Abn logo
Jun 22 2021 @ 14:37PM

ఒకే ఒక్క అబద్ధాన్ని నిజమని నమ్మిందా యువతి.. అంతే రూ.2.5 కోట్లను ఇలా పోగొట్టుకుంది..!

వందలు వేల రూపాయలు కాదు.. ఏకంగా రెండున్నర కోట్ల రూపాయల సైబర్ క్రైమ్. ఒకే ఒక్క అబద్ధాన్ని నిజమని ఆ మహిళ నమ్మడంతో జరిగిన ఘోరమిది. ఓ వైపు అవతలి వైపు వ్యక్తిపై జాలి. మరో వైపు కోట్ల రూపాయలు వస్తున్నాయన్న ఆశ.. ఆ మహిలను మాయలో పడేశాయి. చివరకు కోట్ల రూపాయలను కోల్పోయేలా చేశాయి. ఆమె మోసపోయానని తెలుసుకుని కేసు పెట్టిన నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు ఆ కిలాడీని పట్టేశారు. సైబర్ క్రైమ్ సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ సిటీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 


‘నా భర్త ఈ మధ్యనే చనిపోయారు. ప్రస్తుతం నేను ఒంటరిగా జీవిస్తున్నాను. నాకు నా అనుకున్న వాళ్లు ఎవరూ లేరు. బంధువులు, స్నేహితులు కూడా పెద్దగా లేరు. నాకు కేన్సర్ వచ్చిందని డాక్టర్లు నిన్ననే చెప్పారు. ఆరు నెలలకు మించి బతకనట. నా బాధను చెప్పుకునేందుకు కూడా ఎవరూ లేక దిక్కూమొక్కూ లేని దానిలా ఉన్నాను. నువ్వొక్కదానివే నాకు మంచిగా అనిపించావు. నా బాధను, నా కష్టాన్ని నీతో పంచుకుంటే నాకు కాస్త ఉపశమనం లభిస్తోంది. నాకు 3.9 మిలియన్ డాలర్ల(దాదాపు 29 కోట్ల రూపాయలు) ఆస్తి ఉంది. నా తదనంతరం నీకు ఇది దక్కేలా చేస్తా. నేను చనిపోయే లోపు నా ఆస్తిని నీకు ఇచ్చేస్తా. నువ్వు నాకు దేవుడిచ్చిన చెల్లివి’.. ఇదీ రాజస్థాన్ రాష్ట్రంలోని సామై మాధోపూర్ నగరానికి చెందిన ఓ యువతికి రెబెకా క్రిష్టినా అనే విదేశీ మహిళ ఫేస్‌బుక్ మెసేంజర్‌లో చెప్పిన మాటలు. ఇది నిజమేనని ఆ యువతి నమ్మింది. కేన్సర్ వచ్చిందా..? అయ్యో పాపం అంటూ ఓదార్చింది. ఆమె ఆస్తిని తీసుకునేందుకు అంగీకరించింది. 


కొద్ది రోజుల తర్వాత ఆస్తిని నీ పేరు మీదకు మార్చేశాననీ, డబ్బు, నగలను కూడా పంపిస్తున్నానని ఆ యువతికి రెబెకా చెప్పింది. తన లాయర్, ఆదాయ పన్ను అధికారులు మీకు ఫోన్ చేస్తారనీ, వాళ్లు అడిగిన వివరాలు ఇస్తే ఆస్తిని భారత్‌లోని మీ కరెన్సీ రూపంలోకి మార్చి దానికి మిమ్మల్ని యజమానిగా చేస్తారని చెప్పింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఓ ఇద్దరు వ్యక్తుల నుంచి ఆ యువతికి ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ వచ్చాయి. ఆస్తిని మీ పేరు మీదకు మార్చాలంటే కొన్ని పత్రాలు కావాలంటూ అడిగి తీసుకున్నారు. ఆ తర్వాత ప్రోపర్టీ ట్యాక్స్ అనీ, రిజిస్ట్రేషన్ ట్యాక్స్, ఫారిన్ ఎక్ఛేంజ్ ట్యాక్స్.. అంటూ వివిధ రూపాల్లో ఆ యువతి నుంచి ఏకంగా రూ.2.5 కోట్ల రూపాయలు 55 బ్యాంక్ అకౌంట్లలోకి మళ్లించారు. రాను రానూ వారి మాటలు, వారి ప్రవర్తనపై ఆ యువతికి అనుమానం రావడంతో తాను మోసపోయానని ఆ యువతి గ్రహించింది. ఈ ఘటనపై జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన 2017వ సంవత్సరంలో జరిగింది. అప్పటి నుంచి విచారణ చేస్తున్నప్పటికీ కేసులో కొన్ని అంశాలు క్లిష్టంగా మారడంతో నిందితుడు ఎవరన్నది తేల్చేందుకు పోలీసులకు నాలుగేళ్లు పట్టింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరీకి చెందిన నీరజ్ సూరి ఈ సైబర్ క్రైమ్‌కు సూత్రధారి అనీ, అతడికి కొందరు నైజీరియన్లు సహకరించారని పోలీసులు తేల్చారు. ఎట్టకేలకు ఈ ఆదివారం అతడిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి డబ్బును రాబట్టి బాధితురాలికి అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. 

క్రైమ్ మరిన్ని...