విమానం ఎక్కే క్రమంలో.. కాలుజారి కిందపడ్డ బైడెన్ !

ABN , First Publish Date - 2021-03-20T16:55:21+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమానం ఎక్కే క్రమంలో మెట్లపై కాలుజారి కింద పడ్డారు.

విమానం ఎక్కే క్రమంలో.. కాలుజారి కిందపడ్డ బైడెన్ !

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమానం ఎక్కే క్రమంలో మెట్లపై కాలుజారి కింద పడ్డారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో కలిసి అట్లాంటా వెళ్లేందుకు జాయింట్ బేస్ ఆండ్ర్యూస్ వద్ద తన అధికారిక విమానం 'ఎర్‌ఫోర్స్ వన్' ఎక్కుతున్న సమయంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటనలో అధ్యక్షుడికి ఎలాంటి గాయాలు కాలేదని, ఆయన పూర్తి సురక్షితంగా ఉన్నట్లు వైట్‌వైస్ వెల్లడించింది. కాగా, మంగళవారం అట్లాంటా రాష్ట్రంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల ఘటనల్లో ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. వీరిలో ఆరుగురు ఆసియా మహిళలు ఉన్నారు. వీరందరూ స్థానిక మసాజ్ పార్లలలో పనిచేస్తున్న వారు.


ఈ ఘటనల నేపథ్యంలోనే ఆసియా కమ్యూనిటీని కలిసేందుకు బైడెన్, కమలా శుక్రవారం అట్లాంటా వెళ్లారు. ఆ సమయంలోనే అధ్యక్షుడు బైడెన్ విమానం ఎక్కుతుండగా మెట్లపై కాలుజారి రెండుసార్లు కిందపడ్డారు. అనంతరం తనంతట తాను పైకి లేచి విమానం ఎక్కారు. ఈ ఘటనతో అధ్యక్షుడి సహాయ బృందం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కానీ, ఆయనకు ఏమీ కాకపోవడంతో వారందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో బైడెన్‌కు ఎలాంటి గాయాలు కాలేదని, ఆయన సురక్షితంగానే ఉన్నట్లు వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ కేట్ బెడింగ్‌ఫీల్డ్ వెల్లడించారు. 

Updated Date - 2021-03-20T16:55:21+05:30 IST