నయా చిరుత జాకబ్స్‌

ABN , First Publish Date - 2021-08-02T09:52:56+05:30 IST

ఒలింపిక్స్‌ ప్రత్యేకం అనుకుంటే అందులో అథ్లెటిక్స్‌ దానిలోనూ పురుషుల 100 మీ. స్ర్పింట్‌ మరీమరీ క్రేజ్‌..అందునా జమైకా దిగ్గజ స్ర్పింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌ గత మూడు విశ్వక్రీడల్లో హ్యాట్రిక్‌ టైటిళ్లతో...

నయా చిరుత జాకబ్స్‌

  • ఇటలీ అథ్లెట్‌కు స్ర్పింట్‌ స్వర్ణం  
  • డి గ్రాస్‌కు కాంస్యం

ఒలింపిక్స్‌ ప్రత్యేకం అనుకుంటే అందులో అథ్లెటిక్స్‌ దానిలోనూ పురుషుల 100 మీ. స్ర్పింట్‌ మరీమరీ క్రేజ్‌..అందునా జమైకా దిగ్గజ స్ర్పింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌ గత మూడు విశ్వక్రీడల్లో హ్యాట్రిక్‌ టైటిళ్లతో వేసిన ముద్ర తర్వాత ఈ ఈవెంట్‌ సంతరించుకున్న స్పెషాల్టీ అంతాఇంతాకాదు.. టోక్యోలో టైటిల్‌ గెలుస్తాడని బోల్ట్‌ అంచనా వేసిన అమెరికా అథ్లెట్‌ ట్రెవాన్‌ బ్రోమెల్‌, జమైకా యోధుడు యోహాన్‌ బ్లేక్‌, కెనడా వీరుడు డి గ్రాస్‌ బరిలో ఉండడంతో రేస్‌ రసవత్తరమని భావించారు..కానీ బ్రోమెల్‌, బ్లేక్‌ అసలు ఫైనల్‌కే క్వాలిఫై కాలేకపోవడంతో ఆసక్తి తగ్గిన రేస్‌లో ఇటలీకి చెందిన


మార్సెల్‌ జాకబ్స్‌ అనూహ్యంగా కొత్త చిరుతగా నిలిచాడు..

పురుషుల 100 మీ. పరుగులో ఊహించని ఫలితం. ఉసేన్‌ బోల్ట్‌ లేని ఈ విభాగం టైటిల్‌ ఎవరైనా సొంతం చేసుకొనేందుకు అవకాశం ఏర్పడింది. అయితే ఫైనల్‌కు చేరిన వారిలో రియో గేమ్స్‌ కాంస్య పతక విజేత ఆండ్రీ డి గ్రాస్‌ను ఫేవరెట్‌గా వేసిన అంచనా కూడా తప్పయిం ది. ఆదివారం జరిగిన రేస్‌లో ఇటలీకి చెందిన 26 ఏళ్ల లామోంట్‌ మార్సెల్‌ జాకబ్స్‌ 9.80 సెకన్ల టైమింగ్‌లో పసిడి పతకం చేజిక్కించుకున్నాడు. తద్వారా ఈ ప్రతిష్ఠాత్మక రేస్‌ను గెల్చుకున్న తొలి ఇటలీ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. అమెరికా అథ్లెట్‌ ఫ్రెడ్‌ కెర్లీ రజతం దక్కించుకోగా, ఆండ్రీ డి గ్రాస్‌ మరోసారీ కాంస్యానికే పరిమితమయ్యాడు. 1992 గేమ్స్‌లో లిన్‌ఫోర్డ్‌ క్రిస్టీ (బ్రిటన్‌) తర్వాత ఒలింపిక్‌ పురుషుల 100 మీ.  రేస్‌ నెగ్గిన మొదటి యూరప్‌ అథ్లెట్‌గా మార్సెల్‌ రికార్డు నెలకొల్పాడు. బ్రిటన్‌కు చెందిన జార్నెల్‌ హ్యూజెస్‌ తప్పుగా రేస్‌ను ఆరంభించి అనర్హతకు గురయ్యాడు. 


చిన్ననాటి కల

‘ఒలింపిక్స్‌ 100 మీ. రేస్‌ గెలవాలన్నది నా చిన్ననాటి కల. బోల్ట్‌ తర్వాత స్వర్ణ పతకం నాదేనన్న నిజాన్ని నమ్మలేకపోతున్నా’ అని మార్సెల్‌ వ్యాఖ్యానించాడు. అమెరికాలో పుట్టిన మార్సెల్‌ నెలల పసికందుగా ఉన్నప్పుడే అతణ్ణి తీసుకుని తల్లి ఇటలీ వచ్చేసింది. కాగా..2000 సిడ్నీ ఒలింపిక్స్‌ అనంతరం విశ్వక్రీడల 100 మీ. ఫైౖనల్లో ఓజమైకా అథ్లెట్‌ లేకపోవడం ఇదే మొదటిసారి. 


లైట్‌ షో నడుమ అథ్లెట్ల పరిచయం: రేస్‌కు ముందు అథ్లెట్ల పరిచయం వినూత్నంగా జరిగింది. స్టేడియంలో ఫ్లడ్‌లైట్లన్నీ ఆర్పేసి 12 ప్రొజెక్టర్ల ద్వారా  త్రీడీ లైటింగ్‌లో ప్రపంచాన్ని చూపిస్తూ అనంతరం స్టేడియం పైభాగంలో ఆ లైటింగ్‌ను ఫోకస్‌ చేశారు. ఆపై అథ్లెట్‌ పేరు ప్రకటించగానే అతడిపైకి ఫోకస్‌ చేశారు.  




విజేతలు


మార్సెల్‌ జాకబ్స్‌ (ఇటలీ) స్వర్ణం (9.80సె) 

ఫ్రెడ్‌ కెర్లీ (అమెరికా) రజతం (9.84సె)

ఆండ్రీ డి గ్రాస్‌ (కెనడా) కాంస్యం (9.89సె) 




Updated Date - 2021-08-02T09:52:56+05:30 IST