ఊరు పోతోంది!

ABN , First Publish Date - 2020-07-02T10:33:29+05:30 IST

ఆ గ్రామం పేరు జగన్నాథపురం. సత్తుపల్లి మండలంలోని ఈ గ్రామంలో మొత్తం 163 గిరిజన కుటుంబాలున్నాయి

ఊరు పోతోంది!

ఓసీతో కనుమరుగవుతున్న జగన్నాథపురం

సర్వం కోల్పోతున్న గిరిజన కుటుంబాలు

అంతంత మాత్రంగా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ

తమ త్యాగాన్ని అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన


సత్తుపల్లి, జూలై 1:  ఆ గ్రామం పేరు జగన్నాథపురం. సత్తుపల్లి మండలంలోని ఈ గ్రామంలో మొత్తం 163 గిరిజన కుటుంబాలున్నాయి. కిష్టారం ఓసీ  కారణంగా ఇప్పుడు వారంతా ఆ గ్రామాన్ని విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఇక్కడి గిరిజనుల వ్యవసాయ భూములకు, ఇళ్ల స్థలాలకు పరిహారం చెల్లించిన అధికారులు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. తమ భూములకు  ఎకరానికి రూ.16.5లక్షల పరిహారం మాత్రమే ఇచ్చిన అధికారులు.. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వటంలో కూడా అన్యాయం చేస్తున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో కుటుంబానికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ గతంలో రూ.11.64లక్షలు ఇస్తామని నమ్మబలికిన అధికారులు ప్రస్తుతం కేవలం రూ.7.61లక్షలు మాత్రమే ఇస్తామంటూ నోటీసులు ఇచ్చేందుకు వస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. కలెక్టర్‌కు తమ గోడును స్వయంగా విన్నవించేందుకు ప్రయత్నించినా స్థానిక అధికారులు అడ్డుపడుతున్నారని, తమను ఎవరూ పట్టించుకోవటం లేదని లబోదిబోమంటున్నారు. 


జగన్నాథపురంలో ఇలా..

కిష్టారం ఓపెన్‌ కాస్టు బొగ్గు గని కోసం అధికారులు వ్యవసాయ భూములు, అటవీ శాఖ భూములను స్వాధీనం చేసుకొని బొగ్గు గని తవ్వకాలను కూడా ప్రారంభించారు. కిష్టారం ఓపెన్‌ కాస్టులో జగన్నాథపురం మొత్తం కలిసిపోతుండగా.. ఈ గ్రామంలోని మొత్తం గిరిజన కుటుంబాలను పక్కనే ఉన్న చెరుకుపల్లిలో పునరావాసం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలోని మొత్తం 163 కుటుంబాల వారు గ్రామం వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గిరిజనులందరికీ వ్యవసాయ భూములకు, ఇళ్ల స్థలాలకు పరిహారం ఇచ్చారు. ఇక ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంది.


అయిదు గుంటల స్థలం ఇవ్వాలి..

గ్రామాన్ని వదిలి వెళుతున్న తమకు పునరావాస ప్రాంతంలో ఒక్కో కుటుంబానికి అయిదు గుంటల ఇళ్ల స్థలం ఇవ్వాలని గిరిజనులు కోరుతున్నారు. కానీ వీరి డిమాండ్‌ను పట్టించుకునే వారే లేకుండా పోయారు. నిబంధనల పేరుతో వారి డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవటం లేదు. గ్రామాన్ని ఖాళీ చేసేనాటికి 18ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని వర్తింపజేయాలని గిరిజనులు కోరుతున్నారు. కానీ గతేడాది మార్చి నాటికి కటాఫ్‌ డేట్‌ పెట్టి అప్పటి వరకూ  18ఏళ్లు నిండిన వారికే ప్యాకేజీ ఇస్తామని చెబుతున్నారని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్యాకేజీ విషయంలో కూడా అధికారులు ఒక్కో సారి ఒక్కో రకంగా చెబుతూ నోటీసులు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ రూ.11.64లక్షలు ఇస్తామని గ్రామసభల్లో చెప్పిన అధికారులు ప్రస్తుతం కేవలం రూ.7.61లక్షలు మాత్రమే ఇస్తామంటూ నోటీసులు ఇస్తున్నారని తెలిపారు. ఇది తమకు ఆమోదయోగ్యం కాదని చెపుతున్నారు.


నోటీసుల తిరస్కరణ..

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ రూ.7.61లక్షలు ఇస్తామంటూ రెవెన్యూ అధికారులు జారీ చేసిన నోటీసులు తీసుకునేందుకు గిరిజనులు తిరస్కరించారు. తమకు న్యాయమైన ప్యాకేజీ ఇచ్చే వరకూ తాము గ్రామం ఖాళీ చేయబోమని స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయ భూములకు సంబంధించి 39 సర్వే నెంబర్‌లో 18ఎకరాలు, ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు 24ఎకరాలకు పరిహారం ఇవ్వాల్సి ఉందని తెలిపారు. భూమి పరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. తమకు న్యాయం జరగకపోతే అవసరమైతే ఆందోళనకు, న్యాయపోరాటానికి  సిద్ధమని ప్రకటిస్తున్నారు. గతంలో తమకు అన్ని రకాలుగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన అధికారులు ప్రస్తుతం తమను పట్టించుకోకుండా సింగరేణి బొగ్గు తవ్వకాలు చేపట్టారని, తామే గ్రామం స్వయంగా వదిలి వెళ్ళేలా గ్రామం చుట్టూ మట్ది దిబ్బలు పోస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులను నిర్వాసిత గిరిజనులు కోరుతున్నారు. 

Updated Date - 2020-07-02T10:33:29+05:30 IST