ఇటలీ నవ్వింది!

ABN , First Publish Date - 2021-07-13T06:16:51+05:30 IST

ఐదు దశాబ్దాల తర్వాత దక్కిన అరుదైన అవకాశాన్ని ఇంగ్లండ్‌ జట్టు చేజార్చుకుంది. ‘ఇట్స్‌ కమింగ్‌ హోమ్‌’

ఇటలీ నవ్వింది!

  •  ఇంగ్లండ్‌ చేజారిన గోల్డెన్‌ చాన్స్‌ 
  •  పెనాల్టీ షూటౌట్‌ ద్వారా ఫలితం
  •  యూరో చాంపియన్‌షిప్‌

 ఐదు దశాబ్దాల తర్వాత దక్కిన అరుదైన అవకాశాన్ని ఇంగ్లండ్‌ జట్టు చేజార్చుకుంది. ‘ఇట్స్‌ కమింగ్‌ హోమ్‌’ అనే నినాదంతో ఏర్పడిన అతి విశ్వాసమో.. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేసిందో కానీ తుది పోరులో బోల్తా పడింది. అటు ఇటలీ జట్టు మాత్రం వరుసగా 34వ విజయంతో ‘ఇట్స్‌ కమింగ్‌ రోమ్‌’ అంటూ రెండో యూరో కప్‌ను తీసుకెళ్లింది. క్రితం సారి ఫిఫా వరల్డ్‌క్‌పనకు అర్హత సాధించలేకపోయిన ఈ జట్టు ఇప్పుడు యూర్‌పలోనే బెస్ట్‌ టీమ్‌గా నిలవడం విశేషం.


లండన్‌: యూరోపియన్‌ చాంపియన్‌షి్‌పలో ఇటలీ విజేతగా నిలిచింది. ఆదివారం రాత్రి ఇంగ్లండ్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో 3-2 తేడాతో పెనాల్టీ షూటవుట్‌లో గెలిచింది. అంతకుముందు ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. 1968 తర్వాత ఇటలీ మరోమారు యూరో కప్‌ను కైవసం చేసుకుంది. అలాగే ఓ మేజర్‌ టోర్నీలో ఇటలీపై ఓడే ఆనవాయితీని ఇంగ్లండ్‌ ఇక్కడా కొనసాగించింది.  ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌గా ఇటలీ కీపర్‌ గియాన్‌లుగి డొన్నారుమా నిలిచాడు. 


ఆరంభం అదిరినా..: మ్యాచ్‌ ఆరంభమైందో.. లేదో ఇంగ్లండ్‌ అద్భుత బోణీ చేసింది. యూరో ఫైనల్‌ చరిత్రలోనే అత్యంత వేగంగా 2వ నిమిషంలోనే ల్యూక్‌ షా గోల్‌ సాధించాడు. ఆ తర్వాత ఇటలీ ఎక్కువగా బంతిని తన ఆధీనంలో ఉంచుకుని గోల్‌ కోసం తీవ్రంగానే ప్రయత్నించింది. ద్వితీయార్ధం 67వ నిమిషంలో గోల్‌ పోస్టుకు తాకి బయటికి వచ్చిన బంతిని మెరుపు వేగంతో లియొనార్డో బొనుచీ నెట్‌లోనికి పంపడంతో స్కోరు సమమైంది.




ఆ తర్వాత అదనపు సమయంలోనూ ఏ జట్టూ మరో గోల్‌ సాధించలేకపోయింది. దీంతో పెనాల్టీ షూటౌట్‌ అనివార్యమైంది. ఇందులో హైడ్రామా నెలకొంది. ఇటలీ ఐదు పెనాల్టీ కిక్స్‌లో మూడింటిని గోల్స్‌గా మలిచింది. అటు ఇం గ్లండ్‌ తొలి నాలుగు ప్రయత్నాల్లో రెండు గోల్స్‌ మాత్రమే సాధించింది. ఇక అతి కీలక ఐదో కిక్‌లో ఇంగ్లండ్‌ ఏం చేస్తుందోనని అత్యంత ఉత్కంఠ నెలకొంది. అయితే 19 ఏళ్ల బుకాయో సకా బంతిని నేరుగా కుడి వైపున ఇటలీ కీపర్‌ డొన్నారుమా చేతుల్లోకే తన్నడంతో వెంబ్లీ స్టేడియం ఒక్కసారిగా మూగబోయింది. అటు ఇటలీ సంబరాల్లో మునిగిపోయింది.


ఫ్రైజ్‌మనీ


ఇటలీ: రూ.300 కోట్లు (టైటిల్‌ గెల్చినందుకు 88 కోట్లు, గ్రూప్‌, నాకౌట్‌ల్లో గెలుపునకు 212 కోట్లు)

ఇంగ్లండ్‌: 267 కోట్ల రూపాయలు (రన్నరప్‌కు 61 కోట్లు, గ్రూప్‌, నాకౌట్‌ మ్యాచ్‌లకు 206 కోట్లు)




రొనాల్డోకు గోల్డెన్‌ బూట్‌

తాజా యూరో కప్‌లో పోర్చుగీస్‌ కెప్టెన్‌ క్రిస్టియానో రొనాల్డో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆడింది నాలుగు మ్యాచ్‌లే అయినా అతడు మొత్తం ఐదు గోల్స్‌తో  గోల్డెన్‌ బూట్‌ దక్కించుకున్నాడు. అయితే చెక్‌ రిపబ్లిక్‌ స్ట్రయికర్‌ పాట్రిక్‌ షిక్‌ కూడా ఐదు గోల్స్‌ సాధించాడు. కానీ రొనాల్డో తమ జట్టు తరఫున మరో గోల్‌కు సహాయక పాత్ర పోషించి షిక్‌పై పైచేయి సాధించాడు. డిఫెండింగ్‌ చాంప్‌గా బరిలోకి దిగిన పోర్చుగల్‌ క్వార్టర్స్‌లో బెల్జియం చేతిలో ఓడింది.




ఇంగ్లండ్‌ ఫ్యాన్స్‌ రచ్చ

గెలుపు ఖాయమని ఆశించిన తమ జట్టు ఫైనల్లో ఓడడంతో ఇంగ్లండ్‌ ఫ్యాన్స్‌ అల్లరి శృతి మించింది. స్టేడియం నుంచి బయటికి వెళ్లే దారిలో ఇటలీ అభిమానులపై పిడిగుద్దులు కురిపించారు. వారి జాతీయ పతాకాన్ని అవమానపరిచారు. అలాగే నల్లజాతీయులు కనిపించినా వదల్లేదు. ఇక వీధుల్లో వీరంగానికి అంతే లేకుండా పోయింది. ఈ ఘర్షణలో అటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దీనికి తోడు పెనాల్టీ షూటౌట్‌లో చివరి మూడు గోల్స్‌ను విఫలం చేసిన మార్కస్‌ రాష్‌ఫోర్డ్‌, జేడన్‌ సాంచో, బుకాయో సకా నల్ల జాతీయులు కావడంతో వారిపై వర్ణవివక్ష దాడికి దిగారు. సోషల్‌ మీడియాలో ఈ త్రయాన్ని విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. అయితే ఫుట్‌బాల్‌ వర్గాల నుంచే కాకుండా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆ ముగ్గురు ఆటగాళ్లకు మద్దతు పలికాడు. వారంతా ఇంగ్లండ్‌ జట్టు హీరోలని కొనియాడారు. అటు పోలీసులు కూడా ఈ ఘటనపై విచారణ చేపట్టారు.


Updated Date - 2021-07-13T06:16:51+05:30 IST