కళాకారుల అరెస్టులు ఆగేదెన్నడు?

ABN , First Publish Date - 2021-01-08T06:28:28+05:30 IST

ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసులు అరెస్టు పద్ధతులను పాటించడం లేదు. సెక్షన్‌ 141 క్రింద నోటీసులు ఇవ్వడం లేదు. అరెస్టు వారెంటు చూపకుండానే ఆకస్మికంగా ఇంటి మీద దాడి చేసి సంఘాల బాధ్యులను బందీలుగా చేస్తున్నారు...

కళాకారుల అరెస్టులు ఆగేదెన్నడు?

ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసులు అరెస్టు పద్ధతులను పాటించడం లేదు. సెక్షన్‌ 141 క్రింద నోటీసులు ఇవ్వడం లేదు. అరెస్టు వారెంటు చూపకుండానే ఆకస్మికంగా ఇంటి మీద దాడి చేసి సంఘాల బాధ్యులను బందీలుగా చేస్తున్నారు. గత నెల 23న ప్రజా గాయకుడు కోటి అరెస్టే ఇందుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళేందుకు తెలంగాణ పోలీసులు సహకరించడం గర్హనీయం.


తెలంగాణ ప్రజా కళాకారులను ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళుతున్నారు. తెలంగాణ సాకారం కోసం గజ్జెకట్టి ఆడి, పాడిన, ప్రజా కళాకారుడు, ప్రజా కళామండలి ప్రధాన కార్యదర్శి జంగాల కోటేశ్వరరావు (కోటి)ను ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు గత నెల 23న హైదరాబాదులోని నాగోలు నుంచి ఎత్తుకుపోయారు. ఎల్‌బినగర్‌ పోలీసులు వెంట ఉండి వారిని సాగనంపారు. 2018లో వరవరరావును చిక్కడపల్లి పోలీసులు మహారాష్ట్ర పోలీసులకు అప్పగించారు. మేధావులు, కళాకారులు సమాజంలో నిర్వహించగల పాత్రను అర్థం చేసుకోవడంలో రాజ్యం విఫలమవుతోంది. 


ప్రజాగాయకుడు కోటిగా దేశానికి సుపరిచితుడు అయిన జంగాల కోటేశ్వరరావు ఒంగోలు జిల్లా చీమకుర్తి మండలం గుడిపుడివారిపాలెం గ్రామంలో 48 సంవత్సరాల క్రితం జన్మించాడు. తండ్రి కోటయ్య, తల్లి నారాయణమ్మ అక్షరజ్ఞానం లేని గాయకులు. తల్లిదండ్రుల స్ఫూర్తితో అతడు కూడా గాయకుడయ్యాడు. కోటి పాటకు కులం లేదు, కానీ కోటికి మాల కులం ఉంది. ఆ కారణంగా అతణ్ణి స్కూల్లో దూరంగా నిలుచోబెట్టి టీచర్లు పాటలు పాడించుకుని ఆనందించేవారు. గొంతు మధురమైనది, కులం మాత్రం అంటరానిది మరి! కోటి బిఏ చదువుతున్నప్పుడు కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. అయితే చుండూరులో ఊచకోతకు గురైన దళితుల కుటుంబాలకు సంఘీభావం తెలపడానికి అక్కడికి వెళ్ళాడు.


పోలీసులు దగ్గరుండి అగ్రకుల పెత్తందార్లతో దళితుల్ని నరమేధం కావించారని తెలుసుకుని పోలీసు ఉద్యోగంలో చేరకూడదని నిర్ణయించుకున్నాడు. ప్రజా కళామండలికి చెందిన ఇ.వెంకటేశ్వర్లు, జననాట్యమండలికి చెందిన కుమారి పాటలతో ఉత్తేజితుడైన కోటి చదువు, ఉద్యోగం వదిలిపెట్టి వారితో పాటు సాంస్కృతిక రంగం బాటలో నడిచాడు. దాంతో అతడి జీవన గమనం దిశ మారింది. బతుకు బాటలో బికారయ్యాడు. పాటకు అంకితమయ్యాడు. ఊరిలో అగ్రకుల పెత్తందార్లు దళితుల్ని తమ గుప్పిట్లో పెట్టుకొని బెదిరించి ఓట్లు వేయించుకునేవారు. దీనిని ఎదిరించిన కోటి దళితుల్ని చైతన్యపరచి ఏకీకృతం చేసి ఒక్కటి చేసి తను గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొని వార్డు మెంబర్‌గా ఎన్నికయ్యాడు. దళితులపై పట్టు సడలుతుందని భయపడిన అగ్రకులాలవారు అతడిపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపారు. 


2005 నుంచి హైదరాబాద్‌లో ఉంటున్న కోటి తెలంగాణీయుడైనాడు. తెలంగాణ యాస, బాసలో భాగమైనాడు. తెలంగాణలో జరిగిన ఏ ప్రజాసంఘం సభలు, సమావేశాలయినా, కోటి బృందం గొంతు వినపడకుండా జరగలేదు. మలిదశ పోరాటంలో గజ్జె కట్టి గ్రామాలన్నీ తిరిగి, ప్రత్యేక తెలంగాణ సాధన స్ఫూర్తిని రగిలించాడు. అందరి కళాకారులతో కలిసి ‘ధూంధాం’లు నిర్వహించాడు. ట్యాంక్‌బండ్‌ ముట్టడి, సకలజనుల సమ్మె, రహదారుల దిగ్బంధం వంటి అన్ని పోరాటాల్లో మమేకమై అనేక సభల్లో పాటలు రాసి, ఆడి, పాడాడు. ప్రజాకళామండలి తెలంగాణ పోరులో అంతర్భాగమయింది. తెలంగాణకు అన్ని రంగాల్లో జరుగుతున్న అన్యాయాలపై, అణచివేతలపై క్లుప్తంగా వివరిస్తూ ప్రజాకళామండలి అధ్యక్షుడు జాన్‌, ప్రభాకర్‌, రాజనర్సింహ, కోటి నాయకత్వంలో ‘నివురు గప్పిన నిప్పు’ డాక్యుమెంటరీని రూపొందించి ఉద్యమానికి ఊపునిచ్చారు. 


ప్రజాకళామండలి ఊహించినట్లుగానే తెలంగాణలో తీవ్ర నిర్బంధం అమలవుతున్నది. ఏ ప్రజాసంఘాలైతే తనతో భుజం కలిపి ఉద్యమం చేశాయో ఇప్పుడు ఆ సంఘాల పైనే ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రమైన ఆంక్షలు విధిస్తున్నారు. ప్రజాసంఘాల నాయకులను టార్గెట్‌ చేసి 2018 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 35 మందిని జైలుపాలు చేశారు. అందరిపైనా అప్రజాస్వామిక ‘ఊపా’ చట్టాన్ని, పబ్లిక్‌ సెక్యూరిటీ చట్టం లోని వివిధ సెక్షన్లు ప్రయోగించి దేశద్రోహులుగా ముద్రవేశారు. ఇంకా 90 మందిని అరెస్టు చేయడం కోసం వెంటాడుతున్నారు. దాదాపుగా అన్ని ప్రజాసంఘాల నాయకులకూ మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న అభియోగాలతో ఒక్కొక్కరిపై పదుల సంఖ్యలో కేసులు నమోదు చేశారు. 


తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తున్న మంచి పనులు ఏమైనా ఉంటే వాటిని స్ఫూర్తిగా తీసుకొని అనుసరించాలి కానీ, ఆయన అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాపీ కొట్టడం విచారకరం. కేసీఆర్ 2018 అక్టోబర్ నుంచి కొనసాగిస్తున్న అక్రమ అరెస్టుల పర్వాన్ని జగన్మోహన్‌రెడ్డి కూడా అందుకున్నారు. అవే సంఘాలు, అవే ఆరోపణలతో ఇప్పటికి 8 మందిని జైలు పాలు చేశారు. అమరుల బంధుమిత్రుల సంఘం అజమ్మ, చైతన్య మహిళా సంఘం రాజేశ్వరి, ప్రగతిశీల కార్మిక సంఘం అన్నపూర్ణ, ఆంజనేయులు, కొండారెడ్డి, న్యాయశాస్త్ర విద్యార్థిని క్రాంతి, ప్రజాకళామండలి విజయ్‌, ఇప్పుడు అదే సంఘం ప్రధాన కార్యదర్శి కోటిని జైలులో నిర్బంధించారు. కనీసం బెయిలు కూడా నిరాకరించే ఉపా, ఇతర అప్రజాస్వామిక చట్టాల సెక్షన్లు కింద వారిపై కేసులు నమోదు చేశారు. ఇంకా మరో 70 మంది ప్రజా సంఘాల నాయకులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నపూర్ణ అరెస్టుతో ఆమె మూడేళ్ళ చిన్నారి కుమార్తె తల్లి లేనిదయింది. అన్నపూర్ణ భర్త పైన కూడ ఉపా సెక్షన్లు నమోదు చేశారు. ఏ క్షణాన్నైనా అతణ్ణి అరెస్టు చేయవచ్చు. 


ఈ అరెస్టుల పరంపరలో భాగంగానే కోటిని గత నెల 23 తెల్లవారుజామున హైదరాబాదు నాగోల్‌లో అరెస్టు చేశారు. కోటి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో లేడీ కానిస్టేబుల్‌ ఒకరు, సివిల్‌ దుస్తుల్లో ఉన్న పోలీసులు తలుపులు తోసుకుని లోపలికి ప్రవేశించారు. ఎవరు మీరని కోటి భార్య మేరి అడిగితే ఎవరమో కోటినే అడగండని దురుసుగా సమాధానం చెప్పి నిద్రిస్తున్న అతణ్ణి తట్టి లేపారు. తాము ముంచింగిపుట్టు నుంచి వచ్చిన పోలీసులమని చెప్పి, బట్టలు మార్చుకొమ్మని తొందర పెట్టి, బెదిరించి, కాలకృత్యాలు కూడా తీర్చుకోనివ్వకుండా తీసుకెళ్లారు. ఎల్‌బినగర్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ డ్రస్సులో రంగప్రవేశం చేసి కోటి కాలర్‌ పట్టుకుని రెండో అంతస్తు నుంచి కిందికి తోసుకుంటూ తీసుకోళ్లారు. ‘మా నాన్న కాలర్‌ వదిలిపెట్టండ’ని అతడి కుమార్తె గట్టిగా గదమాయిస్తే వదిలిపెట్టారు. ‘ఎల్‌బినగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళుతున్నాం, సాయంత్రానికల్లా వదిలివేస్తామ’ని చెప్పి నేరుగా ఆంధ్రప్రదేశ్‌ తీసుకెళ్ళారు. దాంతో పౌరహక్కుల సంఘం కోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేసింది. 


ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసులు ఎవరైనా అరెస్టు చేసినప్పుడు అనుసరించాల్సిన పద్ధతులను ఏమాత్రం పాటించడం లేదు. సెక్షన్‌ 141 కింద నోటీసులు ఇవ్వడం లేదు. అరెస్టు వారెంటు చూపకుండానే ఆకస్మికంగా ఇంటి మీద దాడి చేసి సంఘాల బాధ్యులను బందీలుగా తీసుకుపోతున్నారు. తెలంగాణలో జరుగుతున్న అరెస్టుల తీరుతెన్నులు చట్ట వ్యతిరేకమైనవని ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్‌ గ్రహించాలి. సంక్షేమ పథకాలు ఎంతగా అమలుపరిచినా, వికృత నిర్బంధాన్ని ప్రయోగించిన రాచరిక ప్రభుత్వాలు కానీ, ప్రజాస్వామిక ప్రభుత్వాలు కానీ ఎల్లకాలం నిలబడలేదని ఆయన తెలుసుకోవాలి. నిర్బంధాన్ని ప్రయోగిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు వేడి సెగ చూపిస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవలి పరిణామాలు చాటుతున్న ఈ వాస్తవాన్ని జగన్‌ అర్థం చేసుకోవాలి. ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా అక్రమ అరెస్టులను నిలిపివేయాలి. 


-లక్ష్మణ్‌ గడ్డం

రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ పౌరహక్కుల సంఘం

Updated Date - 2021-01-08T06:28:28+05:30 IST