బైడెన్ ఫాలో అవుతున్న నటి.. ఆమె వెనుక ఉన్న కథేంటంటే
ABN , First Publish Date - 2021-01-22T17:34:34+05:30 IST
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్‌కు ట్విటర్.. యూఎస్ అధ్యక్షుడి అధికారిక ఖాతా @POTUSను నియంత్రణకు ఇచ్చింది.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్‌కు ట్విటర్.. యూఎస్ అధ్యక్షుడి అధికారిక ఖాతా @POTUSను నియంత్రణకు ఇచ్చింది. మాజీ అధ్యక్షుడు ట్రంప్ నుంచి ఈ అకౌంట్‌ను బైడెన్‌కు ట్రాన్స్‌ఫర్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ ఖాతా నుంచే బైడెన్ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ అకౌంట్‌కు కేవలం 24 గంటల వ్యవధిలో 53 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చి చేరడం గమనార్హం. ఇక ఈ ఖాతా ద్వారా బైడెన్ కేవలం 13 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. వీరిలో ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, ఇతర శ్వేతసౌధం సిబ్బందితో పాటు ఓ నటి కూడా ఉన్నారు. ఆమె ఎవరో కాదు. అమెరికన్ టెలివిజన్ స్టార్, రచయిత, మోడల్ అయిన క్రిస్సీ టైగెన్. అయితే, బైడెన్ క్రిస్సీని ఫాలో కావడం వెనుక పెద్ద కథే ఉంది.
సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే క్రిస్సీ.. గతంలో ట్విటర్ వేదికగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పలుమార్లు విమర్శలు చేశారు. దీంతో తీవ్రంగా స్పందించిన ట్రంప్.. ఆమెను @POTUS ఖాతాలో బ్లాక్ చేశారు. అయితే, బుధవారం ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడం.. కొత్తగా బైడెన్ బాధ్యతలు చేపట్టడంతో క్రిస్సీ గురువారం ఓ ట్వీట్ చేశారు. 'నాలుగేళ్లుగా @POTUS అకౌంట్‌లో నన్ను బ్లాక్ చేశారు. ప్లీజ్.. మీరు ఫాలో అవ్వగలరు' అని రిక్వెస్ట్ చేశారు. ఆమె అభ్యర్థనను బైడెన్ మన్నించడంతో పోటస్ అధికారిక ఖాతా ఫాలో అవుతున్న వారిలో క్రిస్సీ కూడా చేరారు. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బైడెన్ ఫాలోయింగ్ లిస్ట్‌ను షేర్ చేసిన క్రిస్సీ.. అందులో తన అకౌంట్ కూడా ఉండడంతో 'ఓ మైగాడ్.. ఇప్పటికి నేను ఇది నమ్మలేకపోతున్నా' అంటూ ట్వీట్ చేశారు. కాగా, ట్రంప్ బ్లాక్ చేసిన నటిని.. బైడెన్ అన్‌బ్లాక్ చేసి ఫాలో కావడం గమనార్హం.