ఇటలీ x ఇంగ్లండ్‌

ABN , First Publish Date - 2021-07-11T07:56:31+05:30 IST

వింబుల్డన్‌లో పురుషుల సిం గిల్స్‌ ఫైనల్‌కు ఆదరణ మామూలుగా ఉండదు. రాయల్‌ బాక్స్‌లో రాజవంశీయుల నుంచి వివిధ రంగాల ప్రముఖుల వరకు అంతా అక్కడి గ్రీన్‌ కుర్చీల్లో ఆసీనులై ఆసక్తిగా మ్యాచ్‌ను తిలకిస్తుంటారు.

ఇటలీ x ఇంగ్లండ్‌

యూరో ఆఖరి పోరాటం నేడే

వింబుల్డన్‌ వద్దు..

యూరో ఫైనల్‌ ముద్దు


వింబుల్డన్‌లో పురుషుల సిం గిల్స్‌ ఫైనల్‌కు ఆదరణ మామూలుగా ఉండదు. రాయల్‌ బాక్స్‌లో రాజవంశీయుల నుంచి వివిధ రంగాల ప్రముఖుల వరకు  అంతా అక్కడి గ్రీన్‌ కుర్చీల్లో ఆసీనులై ఆసక్తిగా మ్యాచ్‌ను తిలకిస్తుంటారు. కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించే అవకాశం లేదు. ఎందుకంటే అదే రోజు యూరో కప్‌ ఫైనల్‌ జరగబోతోంది. దీనికి తోడు 1966 తర్వాత ఓ మేజర్‌ టోర్నీ ఫైనల్‌కు ఇంగ్లండ్‌ అర్హత సాధించడంతో అభిమానుల్లో ఎక్కడలేని జోష్‌ కనిపిస్తోంది. అందుకే అంతా చలో.. వెంబ్లీ స్టేడియం అంటూ ఇప్పటికే టిక్కెట్లను కూడా కొనిపెట్టుకున్నారు. ఈకారణంగా జొకోవిచ్‌ టైటిల్‌ పోరుకు ఆదరణ కరవయ్యే అవకాశం ఉంది.


లండన్‌: ప్రతిష్ఠాత్మక యూరోపియన్‌ చాంపియన్‌షి్‌ప ముగింపు దశకు వచ్చేసింది. ఆదివారం అర్ధరాత్రి జరిగే తుది పోరులో ఇటలీ-ఇంగ్లండ్‌ టైటిల్‌ కోసం పోరాడనున్నాయి. అటు 55 ఏళ్ల తర్వాత ఓ మేజర్‌ టోర్నీ ఫైనల్‌కు చేరిన ఇంగ్లండ్‌ తొలి యూరో కప్‌ను గెలవాలనుకుంటోంది. అందుకే 60వేల ప్రేక్షకుల మధ్య స్థానిక వెంబ్లీ స్టేడియంలో హ్యారీ కేన్‌ సేన చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. అలాగే 1968లో ఈ టైటిల్‌ నెగ్గిన ఇటలీ జట్టు 2000, 2012లలో రన్నర్‌పగా నిలిచింది. ప్రస్తుతం ఇటలీ వివిధ టోర్నీల్లో కలిపి వరుసగా 33 మ్యాచ్‌ల్లో ఓటమనేదే లేకుండా దూసుకెళ్తోంది.


అలాగే ఈ జట్టుకిది పదో మేజర్‌ టోర్నీ (ఆరు ప్రపంచక్‌పలు, నాలుగు యూరోలు) ఫైనల్‌ కావడం విశేషం. అంతేకాదు.. ఓ పెద్ద టోర్నమెంట్‌లో ఇటలీ జట్టుకు ఇంగ్లండ్‌పై ఓటమనేదే లేదు. యూరో కప్‌లో ఈ రెండు జట్లు తలపడడం ఇది మూడోసారి. చివరిసారి 1980 యూరో కప్‌లో  పోటీపడ్డాయి. ఓవరాల్‌గా ఇరు జట్ల మధ్య 27 మ్యాచ్‌లు జరగ్గా ఇటలీ 11 సార్లు, ఇంగ్లండ్‌ 8 సార్లు గెలిచింది. 8 డ్రా అయ్యాయి. 


ఇంగ్లండ్‌కు జరిమానా:

సెమీఫైనల్లో డెన్మార్క్‌ గోల్‌కీపర్‌ కాస్పెర్‌ ష్మెషెల్‌పై లేజర్‌ లైట్‌ ప్రయోగించినందుకు ఇంగ్లండ్‌ ఫుట్‌బాల్‌ సంఘంపై ‘ఫిఫా’ జరిమానా విధించింది. హ్యారీ కేన్‌ పెనాల్టీ కిక్‌ను కొట్టే సమయంలో ఇంగ్లండ్‌ అభిమాని ఒకరు కీపర్‌ కళ్లపై లేజర్‌ లైటు పడేలా చేశాడు. టీవీల్లోనూ ఇది స్పష్టంగా కనిపించింది.

Updated Date - 2021-07-11T07:56:31+05:30 IST