ప్రపంచ మహాదాత!

ABN , First Publish Date - 2021-06-24T08:49:54+05:30 IST

గత శతాబ్దకాలంలో ప్రపంచంలో అత్యధికంగా విరాళాలిచ్చిన 50 మంది వ్యక్తుల జాబితా విడుదలైంది.

ప్రపంచ మహాదాత!

గత శతాబ్దంలో అత్యధికంగా విరాళాలిచ్చిన జంషెడ్‌జీ టాటా 

మొత్తం రూ.7.65 లక్షల కోట్ల దానం

టాప్‌-50లో అజీమ్‌ ప్రేమ్‌జీకి చోటు 

ఎడెల్‌గివ్‌-హురున్‌ రిపోర్టు వెల్లడి


ముంబై: గత శతాబ్దకాలంలో ప్రపంచంలో అత్యధికంగా విరాళాలిచ్చిన 50 మంది వ్యక్తుల జాబితా విడుదలైంది. ఎడెల్‌గివ్‌ ఫౌండేషన్‌- హురున్‌ సంయుక్తంగా రూపొందించిన ఈ జాబితాలో భారత పారిశ్రామిక పితామహుడు, టాటా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జంషెడ్‌జీ నుసీర్వాన్‌జీ టాటా అగ్రస్థానంలో నిలిచారు. జంషెడ్‌జీ టాటా ప్రధానంగా విద్య, వైద్యంతో పాటు తదితర రంగాలకు 10,240 కోట్ల డాలర్ల విరాళాలు ఇచ్చినట్లు లిస్ట్‌ వెల్లడించింది. ప్రస్తుత మారకం రేటు ప్రకారం ఈ విలువ సుమారు రూ.7.65 లక్షల కోట్లు. టాప్‌ టెన్‌లోని ఏకైక భారతీయుడు టాటానే. టాప్‌-50లో చోటు దక్కించుకున్న మరో భారతీయుడు అజీమ్‌ ప్రేమ్‌జీ. విప్రో వ్యవస్థాపకుడైన ప్రేమ్‌జీ.. 2,200 కోట్ల డాలర్ల విరాళాలతో 12వ స్థానంలో నిలిచారు. టాటా విరాళాలకు ప్రధాన ఆదాయ వనరు టాటా సన్స్‌. టాటా గ్రూప్‌ వ్యాపారాల ప్రమోటింగ్‌ కంపెనీయే టాటా సన్స్‌. మరిన్ని విషయాలు.. 


నవయుగ దాతృత్వవేత్తలు, గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌, మెలిండా 7,460 కోట్ల డాలర్ల విరాళాలతో ఈ లిస్ట్‌లో రెండో స్థానంలో నిలిచారు. 

హెన్రీ వెల్‌కమ్‌ (5,670 కోట్ల డాలర్లు), హోవార్డ్‌ హ్యూస్‌ (3,860 కోట్ల డాలర్లు), వారెన్‌ బఫెట్‌ (3,740 కోట్ల డాలర్లు) వరుసగా 3,4,5 స్థానాల్లో ఉన్నారు. 

జాబితాలో 38 మంది అమెరికన్లకు చోటు దక్కగా.. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నుంచి 5గురు, చైనా నుంచి ముగ్గురికి స్థానం లభించింది. భారత్‌ నుంచి ఇద్దరికి, పోర్చుగల్‌, స్విట్జర్లాండ్‌ నుంచి ఒక్కొక్కరు ఈ లిస్ట్‌లో ఉన్నారు. 

లిస్ట్‌లోని యాభై మందిలో ప్రస్తుతం జీవించి ఉన్నది 13 మందే. మిగతా 37 మంది ఇప్పటికే మరణించారు. 

గత శతాబ్ద కాలంలో జాబితాలోని యాభై మంది ఇచ్చిన మొత్తం విరాళాలు 83,200 కోట్ల డాలర్లు. అందులో ఫౌండేషన్ల ద్వారా విరాళాలు 50,300 కోట్ల డాలర్లు కాగా, నేరుగా చేసిన దానాలు 32,900 కోట్ల డాలర్లు. 

Updated Date - 2021-06-24T08:49:54+05:30 IST