రథం నిర్మాణంలో అగ్నికుల క్షత్రీయులకు ప్రాధాన్యత ఇవ్వాలి: పవన్

ABN , First Publish Date - 2020-09-24T18:17:49+05:30 IST

అంతర్వేది లక్ష్మీనారసింహుని ఆలయానికి నూతన రథం నిర్మాణంలో అగ్నికుల క్షత్రియులకు ప్రాధాన్యత ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.

రథం నిర్మాణంలో అగ్నికుల క్షత్రీయులకు ప్రాధాన్యత ఇవ్వాలి: పవన్

అమరావతి: అంతర్వేది లక్ష్మీనారసింహుని ఆలయానికి నూతన రథం  నిర్మాణంలో అగ్నికుల క్షత్రీయులకు ప్రాధాన్యత ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. అంతర్వేది లక్ష్మీనారసింహుని ఆలయానికి నూతన రథం నిర్మాణంలో ప్రభుత్వం ఆలయ సంప్రదాయాలు, స్థానికుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. అంతర్వేదిలో లక్ష్మీ నరసింహుడిని  అగ్ని కులక్షత్రీయులు తమ కుల దైవంగా పూజిస్తుంటారని.. ఈ ఆలయాన్ని అగ్నికుల క్షత్రీయుడైన కొపనాతి కృష్ణమ్మ నిర్మించిన సంగతి యావన్మందికి  విదితమే అని పేర్కొన్నారు. తొలి రథం కూడా కృష్ణమ్మ రూపొందించినదే అని ఆయన చెప్పుకొచ్చారు. శిథిలావస్థకు చేరిన ఆ రథం స్థానంలో ఇటీవల అగ్నికి ఆహుతి అయిన రథం కూడా స్థానిక అగ్నికుల క్షత్రీయులు తయారుచేసినదే అని తెలిపారు. ఇప్పుడు కొత్త రథం నిర్మాణంలో తమకు ప్రాధాన్యత లేకపోవడంపై అగ్నికుల క్షత్రీయ సంఘం వారు ఆవేదన చెందుతున్నారన్నారు.  రథం రూపకల్పన కమిటీలో అగ్నికుల క్షత్రీయులకు ప్రాతినిధ్యం లేకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. రథోత్సవం నాడు తొలి కొబ్బరికాయ కొట్టి రథాన్ని లాగేది అగ్నికుల క్షత్రీయులే అని... వారి మనోభావాలను గౌరవించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వారిని గౌరవిస్తూ రథం తయారీలో అగ్నికుల క్షత్రీయులను భాగస్వాములను చేయాలని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు. 


Updated Date - 2020-09-24T18:17:49+05:30 IST