ్యలో పేదలమీద కక్ష ఎందుకు? వారి ఆకలి తీర్చేందుకు ఉద్దేశించిన వ్యవస్థలను బలిచేయడం ఎందుకు? క్యాంటిన్లు మూతపడటానికీ ప్రభుత్వానికీ సంబంధంలేదని బుకాయిస్తున్నారు. ప్రభుత్వానికి తెలియకుండా వాటిని మూసివేస్తే ఇక ప్రభుత్వం ఉన్నది ఎందుకు?క్యాంటీన్లు మూసివేసి వాటిని వార్డు సచివాలయాలుగా మార్చివేసింది నిజం కాదా? 

రాష్ట్రంలో ఇసుక కొరత సృష్టించిన కారణంగా భవన నిర్మాణ రంగ కార్మికులు దాదాపు 30 లక్షల మంది రోడ్డున పడ్డారు. పనులులేక ఎంతో మంది పస్తులుంటున్నారు. ప్రభుత్వం పంతానికి పోయి పేదలను ఆకలికి గురిచేయడం సముచితం కాదు. ప్రభుత్వం అనేక వృధా ఖర్చులతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నది కానీ, పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల నిర్వహణకి మాత్రం దానికి ప్రాణం ఒప్పడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వెయ్యడానికీ తొలగించడానికీ వందల కోట్లు తగలేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా క్యాంటీన్ల ద్వారా ఉచితంగా భోజనం అందించి పేదల ఆకలి తీరుస్తున్నది. అనేక దేశాలు కూడా ఉపాధి కోల్పోయిన ప్రజల ఆకలి తీర్చడానికి కార్యక్రమాలు చేపట్టాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం పేదల ఆకలి అర్ధం చేసుకోవడం లేదు. అన్న క్యాంటీన్ల ద్వారా వారి ఆకలి తీర్చడానికి చేతులు రావడం లేదు. గతంలో ప్రభుత్వాలు మారినప్పుడు ప్రజాప్రయోజన పధకాలను రద్దు చేసేవారు కాదు. ఆ పధకం పేరు మార్చి నచ్చిన పేరు పెట్టి కొనసాగించేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రోజుకు 3 లక్షల మంది ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లను రద్దు చేసి వారి పొట్టగొట్టింది. ఇంతకు మించిన అన్యాయం, దుర్మార్గం వుంటుందా? ఇప్పటికైనా ప్రభుత్వం పంతం విడనాడి అన్న క్యాంటీన్లు తెరిపించి అన్నార్తులను ఆదుకోవాల్సిన అవసరం వుంది.

నీరుకొండ ప్రసాద్ 

Updated Date - 2021-03-09T06:53:17+05:30 IST