జపాన్‌ జెస్సీ ఒవెన్స్‌..

ABN , First Publish Date - 2020-09-14T09:38:39+05:30 IST

జపాన్‌ జెస్సీ ఒవెన్స్‌..

జపాన్‌ జెస్సీ ఒవెన్స్‌..

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

నవోమి ఒసాక.. 22 ఏళ్ల ఈ జపాన్‌ అమ్మాయి గెలిచింది మూడు గ్రాండ్‌స్లామ్‌లే. కానీ సమకాలీన సమాజంలో చోటుచేసుకొంటున్న అసమానతలపై ముఖ్యంగా జాతి వివక్షకు వ్యతిరేకంగా నిర్భీతిగా గొంతెత్తడం ద్వారా దిగ్గజ అథ్లెట్లు మహ్మద్‌ అలీ, జెస్సీ ఒవెన్స్‌ స్థాయి వ్యక్తిగా ప్రశంసలు అందుకుంటోంది. ఈసారి యూఎస్‌ ఓపెన్‌లో ఆటతోపాటు వ్యక్తిత్వంతో యావత్‌ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకొంది. అమెరికా పోలీసుల దమనకాండకు బలైన నల్లజాతీయుల పేర్లున్న మాస్క్‌లను తానాడిన ఒక్కో మ్యాచ్‌లో ధరించడం ద్వారా బ్లాక్‌ లైవ్‌ మూవ్‌మెంట్‌ (బీఎల్‌ఎం)కు సంపూర్ణ మద్దతు తెలిపింది. దాంతో ప్రపంచం నలుమూలలనుంచి ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఒసాక తల్లి జపాన్‌ వాసి కాగా, తండ్రి హైతీ దేశానికి చెందిన వ్యక్తి. నవోమి కుటుంబం ప్రస్తుతం లాస్‌ఏంజెల్స్‌లో నివసిస్తోంది.


వర్ణ వివక్షకు వ్యతిరేకంగా అమెరికాలో ఈ ఏడాది జరిగిన ఉద్యమాలకు ఒసాక జై కొట్టింది. అయితే అంతకుముందే ఆమె.. జపాన్‌ ముఖచిత్రం మార్చివేసే స్థాయిగల వ్యక్తిగా ఆ దేశంలో పేరు పొందింది. అమెరికాలో నల్లజాతీయులపై వివక్ష మాదిరి.. ఎప్పటినుంచో జపాన్‌లో ‘సజాతి సమాజం’ అన్న భావన బలంగా వేళ్లూనుకుంది. ఆ భావనను తుడిచిపెట్టేయగల సమర్థురాలు ఒసాక అని ఆదేశ వాసులు నమ్ముతున్నారు. నవోమిలోని పోరాటతత్వాన్ని గమనిస్తే.. విఖ్యాత నల్లజాతి అథ్లెట్లు మహ్మద్‌ అలీ, జెస్సీ ఒవెన్స్‌ స్థాయి కీర్తిప్రతిష్ఠలు ఆమె అందుకోగలదని జపాన్‌కు చెందిన ఆఫ్రికన్‌-అమెరికన్‌ సంతతి రచయిత బే మెక్‌నిల్‌ పేర్కొన్నారు. ‘అన్యాయం, అక్రమాలకు వ్యతిరేకంగా జెస్సీ ఒవెన్స్‌, మహ్మద్‌ అలీ జీవితాంతం పోరాడారు. ప్రస్తుతం నవోమి కూడా అదే బాటలో నడుస్తోంది. అందుకే ఆమె జపాన్‌ జెస్సీ ఓవెన్స్‌..’ అని మెక్‌నీల్‌ అభిప్రాయపడ్డారు.


హైతీ చరిత్ర చదివా: జాతి, సామాజిక న్యాయంపై మీ ఆలోచనా విధానానికి మూలం ఏమిటి? అని యూఎస్‌ ఓపెన్‌ గెలిచాక ఓ రిపోర్టర్‌ ఒసాకాను ప్రశ్నించాడు. అందుకు ఆమె.. ‘వాస్తవం చెప్పాలంటే హైతీ చరిత్ర మొత్తం చదివా. దాని గురించి నాన్న ఎప్పుడూ చెబుతుండేవాడు. పుస్తకాలు చదవడం ద్వారా మాత్రమే తప్ప..వార్తలను ఆధారంగా చేసుకొని జాతి, సామాజిక న్యాయాలపై అభిప్రాయాలను ఏర్పరచుకోరాదని అనేవాడు’ అని బదులిచ్చింది.


ఒసాకకు కృతజ్ఞతలు: అమెరికాలో మృతి చెందిన నల్లజాతీయుల పేర్లు ముద్రించిన మాస్క్‌లను యూఎస్‌ ఓపెన్‌లో ధరించడంతో ఒసాకాకు బాధితుల కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-09-14T09:38:39+05:30 IST