నేడే జనసేన ఆవిర్భావ సభ

ABN , First Publish Date - 2022-03-14T07:55:30+05:30 IST

జనసేన ఆవిర్భావ సభ సోమవారం జరుగనుంది. భావి కార్యచరణఫై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఈ సందర్భంగా విస్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. తొమ్మిదేళ్ల కింద..

నేడే జనసేన ఆవిర్భావ సభ

  • భావి కార్యాచరణపై పవన్‌ విస్పష్ట ప్రకటన
  • గత అనుభవాల దృష్ట్యా.. ఈసారి పకడ్బందీ ఎన్నికల వ్యూహం
  • రెండేళ్ల ముందు నుంచే ఎత్తుగడలు
  • బీజేపీతో పొత్తుపైనా స్పష్టత ఇచ్చే చాన్సు
  • గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామ పరిధిలో మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం
  • జగన్‌ అహంకారం, సామాన్యుల ఆత్మగౌరవానికి మధ్య పోరాటం
  • ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధం: నాదెండ్ల మనోహర్‌


తాడేపల్లి టౌన్‌-అమరావతి/విజయవాడ/మార్చి 13 (ఆంధ్రజ్యోతి): జనసేన ఆవిర్భావ సభ సోమవారం జరుగనుంది. భావి కార్యచరణఫై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఈ సందర్భంగా విస్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. తొమ్మిదేళ్ల కింద ఆవిర్భవించిన ఆ పార్టీ.. 2014 ఎన్నికల్లో పోటీచేయకుండా టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించింది. 2019 ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పోటీ చేసినప్పటికీ కేవ లం ఒక్క స్థానంలో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఆ అనుభవాల దృష్ట్యా ఈసారి పకడ్బందీ వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. అది కూడా ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే వ్యూహాలను రూపొందించుకోవాలని యోచిస్తోంది. ఎన్నికల సమయంలో అటో.. ఇటో వెళ్తే దాని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని.. ముందుగానే ఓ వైఖరిని ఖరారుచేసుకుని.. దానిప్రకారమే జనంలోకి వెళ్లడమే మంచిదని పవన్‌కు పార్టీ నేతలు సూచించినట్లు తెలుస్తోంది. అలాగే పార్టీలో సంస్థాగతమైన నిర్మాణం బలహీనంగా ఉందని, దీనిని తక్షణమే బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేయబోయే ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత మూడేళ్లలో అధికార వైసీపీ సాగించిన అరాచకాలపై గళమెత్తడంతో పాటు భవిష్యత్‌లో సర్కారుపై ఏ తరహాలో యుద్ధం కొనసాగించేదీ ఆయన వెల్లడించే అవకాశాలున్నాయి.


సభ పండుగ వాతావరణంలో జరుగనుందని ఆ పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. దానికి ఇబ్బందులు సృష్టించవద్దని అధికారులకు, పోలీసులకు విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామ పరిధిలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఆవిర్భావ సభ ప్రాంగణంలో పార్టీ నేతలు కొణిదెల నాగబాబు, చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులతో కలిసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పవన్‌ కల్యాణ్‌ జనసైనికులకు ఈ సందర్భంగా దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ అహంకారం.. సామాన్యుల ఆత్మగౌరవానికి మధ్య పోరాటమే ఆవిర్భావ సభ అని వ్యాఖ్యానించారు.  వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.


బీజేపీతో పొత్తు ఉందా..?

రెండేళ్ల క్రితం జనసేన.. బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే ఈ పొత్తు పేరుకు మాత్రమే ఉందని.. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై రెండు పార్టీలూ కలిసి ఉద్యమాలు చేసిన దాఖలాల్లేవని రాజకీయ పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో తొలుత జనసేన పోటీచేయాలనుకుంది. ఆ తర్వాత బీజేపీకి అవకాశమిచ్చింది. కానీ ఆ పార్టీకి డిపాజిట్‌ కూడా రాలేదు. బద్వేలులో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగి ఓడిపోయింది. స్థానిక ఎన్నికల్లో కొన్ని చోట్ల  కలిసి పోటీ చేశారు కూడా.  గోదావరి జిల్లాల్లో స్థానికంగా టీడీపీ, జనసేన నేతలు అవగాహన కుదుర్చుకుని పరిషత్‌ ఎన్నికల్లో కొన్ని చోట్ల విజయం కూడా సాధించారు. మరోవైపు.. పవన్‌ బీజేపీ జాతీయ నాయకులతోనే ఎక్కువగా టచ్‌లో ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో పొత్తుపై ఆయన స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.


పోలీసుల అత్యుత్సాహం.. జనసేన ఫ్లెక్సీల తొలగింపు

జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా ఇప్పటం గ్రామం వద్ద పార్టీ శ్రేణులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించడం వివాదానికి దారితీసింది. జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్‌ కల్యాణ్‌ అభిమానులు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులకు స్వాగతం తెలుపుతూ ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. విజయవాడతోపాటు గుంటూరు వెళ్లే వారధిపైనా స్వాగత బ్యానర్లు కట్టారు. వాటిని తాడేపల్లి పోలీసులు ఆదివారం తొలగిస్తుండగా.. అదే సమయంలో విజయవాడ నుంచి ఇప్పటం గ్రామానికి వెళుతున్న నాదెండ్ల మనోహర్‌ కారు దిగి.. వారి పై ఆగ్రహం వ్యక్తంచేశారు. శాంతిభద్రతలను చూడాల్సిన పోలీసులకు ఫ్లెక్సీల తొలగింపుతో పనేమిటని ప్రశ్నించారు. ఈ ఫ్లెక్సీల వల్ల ట్రాఫిక్‌ స్తంభించిపోతోందని పోలీసులు వాదించారు. ట్రాఫిక్‌ ఎక్కడ ఆగిపోయిందో చూపాలని మనోహర్‌ గట్టిగా నిలదీయడంతో వారు మాటమార్చారు. శానిటరీ సిబ్బందికి తాము సహాయం చేస్తున్నామని చెప్పారు.

Updated Date - 2022-03-14T07:55:30+05:30 IST