జగన్ ఢిల్లీ పర్యటన.. మళ్లీ రహస్యమేనా..?

ABN , First Publish Date - 2021-06-10T22:51:22+05:30 IST

కేంద్రమంత్రులు జవదేకర్, షెకావత్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాత్రి 7 గంటలకు పీయూష్ గోయల్‌తో భేటీ అవుతారు.

జగన్ ఢిల్లీ పర్యటన.. మళ్లీ రహస్యమేనా..?

ఢిల్లీ: కేంద్రమంత్రులు జవదేకర్, షెకావత్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాత్రి 7 గంటలకు పీయూష్ గోయల్‌తో భేటీ అవుతారు. రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖామంత్రి అమిత్‌షాతో భేటీ అవుతారు. ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీఐడీ కేసు, పోలీసు కస్టడీలో దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అవుతోంది. తనపై ఏపీ పోలీసులు అక్రమంగా రాజద్రోహం కేసు పెట్టారని, కక్షతోనే దాడి చేశారని కేంద్రమంత్రుల నుంచి గవర్నర్లు, సీఎంలకు, ఎంపీలకు లేఖలు రాశారు. రఘురామ వ్యవహారంలో అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండడంతో నష్ట నివారణ కోసం జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులోభాగంగానే ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. అయితే సోమవారమే కలవాలని అనుకున్నా.. అమిత్‌షా అపాయింట్‌మెంట్ దొరకలేదు. వైసీపీ ఎంపీలు ఢిల్లీకి వచ్చి అందరినీ కలిసి అభ్యర్థించడంతో ఎట్టకేలకు జగన్‌కు అపాయింట్‌మెంట్‌లు ఇచ్చారు. 


మరోవైపు రఘురామ కేసుతో పాటు సీబీఐ బెయిల్ రద్దు అంశం కూడా జగన్‌ను వెంటాడుతోంది. వరుస పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జగన్ అన్నింటిపై అమిత్‌షాకు వివరణ ఇచ్చే అవకాశం ఉంది. అమిత్‌షా కంటే ముందు కేంద్రమంత్రులను కలుస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను మాట్లాడుతారని, ప్రతిసారి వైసీపీ నేతలు చెబుతుంటారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి వినతిపత్రాలిస్తున్నామని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ.. ప్రతి పర్యటనకు రహస్య ఎజెండా ఉంటుందని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. సీఎం పర్యటనపై అనేక పుకార్లు వస్తున్నాయి. చాలా సందర్భాల్లో జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో చర్చించిన అంశాలకు సంబంధించి.. ఏం చర్చించారనే విషయాలను బయటకు చెప్పలేదు. అయితే ఈసారి కొవిడ్‌‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారం.. వ్యాక్సిన్లు వీటన్నింటితో పాటు పోలవరానికి రావాల్సిన నిధులపై సీఎం చర్చిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2021-06-10T22:51:22+05:30 IST