Abn logo
Jun 10 2021 @ 04:43AM

జడేజాకి ఇంగ్లీషు రాదు!

  • మరో వివాదంలో మంజ్రేకర్‌

న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ మరో వివాదంలో ఇరుక్కున్నాడు. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు ఇంగ్లీషు రాదన్న మంజ్రేకర్‌ విమర్శ వివాదానికి కారణమైంది. ఈమేరకు మంజ్రేకర్‌తో తాను జరిపిన ట్విటర్‌ సంభాషణకు సంబంధించి స్ర్కీన్‌షాట్లను సూర్యనారాయణ్‌ అనే నెటిజన్‌ బుధవారం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. జడేజాతో ఒకప్పటి తన వివాదానికి సంబంధించిన అంశంలో తాను ఏమి అన్నానో జడేజాకు అర్ధంకాలేదని ఆ సంభాషణలో మంజ్రేకర్‌ పేర్కొన్నాడు. ‘ఈ పరిస్థితి విచారకరం. ఇలాంటి ఆటగాడిని నీవు ఆరాధిస్తూ పైగా నన్ను కూడా నీ బాటలో నడవాలని కోరతావా. కానీ నేను ఫ్యాన్‌ను కాదు. విశ్లేషకుడిని. జడేజాకు ఇంగ్లీష్‌ రాదు. అందువల్లే ‘బిట్స్‌ అండ్‌ పీసెస్‌’ అంటే ఏమిటో అతడు అర్థం చేసుకోలేకపోయాడు. అంతేకాదు ‘వెర్బల్‌ డయేరియా’ అనే పదాన్ని కూడా అతనికి ఎవరో చెప్పివుంటారు’ అని మంజ్రేకర్‌ అన్నాడు. 2019 వన్డే వరల్డ్‌ కప్‌ సందర్భంగా ‘అనామక క్రికెటర్‌’ అని జడేజానుద్దేశించి మంజ్రేకర్‌ వ్యాఖ్యానించాడు. మంజ్రేకర్‌కు ‘వెర్బల్‌ డయేరియా’ (నోటి విరోచనాలు) అవుతున్నట్టుందని జడేజా అప్పట్లోనే ధాటిగా కౌంటర్‌ ఇచ్చాడు. 


Advertisement