జగన్, విద్వేషం మాని విజ్ఞత చూపు!

ABN , First Publish Date - 2020-06-19T05:44:03+05:30 IST

అవినీతి బురదలో పొర్లిన వారికి శుభ్రంగా ఉన్నవాడు నచ్చడట. ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే. అధికారంలోకి వచ్చింది మొదలు జగన్ అండ్ కో దండుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు...

జగన్, విద్వేషం మాని విజ్ఞత చూపు!

ఏడాది ఏలుబడిలో ప్రజలకు జగన్ చేసిన మేలు ఏమిటి? ఏమీలేక జనం దృష్టి మళ్లించేందుకు వికృత రాజకీయాలు చేస్తున్నారు! చేతకాని పరిపాలనతో రాష్ట్రాన్ని అధోగతి పట్టించారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకొంటున్న నిర్ణయాలు, వ్యవహరిస్తున్న తీరు నవ్యాంధ్రప్రదేశ్‌కు మేలు చేస్తాయా? కీడు చేస్తాయా? ప్రజలు, మేధావులు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైనది.


అవినీతి బురదలో పొర్లిన వారికి శుభ్రంగా ఉన్నవాడు నచ్చడట. ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే. అధికారంలోకి వచ్చింది మొదలు జగన్ అండ్ కో దండుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మేము అధికారంలో ఉన్నాం, మేము ఏదైనా చేస్తాం, ఎంతైనా దోచుకుంటాం, మీరెవరు ప్రశ్నించడానికి అన్న విధంగా వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు. మా అవినీతిని ప్రశ్నిస్తే చంద్రబాబును కూడా అరెస్టు చేస్తాం అంటూ బెదిరిస్తున్నారు. ‘బయట అవినీతిపరుల ముఖం చూడటానికి కూడా సిగ్గుపడాల్సి వస్తుందని, అయితే చట్టసభల్లో వారి భుజాలు రాసుకుంటూ తిరగాల్సి వస్తుందని’ కొన్నేళ్ళ క్రితం దివంగత ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ వాపోయారు. నేడు ఆ కోవకు చెందిన వారు మన రాష్ట్రాన్ని పాలిస్తూ అవినీతిపై నీతులు చెబుతున్నారు. జగన్ జీవితం పూర్తిగా అబద్ధాలమయం. అధికారంలోకి రావడం కొరకు అబద్ధాలాడారు. అధికారంలోకి వచ్చీ అబద్ధాలు ఆడుతున్నారు. ఇలా అబద్ధాలు చెప్పినవారు ప్రపంచ రాజకీయాల్లో బహుశా ఎవరూ ఉండరు. ధర్మం, అధర్మం మధ్య పోటీ జరిగితే మొదటి దశలో అధర్మానిదే పై చెయ్యి అవుతుంది. జగన్ విషయంలోనూ ఇదే జరిగింది. కానీ అంతిమ విజయం ధర్మానిదే అని చరిత్ర ఘోషిస్తున్నది. జగన్ విఫల పాలకుడని ప్రజా వాణి ఢంకా బజాయిస్తోంది. 


ఏడాది ఏలుబడిలో ప్రజలకు జగన్ చేసిన మేలు ఏమిటి? ఏమీలేక జనం దృష్టి మళ్లించేందుకు వికృత రాజకీయాలు చేస్తున్నారు! చేతకాని పరిపాలనతో రాష్ట్రాన్ని అధోగతి పట్టించారు. ఈ పాపం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే జగన్ ప్రభుత్వం ఎసిబిని ప్రతిపక్షం పైకి ఉసిగొల్పింది. పాలనలో ఘోరంగా విఫలమైన జగన్ సర్కార్ నైతిక స్థైర్యాన్ని కోల్పోయింది. ప్రతిపక్షాన్ని ఏ విధంగానైనా దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందేందుకే గత ప్రభుత్వం హయాంలో అవినీతి జరిగిందంటూ ప్రతిపక్ష నేతల అక్రమ అరెస్టులకు పాల్పడుతోంది. పాలనలో ప్రతిష్ఠ మసకబారి దిక్కుతోచక ప్రతిపక్షాన్ని అపఖ్యాతి పాలు చెయ్యడానికి ప్రభుత్వం ఎసిబిని ప్రయోగించినట్లు సామాన్యుడికి సైతం అర్థమయింది. నిత్యం కోర్టులతో చీవాట్లు తినడం, ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని సొంతపార్టీ వాళ్ళు, ప్రతిపక్షం ప్రశ్నిస్తుండడంతో సమాధానం చెప్పలేక, పాలనలో డిఫెన్స్‌లో పడిన జగన్ మహాశయుడు అక్రమ అరెస్టులతో అఫెన్స్ ఆట ఆరంభించారు.


ప్రతిపక్షంపై ఎంత ప్రతీకారంతో రగిలిపోతున్నారో అచ్చెన్నాయుడు అరెస్టు చూస్తే తెలుస్తుంది. అరెస్టుకి సహకరిస్తానన్నా వినకుండా టెర్రరిస్టు ఇంటిపై దాడి చేసినట్లు నోటీసులు ఇవ్వకుండా కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి వందలాది పోలీసులు గోడలు దూకి ఆయన్ని అరెస్టు చేశారు.ఆపరేషన్ అయినది అని రిపోర్టులు చూపినా, కనీసం మందులు కూడా వెంట తెచ్చుకొనే అవకాశం లేకుండా, 25 గంటలు రోడ్లపై తిప్పి మానవత్వం లేకుండా వ్యవహరించి కక్ష తీర్చుకున్నారు. రాక్షసులు అయినా కనికరం చూపే వారేమో కదా?! ఇంత జరిగినాక ఆయనకి మంచి వైద్యం అందించమని అధికారులకు చెప్పే నైతికత జగన్‌కు ఎక్కడిది? ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ళులో మంత్రి పాత్ర వుండదని పర్చేజ్ మ్యాన్యువల్ స్పష్టం చేసింది. విజిలెన్స్ రిపోర్టు బాధ్యుల జాబితాలో అచ్చెన్నాయుడు పేరు లేదు. విజిలెన్స్ నివేదికలో ప్రస్తావించిన జీఓ నెం 51 ప్రకారం కూడా మంత్రికి సంబంధం లేదు. అందువల్లనే తెలంగాణలో ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ళలో జరిగిన అవకతవకలపై మంత్రిని బాధ్యుడిని చేయలేదు. అచ్చెన్నాయుడు వైకాపాలో చేరలేదన్న కక్షతో ఏసీబీ చేత ఫ్యాబ్రికేటెడ్ రిపోర్టు చేయించి అక్రమ కేసు బనాయించి అరెస్టు చేయించారు. ఈఎస్‌ఐ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే సంస్థ. దాని లావాదేవీల్లో మంత్రుల పాత్ర వుండదు. రాష్ట్ర ప్రభుత్వం మోనిటరింగ్ మా త్రమే చేస్తుంది. ఈఎస్‌ఐ రీజినల్ డైరెక్టర్స్, మెడికల్ సూపరిటెండెంట్స్, ఈఎస్‌ఐ సర్వీసెస్ డైరెక్టర్స్ మాత్రమేనని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మంత్రిని బాధ్యుడిని ఎలా చేస్తారు? ఆయనని అరెస్టు చెయ్యడం కక్ష సాధింపు కాదా? అసెంబ్లీలో కానీ, బయట కానీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంతో తట్టుకో లేకపోతున్న జగన్ అచ్చెన్నాయుడుని పరుష పదజాలంతో దూషించడాన్ని ప్రజలందరూ చూశారు. అధికార పార్టీ నాయకులు ఆయనపై చాలా వికృత భాష వాడారు. 


నిజంగా మీకు అవినీతి నిర్మూలనపై చిత్తశుద్ధి వుంటే ఏడాది పాలనలో జరిగిన ఇసుక దోపిడీ, ఇళ్ల స్థలాల కుంభకోణం, మద్యం మాఫియాపై విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు? రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన లేదు. క్లిప్టోక్రసీ (రూల్ బై కరప్షన్)... ప్రజలను వేధించి సహజవనరులను దోచుకొనే అవినీతి పరుల రాజ్యం ఇది. ఇష్టానుసారం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇష్టానుసారం సొంతమీడియాకు పెద్దఎత్తున ప్రకటనలు ఇచ్చుకొంటూ ప్రజాధనం దోపిడి చేస్తున్నారు. ప్రభుత్వ పనులకు జగన్ కంపెనీ సిమెంట్ మాత్రమే కొనాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రూ.1300 కోట్లు విలువ చేసే సున్నపు రాయి గనులను 613 హెక్టార్లు 50 సంవత్సరాలు పాటు జగన్ కుటుంబానికి కేటాయించుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఆ కంపెనీకి నీటిని కేటాయించుకున్నారు.


ఇళ్ల స్థలాల పేరుతో రూ.2000 కోట్ల కుంభకోణం జరిగింది. ఇళ్ల స్థలాల్లో అవినీతి జరుగుతున్న మాట వాస్తవమేనని సొంత పార్టీ ఎంపీనే అంగీకరించారు. ఇళ్ల స్థలాల పేరుతో శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు నానా రకాల కుతంత్రాలు సాగించారు. ముప్పై మూడు కబ్జాలు, అరవై ఆరు లూటీలు గా సాగుతుంది జగన్ పాలన. నవరత్నాల పేరుతో మీగడ తానూ తన పార్టీ వాళ్ళు తింటూ ప్రజలకు నీళ్ళ మజ్జిగ పోసి వారిని మాయ చేస్తున్నారు. ఈ వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలి. లేకపోతే మీరే మరింతగా నష్టపోతారు. 65సార్లు కోర్టులతో చివాట్లు తిని రాష్ట్రం పరువు తీశారు. ప్రజలపై రూ.50 వేల కోట్ల పన్నులు, ధరల భారాలు వేసి వారి నడ్డి విరిచారు. రూ.87 వేల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించి అప్పులాంధ్రప్రదేశ్‌గా మార్చారు. తెలుగు దేశం పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారన్న అక్కసుతో ఆధారాలు లేకపోయినా మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని అరెస్టు చేసి వేధిస్తున్నారు. మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు పార్టీ మారలేదని ఆయన గ్రానైట్ కంపెనీపై జరిమానా విధించారు. ఆయన వైకాపాలో చేరగానే జరిమానా రద్దు చేశారు! ఇలా రాష్ట్రంలో ఎటువంటి వికృత రాజకీయం చేస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలి. ఫాసిస్టులు, నియంతలు పాలకులు అయితే పరిపాలన ఇలానే వుంటుంది. ఈ ఫాసిస్టు పాలనలో జరుగుతున్న అవినీతిని, అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోని పక్షంలో నష్టపోయేది నవ్యాంధ్ర సమాజమే. 


అవినీతి పునాదుల పైనే పార్టీ నిర్మాణం చేసిన నాయకుడు ఈ రోజు నేనొక మహాత్మాగాంధీని, సత్యహరిశ్చంద్రుడను అన్న విధంగా మాట్లాడుతున్నారు! దేశ రాజకీయ చరిత్రలో కనీ, వినీ ఎరుగని రీతిలో క్విడ్ ప్రో కో విధానాన్ని అమలు చేసి తెల్లవారే సరికి మాయా వ్యాపారం సామ్రాజ్యం సృష్టించిన ఘనుడు జగన్. స్వతంత్ర భారతా వనిలో ఏ రాజకీయ నాయకుడు పాల్పడని విధంగా అవినీతికి పాల్పడి 12 చార్జిషీట్లతో విచారణ ఎదుర్కొంటూ తాను ఏ తప్పు చేయలేదనే చెప్పే తెంపరితనానికి ఆయన పాల్పడుతున్నాడు. ఈ తెంపరితనం ఒక మానసిక వ్యాధే, సందేహం లేదు. అక్రమంగా పోగేసిన సొమ్మును రాచ మార్గంలో పెట్టుబడులుగా మార్చే సూత్రాన్ని జగన్ మాత్రమే కనుగొన్నారు. అందుకే దశాబ్దాలుగా వ్యాపారరంగంలో వున్న వారెవ్వరూ సంపాదించలేనంత సంపదను మూడేళ్లలో మూట కట్టుకున్నారంటే ఆయన ఎంచుకొన్న మార్గం అది.


ఇన్ని కోణాలు వున్న ఇలాంటి అవినీతి కేసును నా సర్వీసులో చూడలేదని సీబీఐ డైరెక్టర్ ఒకరు జగన్ కేసుల విషయంలో వ్యాఖ్యానించారు. అంతేకాదు ఇంత తక్కువ సమయంలో ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారని దేశ అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తులు ప్రశ్నించిన సందర్భం కూడా లేదు. ఇలాంటి మీరు నీతిమంతులా? పవిత్రులా? అందరూ అవినీతి పరులా? 2004 ఎన్నికల ముందు ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో వున్నామని మొరపెట్టుకున్న మీరు బెంగుళూరు, హైదారాబాద్‌లలో రాజప్రసాదాలు ఎలా నిర్మించారు? ఇన్ని వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యం స్థాపించడం ఎలా సాధ్యమైందో ప్రజలకు చెప్పగలరా? ఆ విజయ రహస్యమేమిటి? ఆనాడు సోనియా గాంధీ దయా దాక్షిణ్యాలతో కేవలం కండిషన్ బెయిల్‌పై బయట తిరుగుతున్న మీరు ధర్మ విజేతగా చెప్పుకోవడానికి ఎబ్బెట్టుగా లేదా? పక్షపాతం, పగ, ప్రతీకారంతో పాలించే ఏ పాలకుడు కూడా పాలకుడు కాడు అని గ్రహించండి. నిరంకుశంగా వ్యవహరించిన నియంతలెవరూ విజేతలుగా నిలవలేరు .ఇప్పటికైనా విద్వేషం చాలించి విజ్ఞత పాటిస్తే మీకే మంచిది. 


చట్టం, న్యాయం, ధర్మం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగంతో నాకు సంబంధం లేదన్న విధంగా వ్యవహరిస్తే ఎలా? నేను చేసిందే చట్టం, నేను చెప్పిందే వేదం, అన్న విధంగా ముఖ్యమంత్రి జగన్ తీసుకొంటున్న నిర్ణయాలు, వ్యవహరిస్తున్న తీరు నవ్యాంధ్ర ప్రదేశ్‌కు మేలు చేస్తాయా? కీడు చేస్తాయా? ప్రజలు, మేధావులు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైనది.

దేవినేని ఉమా మహేశ్వరరావు

మాజీ జల వనరుల మంత్రి

Updated Date - 2020-06-19T05:44:03+05:30 IST