కాంగ్రెస్‌ పార్టీలో కుదుపు

ABN , First Publish Date - 2020-08-13T10:43:44+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ గ్రేటర్‌ వరంగల్‌ అధ్యక్ష పదవికి కట్ల శ్రీనివాస్‌ రాజీనామా చేశారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన

కాంగ్రెస్‌ పార్టీలో కుదుపు

గ్రేటర్‌ వరంగల్‌ అధ్యక్ష పదవికి కట్ల శ్రీనివాస్‌ రాజీనామా

తప్పుకున్నాడా..అధిష్ఠానం తప్పించిందా..?

రాజీనామాపై ముసురుకున్న అనుమానాలు


వరంగల్‌ సిటీ, ఆగస్టు 12: కాంగ్రెస్‌ పార్టీ గ్రేటర్‌ వరంగల్‌ అధ్యక్ష పదవికి కట్ల శ్రీనివాస్‌ రాజీనామా చేశారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బుధవారం కలిసి రాజీనామా పత్రం అందజేశారు. వెంటనే దాన్ని ఉత్తమ్‌ ఆమోదించారు. 


కాగా, ఈ అంశం అర్బన్‌ జిల్లా కాంగ్రె్‌సను కుదిపింది. హఠాత్తుగా జరిగిన రాజీనామా పరిణామం పార్టీలో హాట్‌ టాపిక్‌గా మారింది. రాజీనామాను టీపీసీసీ చీఫ్‌ ఆమోదించడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొద్ది రోజుల్లో గ్రేటర్‌ కాంగ్రెస్‌ నూతన కమిటీ ప్రకిటిస్తానని చెప్పిన కట్ల.. హఠాత్తుగా పదవికి రాజీనామా చేయడమేంటీ..? అనే సందేహాలు పార్టీలో నెలకొన్నాయి. ఆయన స్వయంగా తప్పుకున్నాడా? పార్టీలో వర్గపోరు కారణమా? సీనియర్లతో విభేదాలా? లేక శ్రీనివా్‌సపై ఏమైనా ఆరోపణలు వస్తే టీపీసీసీనే తప్పించిందా అనే చర్చ జరుగుతోంది.కొద్ది నెలల్లో జీడబ్ల్యూఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో కట్ల రాజీనామా ఘటన చర్చలకు తెరలేపింది. 


పెద్ద్ద పదవి కోసమే అంటున్న కట్ల వర్గీయులు

పార్టీలో మరో కీలక పదవిని పొందడానికే గ్రేటర్‌ అధ్యక్ష పదవికి కట్ల శ్రీనివాస్‌ రాజీనామా చేశారనే వాదనలు ఆయన వర్గీయుల నుంచి వినిపిస్తున్నాయి. శ్రీనివాస్‌ కూడా ఇదే విషయాన్ని పరోక్షంగా సన్నిహితులతో చెబుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు తమ నాయకుడికి అండదండలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాజీనామా విషయం తెలియగానే ఆ పదవిని తమకంటే తమకు కేటాయించాలనే విజ్ఞప్తులు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.


అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు

గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కట్ల శ్రీనివాస్‌ రెండు పర్యాయాలు ఎంపికయ్యారు. మొత్తం నాలుగు సంవత్సరాలు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. 2016లో గ్రేటర్‌ అధ్యక్షుడిగా తాడిశెట్టి విద్యాసాగర్‌ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కట్ల శ్రీనివాస్‌ వచ్చారు. కాగా, గ్రేటర్‌ కాంగ్రెస్‌ కమిటీని జూలై 1న శ్రీనివాస్‌ రద్దు చేశారు. త్వరలో నూతన కమిటీ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ మేరకు కసరత్తు చేపట్టారు. నూతన కమిటీతో జీడబ్ల్యూఎంసీ ఎన్నికలను ఎదుర్కొంటామని శ్రీనివాస్‌ ప్రకటించారు. అందరి దృష్టి కమిటీపై ఉన్న సందర్భంలో ఏకంగా తానే అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో అంచనాలు తారుమారు అయ్యాయి.  

Updated Date - 2020-08-13T10:43:44+05:30 IST