సచివాలయానికి 400 కోట్లు.. కరోనా కట్టడికి 100 కోట్లా?

ABN , First Publish Date - 2020-08-09T08:16:31+05:30 IST

కరోనా రోగిని బతికించేందుకు కాదు.. కనీసం చనిపోతే మృతదేహాన్ని ప్యాకింగ్‌ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకూ ప్రభుత్వం నుంచి గాంధీ ఆస్పత్రికి డబ్బులు అందడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు...

సచివాలయానికి 400 కోట్లు.. కరోనా కట్టడికి 100 కోట్లా?

  • రోగులను బతికించడం కాదు..
  • చనిపోతే ప్యాకింగ్‌కూ డబ్బుల్లేవ్‌!
  • మృతుల కుటుంబం నుంచి రూ.30 వేలు తీసుకుంటున్నారు
  • ప్రభుత్వంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజం

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): కరోనా రోగిని బతికించేందుకు కాదు.. కనీసం చనిపోతే మృతదేహాన్ని ప్యాకింగ్‌ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకూ ప్రభుత్వం నుంచి గాంధీ ఆస్పత్రికి డబ్బులు అందడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. కరోనా రోగి మృతదేహాన్ని ప్యాక్‌ చేసేందుకు రూ.30 వేల వరకు ఖర్చు వస్తుందని, విధి లేని పరిస్థితుల్లో గాంధీ ఆస్పత్రి సిబ్బంది ఆ మొత్తాన్ని మృతుని కుటుంబం నుంచే తీసుకోవాల్సి వస్తోందని చెప్పారు. కుటుంబీకుల దగ్గరా డబ్బు లేకుంటే శవాన్ని ఎక్కడో కాల్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంతటి దుర్మార్గమైన, మానవత్వం లేని పాలన నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న డిమాండ్‌పై ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదన్నారు. సచివాలయ భవన నిర్మాణానికి రూ.400 కోట్లు కేటాయిస్తూ.. కరోనా సహాయక చర్యలకు మాత్రం కేవలం వంద కోట్లు ఇస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు.


సీఎం కేసీఆర్‌ సచివాలయ నిర్మాణంపై చూపిస్తున్న శ్రద్ధ.. ప్రభుత్వాస్పత్రులను మెరుగుపర్చడంపై చూపిస్తే బాగుంటుందని హితవు పలికారు. ఇప్పటికైనా మానవత్వంతో తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడాలని, లేకపోతే సంగారెడ్డి ప్రజల పక్షాన క్షేత్రస్థాయి కార్యాచరణ చేపడతానని చెప్పారు. చనిపోయేవాడు శాపం పెడితే దాన్ని తట్టుకునే శక్తి ముఖ్యమంత్రికి, అధికారులకు ఉండబోదని అన్నారు. తన నియోజకవర్గానికి చెందిన కరోనా రోగుల్లో శ్వాస ఆడకపోతే గాంధీకి పంపుతున్న వారికి ఏం చేయాలనే విషయమై ఆలోచన చేస్తున్నానన్నారు.


కరోనాతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై కేబినెట్‌లో చర్చించలేదంటే ఇది మానవత్వం లేని ప్రభుత్వమేనన్నారు. సీఎం ఇంతవరకు గాంధీ ఆస్పత్రినే సందర్శించలేదని గుర్తుచేశారు. ‘‘తనకు కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలో చేరతానని మంత్రి తలసాని చెబుతున్నారు. ఆయన చేరితే ఉన్న 50 మంది డాక్టర్లు అక్కడే ఉంటారు. సామాన్య రోగులకు ఆ పరిస్థితి ఉంటుందా?’’ అని ప్రశ్నించారు. మంత్రులు సీఎంకు భజన కార్యక్రమాలను బంద్‌ చేయాలన్నారు. జిల్లా ఆస్పత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ పెట్టాలని సూచించారు. ప్రభుత్వాస్పత్రులపై విశ్వాసం కోల్పోవడం వల్లనే ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారని, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన స్ర్కిప్టును చదవడం తప్ప ఆయన దగ్గర ఎలాంటి అధికారం లేదని చెప్పారు.


Updated Date - 2020-08-09T08:16:31+05:30 IST