Abn logo
Apr 1 2021 @ 00:22AM

ఆచితూచి చేసిన యుద్ధం అది!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పై రాజకీయంగా ఉండే సానుకూల, ప్రతికూల అభిప్రాయాలను పక్కనబెడితే, ఆయన జీవితంలో ఆయనే చెప్పుకున్న కొన్ని విశేషాల గురించి, వాటిలోని సత్యాసత్యాల గురించి అనుమానాలైతే ఏర్పడ్డాయి. ఉన్నత విద్య, టీ కొట్టులో పనిచేయడం, ఈ మెయిల్, స్మార్ట్ ఫోన్ వాడకం మొదలైనవాటిని అనేకులు సవాల్ చేశారు. ఆ అనుమానాలను నివృత్తి చేయడానికి సరైన ప్రయత్నం జరగలేదో నిజంగానే ఏమైనా తేడాలున్నాయో తెలియదు, కనీసం కొన్ని అనుమానాలు స్థిరపడిపోయాయి. ఆయనను, ఆయన రాజకీయాలను విమర్శించేవారికి ఈ అనుమానాలు సహజంగానే అపహాస్యానికి, అవహేళనకు ఉపయోగపడుతున్నాయి. ప్రధాన స్రవంతి మీడియా కాస్త ఆచితూచి వ్యవహరిస్తుంది కానీ, సామాజిక మాధ్యమాలు నిర్దాక్షిణ్యంగా ఉంటాయి వాటికి రెండువైపులా పదును. అదను దొరకడం ఆలస్యం విరుచుకు పడతాయి. బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన నరేంద్రమోదీ తాను ఇరవైఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ కోసం సత్యాగ్రహం చేసి జైలుకు కూడా వెళ్లానని చెప్పడం పెద్ద సంచలనమైంది. యథావిధిగా ఆయన బడాయి మాటలు చెబుతున్నారని వ్యాఖ్యలు మొదలయ్యాయి. కార్టూన్లు, మీమ్‌లు, వక్రీకరించిన ఫోటోలు గట్రా వస్తూనే ఉన్నాయి. మోదీ ఖచ్చితంగా పాల్గొన్నారా, జైలుకు వెళ్లారా లేదా అన్నది ఇంకా లోతుకు వెళ్లి పరిశోధించవలసి ఉంది కానీ, 1971 ఆగస్టు 12వ తేదీన ఢిల్లీలో బంగ్లాదేశ్ విషయమై తమ డిమాండ్లను నొక్కిచెప్పడానికి అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో అప్పటి భారతీయజనసంఘ్ పెద్ద ప్రదర్శన నిర్వహించిన మాట వాస్తవం. అందులో మోదీ ఉండే అవకాశం తప్పనిసరిగా ఉన్నది. గుజరాత్ గురించి మోదీ 1978లో రాసిన ఒక పుస్తకం చివరి అట్టమీదా, ఈ మధ్య కాలంలో తన జీవితచరిత్రను రాసిన ఒకరికి ఇచ్చిన సమాచారంలోనూ ఆయన తన అరెస్టును పేర్కొన్నారు. వ్యతిరేకులు మాత్రం ఇంకా ఆయనవెంటపడడం ఎందుకు? 


తన చరిత్రలో ముఖ్యమైన రెండు సందర్భాలను బంగ్లాదేశ్ వేడుకగా జరుపుకుంటున్న సందర్భంలో అతిథిగా వెళ్లారు కాబట్టి, మోదీ తన అనుబంధాన్ని స్మరించుకున్నారు. జాతీయోద్యమంలో పాల్గొన లేదని ప్రత్యర్థులు విమర్శించే రాజకీయపార్టీకి చెందినవారు ఆయన. స్వాతంత్ర్యానంతరం జన్మించిన మొదటి ప్రధాని కూడా ఆయనే. కాబట్టి, ఆయన అనుభవాలు సహజంగా ప్రతిపక్ష కార్యకలాపాల నుంచే మొదలవుతాయి. ఎమర్జెన్సీలో మారువేషాలలో సంచరించారు. తన మొట్టమొదటి రాజకీయ ఆచరణ 1971లో ఢిల్లీకి వచ్చి సత్యాగ్రహంలో పాల్గొనడమేనని ఆయన చెప్పుకోవడంలో ఉద్దేశ్యం, గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తరువాత ప్రధానిగా పెద్ద పదవులలోకి రావడానికి ముందు తన నేపథ్య రాజకీయ జీవితంలోని ఆరంభ ఉజ్వల ఘట్టాన్ని గుర్తుచేయడం కూడా. 


బంగ్లాదేశ్ స్వాతంత్ర్యప్రకటనకు యాభై ఏళ్లు, బంగబంధు ముజిబుర్ రెహమాన్‌కు వందేళ్లు నిండిన సందర్భం, ఆ దేశానికే కాదు, భారత్‌కు కూడా గుర్తుచేసుకోవలసిన రోజు. ఈ యాభై ఏళ్ల కాలం ప్రపంచం, భారతదేశం, బంగ్లాదేశ్ కూడా చాలా మారాయి. ఒక ఇరవయ్యేళ్ల స్వయంసేవకుడు తొలిసత్యాగ్రహం నుంచి ప్రధానమంత్రి పదవి దాకా ప్రయాణించడం కూడా ఈ ఐదు దశాబ్దాల కాలాన్ని నిర్వచించవచ్చు. ఆ నిర్వచనంలోనే ఉపఖండపు చరిత్రనంతా గుదిగుచ్చవచ్చును కూడా.


ఆనాటి భారత ఉపఖండం ఇప్పటి వలె లేదు. భారత–-పాకిస్థాన్ దేశాల చుట్టూ అమెరికా, రష్యా, చైనా మోహరించి ఉన్నాయి. భారతదేశంలో జాతీయోద్యమ విలువలను కూడా కలిగి ఉన్న పాత తరం సంప్రదాయవాద నాయకత్వం పోయి, కొత్త నీరు వస్తోంది. అదే సమయంలో ప్రతిపక్షరాజకీయాలూ రాజుకుంటున్నాయి. పాకిస్థాన్‌లో సైనికాధికారుల ప్రభుత్వం దుర్మార్గపు స్థాయికి చేరుకున్నది. తూర్పు పాకిస్థాన్‌పై వివక్ష, ప్రజాస్వామ్యప్రక్రియలపై అణచివేత కలగలసి అమలు జరుగుతున్నాయి. పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ముజిబుర్ రెహమాన్ ఎన్నికయ్యారు. ఆయన పార్టీ అవామీలీగ్ వామపక్ష పోకడలున్న మధ్యేవాద పార్టీ. ప్రజాస్వామ్యమే గిట్టని యాహ్యాఖాన్‌కు ముజిబ్ ఎన్నిక అసలు నచ్చలేదు. అమెరికా పాకిస్థాన్‌కు అన్ని విధాల అండగా ఉంటోంది. చైనా పాకిస్థాన్ మధ్య కూడా అనుబంధం బలపడుతోంది.


ఆ కాలాన్ని ప్రచ్ఛన్నయుద్ధ కాలం అని పిలుస్తారు. అగ్రరాజ్యాలు రెండూ నేరుగా తలపడకుండా, పరోక్షంగా మూడో రంగస్థలంలో దౌత్య, రాజకీయ, వాస్తవ యుద్ధాలు చేస్తూ ఉండేవి. ఉపఖండం అందరికీ కావలసిందే. నెహ్రూ నాయకత్వంలోని తొలి ప్రభుత్వాలు సోషలిస్టు శిబిరానికి దగ్గరగా ఉంటూ, అమెరికాతో కూడా తగుస్నేహం చేయడానికి ప్రయత్నించాయి. ముఖ్యంగా చైనా విషయంలో అమెరికా అభీష్టానికి అనుగుణంగా భారత్ వ్యవహరించడానికి ప్రయత్నించింది. భారతదేశపు ప్రధానులలో అమెరికా వైపు పూర్తిగా మొగ్గిన మొదటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అంటారు. ప్రగతిశీల ప్రధానిగా తనను తాను భావించుకునే ఇందిరాగాంధీ సోవియట్ శిబిరంవైపు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. భారతదేశంలో మితవాద పక్షమైన జనసంఘ్ను పూర్తిగా అమెరికా అనుకూల పార్టీగా చెప్పుకునేవారు. ఆ పార్టీ కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తున్నందు వల్ల కావచ్చు, అప్పటికే వ్యాపార, వర్తక ప్రయోజనాలకు గొంతునివ్వడం వల్ల కావచ్చు, అమెరికా అనుకూలత, ఇజ్రాయిల్ పట్ల ప్రశంసాభావం ప్రస్ఫుటంగా కనిపించేవి. ప్రగతిశీల ముఖాలు ప్రదర్శించినప్పటికీ, నెహ్రూ, ఇందిర ఇద్దరూ కమ్యూనిస్టు వ్యతిరేకతను, లేదా, అమెరికా కూటమి అనుకూలతను ఏదో సందర్భంలో చూపకపోలేదు. హిమాలయాల్లో అణుపరికరంతో ప్రయోగాలు నిర్వహించడానికి అమెరికాను నెహ్రూ అనుమతించడమైనా, ప్రధాని అయినవెంటనే ఇందిరాగాంధీ రీసర్చి అండ్ అనాలసిస్ వింగ్ (రా) స్థాపించి, దానికి ఇజ్రాయిల్‌తో సంబంధాలు ఏర్పరచడమైనా భారత ప్రభుత్వాధినేతల ద్వంద్వ వైఖరినో, ఊగిసలాటనో తెలియజేస్తాయి. అయినా, భారత ప్రభుత్వంపై నమ్మకం లేక సిఐఎ అనేక స్థాయిలలో తన ఏజెంట్లను ఏర్పాటు చేసుకునేది. వారు మంత్రివర్గస్థాయిలో కూడా ఉండేవారని చెబుతారు. భారతదేశం, సోవియట్ యూనియన్‌ల మధ్య స్నేహసహకార ఒడంబడిక 1971 ఆగస్టులో ఏర్పడ్డాక, భారతదేశం దాదాపుగా సోవియట్ కూటమిలోకి చేరిపోయింది. అదే ఒడంబడిక 1971 యుద్ధం జరగడానికి, బంగ్లాదేశ్ ఏర్పడడానికి కూడా కారణం. 


1971 మార్చిలో జరిగిన ఎన్నికలలో పాతకాంగ్రెస్, ఇందిర కాంగ్రెస్ తలపడ్డాయి. జనసంఘ్‌ పాతకాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. ఇందిర ఘనవిజయం సాధించింది. ఆ నెలలోనే తూర్పు పాకిస్థాన్‌లో పరిణామాలు పరాకాష్ఠకు చేరాయి. ముజిబుర్ రెహమాన్‌ను పశ్చిమ పాకిస్థాన్‌కు తీసుకువెళ్లి నిర్బంధించడం, ముజిబ్‌తో పాటు, జియా వుర్ రెహమాన్ బంగ్లాదేశ్ అవతరణను ప్రసారమాధ్యమాల ద్వారా ప్రకటించడం జరిగాయి. పాకిస్థాన్ విభజితమై రెండుకావడం అమెరికాకు, చైనాకు కూడా ఇష్టం లేదు. అదే సమయంలో పాకిస్థాన్‌ను బలహీనపడడం జనసంఘ్‌కు కావలసిన పరిణామం. బంగ్లాదేశ్ అవతరణను లాంఛనంగా ప్రకటించడం నుంచి, వాస్తవంగా బంగ్లాదేశ్ పాకిస్థాన్ నుంచి విముక్తం కావడానికి మధ్య 9 నెలల కాలం గడిచింది. ఈ కాలంలోనే కీలకపరిణామాలన్నీ జరిగాయి. వెనువెంటనే బంగ్లాదేశ్‌ను గుర్తిస్తే, ముక్తిబాహినికి నేరుగా సహకారం అందిస్తే అమెరికా ప్రమేయాన్ని ఆహ్వానించినట్టేనని ఇందిర భావించారు. అత్యంత రహస్యంగా సోవియట్ యూనియన్‌తో సంప్రదింపులు జరిపి ఒడంబడిక సాధించుకున్నాక, బంగ్లాదేశ్ పరిణామాలలో చొరవతో వ్యవహరించారు. రెండు దేశాలలో ఏ ఒక్కటిపైనైనా బయటివారు దాడిచేస్తే, మరొకరు సహాయానికి వెళ్లాలన్నది ఆ ఒడంబడిక సూత్రం. ఇండియాకు వెనుక సోవియట్ యూనియన్ నిలబడిన తరువాత, అమెరికా, చైనా రెండూ బంగ్లాదేశ్ యుద్ధసమయంలో గీత దాటడానికి సాహసించలేదు. ఆ తొమ్మిది నెలల కాలంలోనే వాజపేయి సత్య్రాగ్రహం చేశారు. సత్యాగ్రహం, సోవియట్ ఒప్పందం రెండూ ఆగస్టుమాసంలోనే జరిగాయి. ఆనాడు జనసంఘ్‌ది విచిత్రమైన పరిస్థితి. పాకిస్థాన్‌లో భారత్ జోక్యం చేసుకోవాలి, కానీ, రష్యా సాయం తీసుకోగూడదు. ఉపఖండంలో సోవియట్ యూనియన్ ప్రాబల్యం పెరగకూడదు. 


ఐదు దశాబ్దాల తరువాత వెనక్కి తిరిగి చూస్తే, ఇవాళ సోవియట్ యూనియన్ దాని కూటమీ లేవు, ప్రచ్ఛన్నయుద్ధమూ లేదు, వామపక్ష మధ్యేవాదిగా కనిపించిన ముజిబుర్ రెహమాన్ నాలుగేళ్లకే నియంతగా మారిపోయారు. పాకిస్థాన్ లాగానే బంగ్లాదేశ్ కూడా సైనిక పాలనలోకి వెళ్లింది. పాకిస్థాన్ ఉర్దూజాతీయవాదం మీద నిప్పులు చెరిగిన ముజిబ్ బంగ్లాదేశ్ లో బంగ్లాదేశీ జాతీయవాదం కాక, బెంగాలీ జాతీయతనే ప్రోత్సహించాడు. చిటగాంగ్ తెగలకు ఉన్న ప్రత్యేక హక్కులను నిరాకరించాడు. స్వతంత్ర ప్రకటనలో ముజిబ్‌తో పాటు ఉన్న జియా వుర్ రెహమాన్ తరువాత బంగ్లా పాలకుడయ్యాడు. ముజిబ్, ఆయన కుమార్తె హసీనా ఇద్దరూ సోవియట్ శిబిరంలో ఉంటే, జియా, ఆయన భార్య ఖలీదా జియా అమెరికాను అంటిపెట్టుకుని ఉన్నారు. భారతదేశంలో భారతీయజనతాపార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి, మంచి చేసుకోవడం కోసం వాజపేయి 1971 సత్యాగ్రహాన్ని హసీనా ప్రభుత్వం స్మరించుకున్నది తప్ప, నాటి ఆ ఆందోళన ముజిబ్ వర్గానికి సారాంశంలో వ్యతిరేకమైనదని ఆమెకు తెలియకపోలేదు. బంగ్లాదేశ్ యాభై ఏళ్ల నాటి నేత వారసత్వమే కొనసాగుతున్నది. భారతదేశంలో బంగ్లా విమోచన పై భిన్న ఆలోచనలుండిన పార్టీ అధికారంలో ఉన్నది. 


1905 నుంచి భారతదేశ పరిణామాలలో బెంగాల్ ముఖ్యపాత్ర వహిస్తూ వచ్చింది. బెంగాల్ విభజనను జాతి తీవ్రంగా ప్రతిఘటించింది. మతపరమైన విభాగం వద్దని, తాము బెంగాలీలమని చాటుకున్నవారు, అదే స్ఫూర్తిని పాకిస్థాన్‌లోనూ వ్యక్తం చేశారు. మత పక్షపాతాన్ని కాదని భాషాజాతీయవాదాన్ని ఆశ్రయించారు. ఇప్పటికీ అక్కడి ఉద్వేగాలు అంత లౌకికతత్వంతో లేవు. 


పాకిస్థాన్ అనేక రకాలుగా బలహీనపడింది. ఆనాడు, పాక్ విభజన జరిపినందుకు భారత్‌ను విమర్శించినవారూ ఉన్నారు. పాక్‌ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమే అన్నారు. సాంకేతికంగా చూస్తే అందులోనూ వాస్తవం ఉన్నది. కానీ, అప్పటి మానవ సంక్షోభం సామాన్యమైనది కాదు, పాకిస్థాన్ తన ప్రజల మీదనే జరిపిన హింసా చిన్నది కాదు. మరి భారతదేశం అటువంటి అణచివేత ఎక్కడా అమలుచేయడం లేదా, అప్పుడు మూడో పక్షం జోక్యం చేసుకోవచ్చా? అని అడిగేవారుంటారు. జోక్యం చేసుకోవాలని ఆశపడేవారికి నైతికత లేకపోవడం సమస్య. ఒక్కోసారి బలమున్నవారిదే న్యాయంగా మారుతుంది. నైతికతా, బలమూ ఒకవైపే చేరినప్పుడు ఇక ఎదురుండదు. బంగ్లా యుద్ధం సందర్భంగా భారత్‌కు నైతిక బలమూ, భౌతిక బలమూ రెండూ సమకూరాయి. అప్పటి నాయకత్వం సమకూర్చుకున్నది.. అప్పటి మహాపరిణామాల మధ్య, అనేక శక్తుల మోహరింపుల నడుమ, ప్రతిపక్ష సత్యాగ్రహాలు లాంఛనమే అయి ఉంటాయి. 

కె. శ్రీనివాస్

ప్రత్యేకం మరిన్ని...