ఇవాంకా ఫెర్‌వెల్ సందేశం.. బైడెన్‌కు బెస్ట్ విషెస్

ABN , First Publish Date - 2021-01-20T15:25:31+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ, అడ్వైజర్ ఇవాంకా ట్రంప్ ట్విటర్ ద్వారా ఫెర్‌వెల్ సందేశం ఇచ్చారు.

ఇవాంకా ఫెర్‌వెల్ సందేశం.. బైడెన్‌కు బెస్ట్ విషెస్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ, అడ్వైజర్ ఇవాంకా ట్రంప్ ట్విటర్ ద్వారా ఫెర్‌వెల్ సందేశం ఇచ్చారు. అమెరికన్లు అందరూ అధ్యక్షుడిగా బైడెన్ విజయవంతం కావాలని ప్రార్థించాలని ఆమె పేర్కొన్నారు. ఇవాంక తండ్రి ట్రంప్ కూడా తన వీడ్కోలు సందేశంలో ఇదే కోరువడం విశేషం. అలాగే తొలిసారి ట్రంప్ నోట బైడెన్ పట్ల సానుకూల వ్యాఖ్యలు విపించాయి. ఇవాంకా తన ఫెర్‌వెల్ సందేశాన్ని లేఖ రూపంలో అమెరికన్లతో పంచుకున్నారు.


"కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్న జో బైడెన్, కమల హ్యారిస్, వారి బృందానికి నా శుభాకాంక్షలు. దేవుడు వారికి ధైర్యాన్ని, మంచి పరిపాలన దక్షతను ఇవ్వాలి" అని ఇవాంక ట్వీట్ చేశారు. అలాగే అధ్యక్షుడు ట్రంప్‌కు నాలుగేళ్ల పాటు అడ్వైజర్‌గా పని చేయడం నా జీవితకాల గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. 'నేను అమెరిన్ ఫ్యామిలీల కోసం పోరాడటానికి వాషింగ్టన్ వచ్చాను. బహుశా నేను అది సాధించానని అనుకుంటున్నాను. గడిచిన నాలుగేళ్ల కాలంలో ప్రతి అమెరికన్ స్టేట్‌కు తిరిగాను. పదుల సంఖ్యలో దేశాలను సందర్శించాను. అమెరిన్ ప్రజల ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరిచిపోలేను' అంటూ ఇవాంకా ట్విటర్ వేదికగా ఓ లేఖను పోస్ట్ చేశారు. 


అంతకుముందు అధ్యక్షుడు ట్రంప్ కూడా వైట్‌హౌస్‌ను వీడుతూ ఫెర్‌వెల్ సందేశంలో బైడెన్‌కు అనుకూల వ్యాఖ్యలు చేశారు. అమెరికన్లందరూ కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వానికి సహకరించాలన్నారు. బైడెన్ పాలన విజయవంతం కావాలని ప్రార్థించాలన్నారు. కాగా, బైడెన్ గెలిచినందుకు చివర వరకు కూడా ట్రంప్ వ్యక్తిగతంగా అభినందించలేదు. ఓవల్ ఆఫీసులో టీ కోసం కూడా ఆహ్వానించకపోవడం గమనార్హం. అటు ట్రంప్ సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కూడా మంగళవారమే ఫెర్‌వెల్ సందేశం ఇచ్చిన విషయం తెలిసిందే. హింస ద్వారా ఏదీ సాధించలేము, అమెరికన్లు కలిసికట్టుగా ఉండాలని ఆమె కోరారు.           



Updated Date - 2021-01-20T15:25:31+05:30 IST